సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 

 సామెత -319: ఇనుమును కూడిన అగ్నికి సమ్మెట పోట్లు తప్పువు
**
"వొద్దురా! అయ్యా!అంటే యింటెనా?ఎన్ని త్యేపల శెప్పిన్నో. శెప్పి శెప్పి నోరు నొప్పి బుట్టిందిగని ఆవిత్తంత తేడా వొచ్చిందా?"
 "గిప్పుడు శేతులు గాలినంక ఆకులు బట్కుంటే ఏం ఫాయిదా?"
"గందుకే పెద్దోళ్ళ మాట పెర్గన్నం మూటని ఊకెనే అన్లే. గిప్పుడు సూడు యింటిమీదికొచ్చింది ఏం జేయాల్నో తెల్వట్లే.కాల్జేతులు ఆడట్లేదవ్వా!"
 "ఏంది శెల్లే! ఏమైంది? గంత పరేషాన్ గున్నవ్? ఎవలిమీద అరుత్తున్నవ్? మా మర్ది మీదనా? కొడుకు శందూ మీదనా?"
 "గిప్పటి దన్క శందూ గాడి మీద అర్శిన.ఇంగిప్పుడు మీ మర్ది మీదనే అర్వాలె అవ్వా! గాడు సద్వుకోను పొయ్యేతందుకు టుక్ టుక్ మోటరు గావాలె అనంగనే గానికి కట్టమైతదని పైసలు మిత్తికి బట్కొచ్చి కొనిచ్చిండు.గదే కొనియ్యకుంటె గింత కాడికి వొచ్చేదే కాదు.
 "అయ్యో! ఏమైంది శెల్లే! గాడు సద్వు బాగ సద్వుతడు.బుద్ధివంతుడని అందరం అన్కుంటం.గాడేం జేసిండు.గింతకీ ఏం జర్గింది శెల్లె?"
 "అవునవ్వా! మన బంగారం మంచిదే గని గాని దోత్తు బద్రిగాడుండు సూడు.గానితో సోపతి బట్టిండు.గీనికున్న మంచి పేరు కాత్త మంట్లె గల్శింది. గదంత నీ మర్ది బండి కొనిచ్చుడుతోనె వొచ్చింది.అస్లు గీన్ని గాదు మీ మర్దిని అనాలె ?" 
 'గింతకీ ఏమైంది శెల్లే? గాని దోత్తు బద్రిగాడు ఏం జేసిండు?"
 "ఏం జేశిండా! దినాం సద్వుకోను మనోడి బండి మీదనే పోతుండంట.పిట్రోలుకు పైసలిత్త ఒక్కనికే గంత కర్సు ఎందుకు తీ అంటే గీడు సుత సర్నెన్నడంట. గట్ల దినాం పొయ్యొత్తుర్రు. పాఠాలు యిన్కుంట గీడుంటే గిప్పుడే వొత్తరా బై అన్కుంట మనోడి బండి పట్క బోవుడు.ఓ పొల్ల తానికి  బొయ్యి దినాం పేమించమని అద్రిచ్చి బెద్రిచ్చుడట.గట్ల షిడాయిత్తుంటే గా పొల్ల దోత్తురాలొకతి గజ్జూసి పోలిసోల్లకి ఉప్పందించిందంట.
" గా పొల్ల ఎవతో గని శానా మంచి పని శేసింది శెల్లే! పోలీసోల్లు గా బద్రి గాని ఈపు యిమానం మోత మోయిచ్చిర్రా. ఇంకోపాలి గస్మంటి పనులు శెయ్యకుంట బాగనే ఉత్కాలె శెమ్డాలూడ దియ్యాలె.ఇంకోపాలి శెయ్యకుండ."
 "గట్లయితే బాగనే వుండవ్వా! గానితో తిర్గినందుకు మా వోడు సుత అస్మంటోడే అన్కొని టేషన్ కి పిల్శి పశ్నల మీద పశ్నలు ఏత్తుర్రంట.గదేదో తేలే దనుక బండిని గాళ్ళ తాననే ఉంచుకుంటరట. దినాం పిలుత్తుర్రు. గియ్యన్ని జర్గుతుంటే బయవడ్తూ గిప్పుడు శందూ గాడు గజ్జున వొనుకుతుండు.మీ మర్దేమో యిజ్జత్ బోయిందని రంది వడ్తున్నడు. ముందుగాల్నే  శెప్పినట్టు యింటే గింత కాడికి వొచ్చేదేనా శెప్పవ్వా!"
 ఒకోపాలి ఉర్ముర్మి మంగలం మీద వడుడంటే గిదే మరి. మనోడెంత అగ్గి అస్మంటోడైనా ఇనుమస్మంటోని దోత్తుగాని సోపతి పట్టుడుతో  గీనికి పోలీసోల్ల మాటల పోట్లు తప్పలే."
"అవునవ్వా! గిప్పుడు నువ్వన్నట్టుగనే అయ్యింది.గండ్ల నించి ఎట్ల బయిట పడ్తడో నా కొడుకు.బయమేత్తుందవ్వా!"
 "శెల్లే మా తమ్ముని కొడ్కు టేషన్లనే శేత్తుండు.మన శందూ గాని యిష్యం శెప్త తీ.బండి, ఆడికి ఏం గాదు.మంచిగొత్తడు.మర్దిని సుత రంది వడొద్దని శెప్పు శెల్లే!"
గదండీ సంగతి!"ఇనుముతో కూడిన అగ్గికి సమ్మెట పోట్లు తప్పవు" అంటే గిదే మరి. ఎంత మంచోడు,అగ్గి అస్మంటోడైనా ఇనుమస్మంటోనితో దోత్తు శేత్తే గిట్లనే వుంటది.జెర జాగర్తరుల్లా."
కామెంట్‌లు