నెలకు ఒక రూపాయి వేతనం!: - - యామిజాల జగదీశ్




 స్వతంత్ర భారతదేశ తొలి రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు నెలకు కేవలం ఒక్క రూపాయి వేతనంతో దేశానికి తన సేవలను కొనసాగించారు!
1906లో ఉదయపూర్‌లో జన్మించిన డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారికి 12 ఏళ్లు నిండకముందే తండ్రి చనిపోయారు. చిన్న వయసులోనే కష్టాలు ఎదురైనా, చదువు ద్వారా తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే శక్తిని ఆయన కూడ గట్టుకున్నారు.
ఉదయపూర్ మహారాణా అందించిన ఉపకార వేతనంతో (స్కాలర్‌షిప్) అలహాబాద్ విశ్వవిద్యాలయంలో చేరిన ఆయన, అక్కడ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త మేఘనాద్ సాహా శిష్యరికం లో విద్యనభ్యసించారు. ఆయన ప్రతిభ కారణంగా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాల యంలో ప్రవేశం దొరికింది. అక్కడ నోబెల్ బహుమతి గ్రహీత లార్డ్ ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్‌తో కలిసి పనిచేసి భౌతిక శాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు.
ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ భౌతిక శాస్త్ర విభాగాన్ని దాదాపు శూన్యం నుంచి నిర్మించడం లో కీలక పాత్ర పోషించారు.
1948లో, స్వతంత్ర భారతదేశ రక్షణ మంత్రికి తొలి సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం భారీ వేతనం ఇవ్వనప్పటికీ, బోధనపై ఉన్న మక్కువతో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌గా తనకు వచ్చే వేతనాన్నే తీసుకోవడానికి ఆయన మొగ్గుచూ పారు.
ఆ పదవీకాలం తర్వాత కూడా, నెలకు కేవలం ఒక్క రూపాయి నామమాత్రపు వేతనంతో గౌరవ శాస్త్రీయ సలహాదారుగా తన సేవలను కొనసాగించారు.
ఆ తర్వాత యూజీసీ ఛైర్మన్‌గా చరిత్రమైన కొఠారి కమిషన్‌కు ఆయన నాయకత్వం వహించారు. ఈ కమిషన్ భారతదేశ విద్యావ్యవస్థ రూపరేఖ లను మార్చడంతో పాటు, దేశంలో ఉన్నత విద్యా నిర్మాణం, పోటీ పరీక్షల విధానంపై తీవ్ర ప్రభావం చూపింది. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ఛాన్సలర్‌గా కూడా ఆయన విధులు నిర్వర్తించారు.
డాక్టర్ కొఠారి పద్మభూషణ్, పద్మవిభూషణ్ సహా భారతదేశ అత్యున్నత పౌర, శాస్త్రీయ పురస్కారాలను అందుకున్నారు. కానీ శాస్త్రీయ, రక్షణ, విద్యా వ్యవస్థలను పటిష్టం చేయడంలో ఆయన అందించిన తోడ్పాటే ఆయన దేశం సాధించిన అతిపెద్ద ఘనత.
నేటికీ భారతదేశాన్ని ప్రభావితం చేస్తున్న సుదీర్ఘ వారసత్వాన్ని మిగిల్చి 1993లో జైపూర్‌లో ఆయన కన్నుమూశారు.
కామెంట్‌లు