దేశ్ ప్రేమీ సేవా సంఘటన్ వందేమాతరం పోటీల్లో ప్రతిభ చాటిన తిరుమలరావు.
 

పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు, దేశ్ ప్రేమీ సేవా సంఘటన్ సంపూర్ణ వందేమాతరం ప్రశంసాపత్రం సాధించారు. ఈ మేరకు గుంటూరు దేశ్ ప్రేమి సేవా సంఘటన్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గేయ ప్రచారోద్యమంలో పాల్గొని తిరుమలరావు ఈ ఘనత పొందారు. ద్వితీయ, తృతీయ స్థానాలలో గుంటూరు చిన్మయ విద్యాసంస్థ విశ్రాంత ఉపాధ్యాయని బెల్లంకొండ విజయలక్ష్మి, మంగళగిరికి చెందిన ఘనపాల గణపతి నాయక్ లు నిలిచారని ఆయన పంపిన సమాచారంలో పేర్కొన్నారు.
భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రేరణగా నిలిచి, సమర నినాదంగా మారి, దాస్య శృంఖలాలను తుత్తునియలు చేసి, ఉరికంబాలెక్కిన సమర యోధుల నోట నారాయణ మంత్రంగా నిలిచిన చారిత్రాత్మక గీతం వందేమాతరంను సంపూర్ణంగా ఆలపించాలన్న సద్భావనతో అంతర్జాలం ద్వారా ఈ కార్యక్రమం చేపట్టారు.  బంకించంద్ర ఛటర్జీ రచించిన ఈ అమరగీతం ఈ ఏడాది 150సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వందేమాతరం యువ సంకల్ప్ ఆధ్వర్యంలో, లైవ్ భారత్ ఫౌండేషన్, దేశ్ ప్రేమి సేవా సంఘటన్ ల సౌజన్యంతో  ఈ పోటీలు నిర్వహించగా తిరుమలరావు స్వదస్తూరీతో మొత్తం ఆరుచరణాల పాటను లిఖించి పంపారు. దేశ్ ప్రేమి సేవా సంఘటన్ అధ్యక్షులు ఈదర శ్రీనివాస రెడ్డి, ఇండియన్ వెటరన్ ఆర్మీ బ్రిగాడియర్, నేకూరి రోజ్ బాబు, సెంట్రల్ లేబర్ వెల్ఫేర్ బోర్డు మాజీ ఛైర్మన్ జయప్రకాష్ నారాయణలు తిరుమలరావు ప్రతిభను అభినందిస్తూ ఉత్తమ స్థాన ప్రశంసాపత్రం పంపారు. తనను ఉత్తమ స్థానంలో నిల్పి ప్రశంసాపత్రం పంపిన శ్రీనివాసరెడ్డి, రోజ్ బాబు, జయప్రకాష్ నారాయణలకు తిరుమలరావు కృతజ్ఞతలు తెలిపారు.
సంపూర్ణ వందేమాతరం గీతం ఈ ఏడాది నుంచి అధికారిక కార్యక్రమాల్లో సంపూర్ణ వందేమాతరం ఆలపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించగా ఇటీవల 80వ స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశమంతటా పూర్తి పాట మారుమ్రోగింది. ఈ తరుణంలో తిరుమలరావు ప్రశంసాపత్రం పొందుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు