సామెతల ఊట -సునందమ్మ నోట; - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం


 సామెత -317: ఇంటికో పువ్వు -ఈశ్వరుడికో దండ


"అవ్వా! అవ్వా! గీ యిష్యం యిన్నవా?పోశమ్మత్త పెయ్యి మంచిగ లేదంట. కూలికి బొయిన తాన ఉన్నట్టుండి ఇర్సుక పడ్తె ముఠా మేత్రి శిలకమ్మత్త లేపి ముఖం మీద నీళ్ళు గొట్టి ,పెయ్యి తుడిశి, గుండెల నొప్పంటే ఎంటనే శలమయ్యమావని పిలిపిచ్చిందంట. నాటెయ్యొచ్చిన అమ్మలక్కల సాయంతో ఆటో ఎక్కిచ్చుకుని, శలమయ్య ఎంట దవాఖానాకి బొయ్యిందట.
" అయ్యో అవునా శెల్లే! ఎప్పుడట్లయ్యింది. నాకు తెల్వకనే పాయె?గిప్పుడెట్లుంది? పానం మంచిగుందా? డాకటరు ఏవఁన్నడు? "
" పట్నం దీస్కబోయి పెద్ద దావఖాన్ల ఆప్రిషను జేయించాలె.శానా కర్సయితది. పైసలకు దడిత్తే పానం మీద కొత్తది. ఇంకోపాలి  రాకముందే జాగర్త పడాలె అన్నరంట అవ్వా! రెక్కాడితే గని డొక్క నిండని బత్కులు.గన్ని పైసలేడున్నయని శలమయ్య మావ రంది శేత్తున్నడు. గా మావని సూత్తుంటే మస్తు దుఃఖమొచ్చిందవ్వా!"
"అవును శెల్లే! నువ్వు శెప్తుంటె నాకు సుత దుక్కమొత్తుంది.పోశమ్మత్త, శలమయ్య మావఁ కి ఆత్తిపాత్తులు లేకపొయినా ఊల్లె అందర్ల తల్కాయల నాలిక లెక్క ఉంటరు‌.ఎవ్వలొచ్చినా శెయ్యి  గడగనీయకుండ పోనియ్యరు. మన ఈదిల అయినోళ్ళల్ల గా అత్త  శేతొంట తిననోళ్ళు లేరంటె ఆచ్చిరం గాదు. ఇంగ మావఁ శేసే అడావిడి అంతింత గాదు. ఇంటికొచ్చినోళ్ళకి ఇంటెన్కాల జాంపండో,సపోట పండో కోశి శేతుల బెట్టే మంచి మనసున్నోడు. గస్మంటి మంచోళ్ళకి గింత కట్టం వొచ్చిందంటే మన్సు కలికలి అయితుంది శెల్లే."
 "అవునవ్వా!తెల్శిన కానించి మన్సుల మన్సు లేదు. ఎట్ల మావఁ గీ కట్టం నుంచి బయిట పడ్తడు.అత్త కేమన్నైతే అమ్మో గద్దల్సుకుంటెనే గుండె పిండినట్టైతంది. మావఁ పిల్లల ఆమ్దాని అంతంత మాత్తరమే. గాళ్ళు ఏం జెయ్యలేక గుడ్ల నీళ్ళు కుక్కుకుంటుంటే సూల్లేకపోయిన అవ్వా!"
 ' ఇగ్గో శెల్లే! ఎంత కట్టానికైన గదిబొయ్యే ఓ తొవ్వ వుంటది.గదే యిశారిత్తుంటే ఓ సామెత యాదిలకొచ్చింది."
 "అవ్వా! గీ సయిమంల సమస్సె యాదికి రావాలె గని సామెత యాదికొచ్చుడేందవ్వా శిత్రంగుంది."
 " శోకం నించి శోల్కం బుట్టిందని రామాయిణం యిన్న మనకి తెల్సుగద.గట్లనే గిది సుత. "ఇంటికో పువ్వు - ఈశ్శర్నికో దండ "అన్న సామెతిన్నవా?"
 "గందుల ఏవుందవ్వా జెండా పండ్గదినాన బడి పిల్లగాండ్లు పతొక్కలు గాళ్ళ ఇండ్లల్ల  పూశిన పూలు బట్కబొయ్యి దండ గట్టి బర్తమాత పుటువాకి గాంధీ తాత, అంబేద్కర్ పుట్వాకి ఏత్తరు.గట్లనే దేవుండ్ల పెండ్లిల్లల్ల, బత్కమ్మ పండగప్పుడు సుత గిట్లనే తీరొక్క పూలతో దండలు గట్టుడు,పేర్సుడు శేత్తరు.గా ముచ్చెటినేనా నువ్వు శెప్పేది అవ్వా!"
 "శెల్లే! గింత కట్టంల గట్ల యిశారిత్తరా ఎవలైన? గందులోపలి యిష్యం సమజవ్వలే నీకు. మనూల్లె అందరం ఇంటికో వొందో యాబైనో ఎవలికి శేతనైనంత ఆళ్ళం ఏస్కుంటే రొండో మూడో లచ్చలు కాకుండ బోతయా శెప్పు."ఇంటికో పువ్వు లెక్క ఇంటికిన్ని పైసలేస్కుంటె మన పోశమ్మత్త గుండె ఆప్రీషను మంచిగైతది.ఎన్కటి లెక్క మల్ల మనతో కలిసి తిర్గుతది శెల్లే!"
 "ఎంత మంచి ముచ్చెటి శెప్పినవ్ అవ్వా! గిప్పుడే పోదాం.రచ్చబండ తాన  శానామంది కూసుని గీ యిస్తే యిశారిత్తుర్రు.గీ ముచ్చెటి శెప్తే సంబురపడ్తరు.ఇంగ పా! ఎల్దాం."
 "గట్లనే శెల్లే! పోదాం పా!"
"గదండీ సంగతి! ఇంటికో పువ్వు- ఈశ్వరుడికో దండ" అన్నట్టు అందరు కల్శిమెల్శి ఇంటికి శాతయినంత ఏసుకొంటే ఎవ్వలికి బర్వనిపియ్యదు. సమస్సె గట్టెక్కొచ్చు. మీరు ఏవంటరుల్లా?"
కామెంట్‌లు