బాల్యంలోనే తండ్రిని పోగొట్టుకుని
అక్షరం ముక్క వస్తే అన్నానికి లోటు 0డదన్న
మాతృమూర్తి మాటవిని
వారాలబ్బాయిగా పొట్టనింపుకుని
విద్యార్థిగా ప్రతిభ చూపి పరుల సహాయంతో
విదేశాలకు వెళ్ళి
బారిస్టరు పట్టా పొంది
లక్షలాది రూపాయల నెలసరి సంపాదన వస్తున్న
న్యాయవాది వృత్తిని మహాత్మాగాంధీ, బిపిన్ చంద్రపాల్ ప్రసంగాలతో వదలి
స్వాతంత్య్ర సంగ్రామంలో సైమన్ కమిషన్ కు
వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో
ఆంగ్లేయుల బుల్లెట్లకు ఎదురుగా ధైర్యంగా గుండెను పెట్టిన
మీరు మా పాలిట ఆంధ్రకేసరి అన్నది అక్షర సత్యం.
ముప్పది ఐదు సంవత్సరాలకే
రాజమహేంద్రవరం పురపాలక సంఘం అధ్యక్షునిగా ఎన్నికై
ఇంతింతై వటుడింతై అన్నట్లు
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో
రాజాజీ మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా
ఆ తరువాత ఆంధ్రరాష్ట్రపు తొలి ముఖ్యమంత్రిగా
సమాజహితమే ధ్యేయమని
నిష్కళంక నిజాయితీతో ముక్కు సూటిగా పనిచేసి
కుటిల రాజకీయ నాయకుల కుతంత్రాలకు లొంగక
పదవిని తృణప్రాయంగా త్యజించి
సర్వస్వాన్ని సమాజంకొరకు త్యాగం చేసిన
మీరు నేటి తరం ప్రజలకు మార్గదర్శకులు
అందుకోండి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు
మీకివే నే సమర్పిస్తున్న అక్షరాంజలులు....!!
..............................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి