మత్తేభము.
వరలక్ష్మీయని పిల్చినంత గరిమన్ భాగ్యంబునందింతువే!
సిరివై నిల్తువు భక్తవాహినికి సంశ్రేయంబు చేకూర్చుచున్
గరుణావార్ధివి నీదు నోము సలుపన్ కామ్యంబు లీడేర్చునిన్
స్థిరమౌ చిత్తము తోడ గొల్తు జననీ!చింతల్ తొలంగించుమా!//
2.
శార్దూలము
శ్రీ వైకుంఠనివాసినీ!హరిసఖీ!శ్రీలన్ బ్రసాదించుచున్
దేవీ!ధారుణి నేలు చుందువుకదా!దీనార్తి సంహారిణీ!
సేవింతున్ రమ!భక్తియుక్త నగుచున్ జిత్తంబునన్ నిల్వుమా!
కైవల్యంబును గోరి నీ సరసనే కైమోడ్చి నిల్తున్ శుభా!//
3.
మత్తేభము.
హరికిన్ పట్టపు రాణివై జగతికై యానాంద సంధాయివై
సిరివై భాగ్యము లిచ్చి కాచెదవు సౌశీల్యంబుతోన్ దల్లివై
తిరుచానూరున గొల్వుతీరి రమవై చింతామణీ భాతివై
పరమున్ జూపెదవమ్మ!భక్తతతికిన్ బ్రార్థింప నిన్ శుద్ధతన్.//
4.
మత్తేభము.
మునులున్ యోగులు సాధనల్ సలుపుచున్ పుణ్యాత్ములై మెల్గుచున్
బ్రణతిన్ దల్పగ దర్శనంబు నిడుచున్ బ్రాపున్ బ్రసాదింతువే!
విరసం బేటికి చూపుచుందువకటా!ప్రీతిన్ గటాక్షించి నన్
దరహాసంబును జిల్కిసాకుకొనుమా!తల్లీ!జగద్రక్షకీ!//

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి