అపురూపమైన బంధం.: - పాలగుమ్మి జ్యోతి.
     
   

ఒక అడవిలోని గుహలో శంఖిణి అనే బ్రహ్మ రాక్షసి నివసిస్తోంది, దానికి పిల్లలు లేరు. వాళ్ళ రాక్షసులలోనే ఉన్న చుట్టాల పిల్లలను దత్తత తీసుకోమని అడిగినా, తను రాక్షసి అయినప్పటికీ, తరతరాలుగా కోరలు, కొమ్ములతో భయంకరమైన రూపంగల రాక్షస సంతతిని తన పిల్లలుగా దత్తత  చేసుకోవడానికి  ఇష్టపడలేదు. ఒకరోజు బాగా ఆకలిగా ఉండి భూలోకంలో ఉన్న రాజుగారు కోటకు వచ్చి అక్కడ కడుపునిండా కావలసినన్ని ఏనుగులు, అశ్వాలను తిని వెళుతూ ఉంటే అంతఃపురంలోని  మందిరంలో హంసతూలికా తల్పంపై పడుకున్న యువరాణి మాళవిక కనిపించింది.
               మాళవిక మందిరంలోకి ప్రవేశించి తనని తదేకంగా చూస్తోంది శంఖిణి. నిండా పదిహేను ఏళ్ళు ఉండవు, ఎంతో ముద్దుగా, తెల్లగా మెరిసిపోతూ చాలా అద్భుతమైన సౌందర్యంతో ముచ్చట గొలుపుతోంది మాళవిక.  తనకి పిల్లలు లేకపోవడంతో 'పెంచుకుంటే ఈ అద్భుత సౌందర్యరాశి అయిన బాలికను కూతురుగా పెంచుకోవాలి. ఈ బాలికను చూసి మా రాక్షసులంతా అసూయపడతారు' అని మాళవిక అందాన్ని మంత్రముగ్దురాలై చూస్తూ ఉండిపోయింది శంఖిణి.
                 పహారా కాస్తున్న భటుల శబ్దానికి మాళవికను మైమరచి  చూస్తున్న శంఖిణి ఉలిక్కిపడి, నిదురిస్తున్న మాళవికను హంస తూలికా తల్పంతో సహా అమాంతం ఎత్తుకు పోసాగింది. ఆ కదలికలకు మెలకువ వచ్చిన మాళవిక బ్రహ్మ రాక్షసిని చూసి భయంతో కేకలు వేసింది. క్రింద కాపలా కాస్తున్న భటులు ఆ కేకలు విని  తలలు పైకెత్తి చూస్తే శoఖిణి యువరాణి మాళవికను  అపహరించుకుపోతూ ఆకాశంలో కనిపించింది. వెంటనే పరుగున మహా మంత్రి వద్దకు వెళ్ళి విషయం తెలియజేస్తే, మంత్రిగారు హుటాహుటిన మహారాజుని దర్శించి యువరాణి వారిని బ్రహ్మ రాక్షసి అపహరించిన విషయం తెలియజేశారు. మహారాజు అందరిని సమావేశపరిచి ఎలాగైనా యువరాణి వారిని ఆ బ్రహ్మ రాక్షసి వద్దనుంచి  తీసుకురమ్మని సైన్యాధిపతికి  ఆజ్ఞను జారీ చేశాడు.
              ఇదంతా అక్కడే ఉండి గమనిస్తున్న యువరాజు విక్రమవర్మ తన తండ్రి గారితో "నాన్నగారు! చెల్లాయిని నేను ఒక్కడినే తీసుకువస్తాను, ఇంతమంది ఒక్కసారిగా ఆ రాక్షసి మీదకు దండెత్తి వెళితే ఆ రాక్షసి మా చెల్లిని ఏమైనా చేయవచ్చు, తన ప్రాణాలకే ప్రమాదం వాటిల్లవచ్చు" అన్నాడు విక్రమ వర్మ. పుత్రుని పరాక్రమం గురించి ఎరిగిన మహారాజు, విక్రమ వర్మను ఒంటరిగా  పంపేందుకు అంగీకరించి యువరాణి మాళవికను రాజ్యానికి సురక్షితంగా తీసుకురావాల్సిన బాధ్యతని తన ఇరవై ఏళ్ళ కొడుకు యువరాజు విక్రమ వర్మకు అప్పగించాడు. విక్రమ వర్మ చెల్లెలిని అన్వేషిస్తూ బయలుదేరాడు.
              పిల్లలు లేని శంఖిణి రాక్షసి అయినప్పటికీ మాళవికను చాలా ప్రేమగా చూసుకుంటోంది. మొదట దాని రూపం చూసి భయభ్రాంతులకు గురయ్యింది మాళవిక.  కానీ శంఖిణి తనను ప్రేమగా చూసుకోవడం, తన కోసం ఎక్కడెక్కడ నుంచో పండ్లు, తేనె, రకరకాల తీపి పదార్థాలు తెచ్చి తినమని బ్రతిమిలాడుతూ తినిపించడం చూసిన తర్వాత శంఖిణి అంటే ఉన్న భయం పోయింది మాళవికకు. తల్లి, తండ్రి, అన్నయ్య గుర్తొచ్చినప్పుడల్లా చిన్నపిల్ల కావడం వల్ల  మాళవిక ఏడిస్తే  శంఖిణి ఓదారుస్తూ " మీ వాళ్ళు వస్తారు ఏడవకు "అని అబద్ధం చెప్పి ఊరుకోబెట్టేది. చూస్తూ ఉండగానే ఆరు నెలలు గడిచిపోయాయి.
               చెల్లి కోసం అన్వేషిస్తున్న విక్రమ వర్మ నెమ్మదిగా ఆ బ్రహ్మ రాక్షసి ఉన్న ఆచూకీ పసిగట్టి గుహలోకి ప్రవేశించాడు. నరవాసన పసిగట్టిన శంఖిణి విక్రమ వర్మను చూసి చెఱసాలలో  బంధించింది." బాలకా! నేను నర మాంసభక్షకిని. నా గురించి తెలిసే గుహలోకి ఎందుకు ప్రవేశించావు? నీకు భయం లేదా? " కోరలు తెరచి కళ్ళెఱ్ఱ చేసి అడిగింది. "ఓ బ్రహ్మ రాక్షసి! నువ్వు అపహరించింది నా చెల్లెలు మాళవికను, తను అంటే నాకు పంచప్రాణాలు. నేను తనకోసం ఎంత దూరమైనా వస్తాను, నా ప్రాణాలను సైతం లెక్కచేయను. ఓ బ్రహ్మ రాక్షసీ! నీకు దమ్ముంటే నన్ను బంధీని చేసి కాదు, విడిపించి మాట్లాడు. నీ ప్రాణం తీసి నా చెల్లెల్ని తీసుకువెళతాను" పౌరుషంగా నదురు బెదురు లేకుండా  అన్నాడు విక్రమ వర్మ.
               లేత వంకాయలా నవనవలాడుతూ  ఉన్న విక్రమ వర్మను చూస్తే శంఖిణికి నోరూరింది. మాళవికని తెచ్చిన దగ్గర నుంచి తను భయపడుతోందని అది మాంసం తినడం మానేసింది. కానీ ఇప్పుడు విక్రమవర్మని చూసి  ఇక ఆగలేక 'మంచి లేత వంకాయ లాంటి బాలుడు! తినేద్దాం' అనుకుని అతన్ని సమీపించింది. శoఖిణితో మాట్లాడదామని వచ్చిన మాళవిక తన అన్న విక్రమ వర్మను చూసి ఒక్క ఉదుటన చెఱసాల వద్దకు వచ్చి "అన్నయ్యా! నువ్వెలా వచ్చావు? అమ్మానాన్న ఎలా ఉన్నారు? చెఱసాలలో బందీగా ఉన్నావేమిటి?" అన్నయ్యని చూసిన ఆనందంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అడిగింది. "నీ ఆచూకీ కనుగొని ఇప్పుడే వచ్చానమ్మా! ఈ బ్రహ్మ రాక్షసి నన్ను బంధించింది". అన్నాడు విక్రమ వర్మ. మాళవిక శంఖిణిని చూసి "ఇతను మా అన్నయ్య! ఎందుకు బంధించావు? విడిచిపెట్టు" అంది. శంఖిణి విక్రమ వర్మను బంధ విముక్తుడిని చేయగానే కోపోద్రిక్తుడు అయిన విక్రమ వర్మ తన ఖడ్గం తీసి  శంఖిణిపై లంఘించి గాయపరిచాడు. 
                   శంఖిణిని వధించబోతున్న  తన అన్నయ్యను వారిస్తూ..." అన్నయ్యా! వద్దు, ఇన్ని రోజులు శంఖిణి నన్ను కన్నతల్లి లాగా చాలా ప్రేమగా చూసుకుంది దాని ప్రాణాలు తీయకు " వేడుకుంది మాళవిక.  చెల్లి అభ్యర్థన మేరకు శంఖిణిని సంహరించక విడిచిపెట్టాడు విక్రమ వర్మ.  ఒక అన్న తన చెల్లి కోసం అంత దూరం అదీ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రావడం చూసి వాళ్ళ ప్రేమానురాగాలకి కన్నీరు ఆగక బోరున ఏడ్చింది శంఖిణి . "అయ్యో శంఖిణీ ! ఎందుకు ఏడుస్తున్నావు" తన కన్నీరు తుడుస్తూ అడిగింది మాళవిక. " నాకూ ఇలాంటి అన్నయ్య ఉంటే ఎంత బాగుండేదో అని ఏడుస్తున్నాను" అంది ముక్కు చీదుకుంటూ శంఖిణి .
              ఇక కాలయాపన తగదని విక్రమ వర్మ     "శంఖిణి! నీతో యుద్ధం చేసి, నిన్ను వధించి అయినా మా చెల్లాయిని నాతో తీసుకొని వెళతాను. నువ్వు ప్రాణాలతో మిగలాలి అనుకుంటే మర్యాదగా మా చెల్లాయిని నాతో పంపు " అన్నాడు. శంఖిణి మాళవిక కేసి చూసి "ఏం తల్లీ! నన్ను విడిచి మీ అన్నయ్యతో వెళతావా?" అని అడిగింది. "ఓ!అమ్మానాన్నల దగ్గరికి వెళ్ళిపోతాను"  ఉత్సాహంగా అంది మాళవిక. తను మాళవికను ఎంత ముద్దుగా పెంచినా కన్నతల్లికి సాటి రాలేకపోయాను అన్న నిజం గుర్తించిన శంఖిణి బాధపడుతూ మాళవికను తన అన్న వెంట పంపేందుకు సిద్ధమయ్యింది.
                ఆరోజు నిండు పౌర్ణమి, రాఖీ పండుగ. అన్నయ్యకు రాఖీ కడదాం అంటే తన వద్ద రాఖీ  లేదు. ఎలాగైనా రాఖీ కట్టాలని ఆలోచించి అక్కడ ఉన్న ఒక లతను తెంపి దానికి ఒక పువ్వును కట్టి అది తన అన్నయ్య విక్రమ వర్మ చేతికి కట్టింది మాళవిక. ఇదంతా గమనించిన శంఖిణి "ఇదేమిటి? ఎందుకు ఇలా కడుతున్నావు?" అని  కుతూహలంగా అడిగింది.
                   శంఖిణి ప్రశ్నకు బదులిస్తూ  "ఇది రాఖీ !అన్నయ్య చేతికి చెల్లి కట్టే రక్షాబంధనం. ఈ రక్షాబంధనం కట్టి అన్నయ్య కలకాలం చల్లగా ఉండాలని చెల్లి కోరుకుంటుంది. ఇది కట్టించుకున్న అన్నయ్య ఈ బంధానికి కట్టుబడి నా చెల్లికి ఎప్పుడు కష్టాలలో అండగా ఉంటానని చెబుతాడు"అంది మాళవిక. అది విన్న శంఖిణి మళ్ళీ ఏడుస్తూ ఉంటే "ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు?"అని అడిగింది మాళవిక. "నాకూ అన్నయ్య ఉంటే నేనూ రాఖీ కట్టేదాన్నిగా" అంది. "ఏడవకు శంఖిణి! ఇదిగో ఇంకో రాఖీ నీకోసం తయారు చేస్తాను. అది మా అన్నయ్యకు కడుదువుగాని "అని శంఖిణి కోసం మరో రాఖీ తయారుచేసి ఇచ్చి విక్రమ వర్మ చేతికి కట్టించింది మాళవిక. 
               రాఖీ కట్టించుకున్న విక్రమ వర్మ "శంఖిణీ! ఈరోజు నుంచి నీకు నేను తమ్ముడిని, నీకు ఏ సహాయం కావాల్సి వచ్చినా చేస్తాను!" అని మాట ఇచ్చాడు. ఆ మాటతో పరవశించిపోయిన శంఖిణి కూడా విక్రమ వర్మతో "మీ ఇద్దరూ నన్ను ఎప్పుడు తలుచుకున్నా ప్రత్యక్షమై మీరు కోరినవన్నీ మీకు అందిస్తాను" అని మాట ఇచ్చింది. అన్నా చెల్లి ఇద్దరూ వాళ్ళ రాజ్యానికి వెళ్ళడానికి ఒక పుష్పక విమానం ఏర్పాటు చేసింది శంఖిణి.
                 పుష్పక విమానం రావడంతో "వెళ్ళొస్తాను"  అని మాళవిక శంఖిణితో చెప్పగానే దుఃఖాన్ని  ఆపుకోలేకపోయిన శంఖిణి మాళవికను హృదయానికి హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. "శంఖిణీ ! రోదించకు,  నువ్వు నన్ను ఎప్పుడు చూడాలనుకున్నా మా రాజ్యానికి రావచ్చు, దిగులు పడకు "అంది మాళవిక. సరేనని ఇద్దరికీ కన్నీళ్ళతో వీడ్కోలు పలికింది శంఖిణి. అప్పటినుంచి శంఖిణి మంచి రాక్షసిగా మారి తనకు చేతనైనంతవరకు నరులకు సాయం  చేస్తూ, ప్రతి రాఖీ పండగకు విక్రమ వర్మకు రాఖీ కట్టి, అప్పుడప్పుడు వెళ్ళి మాళవికని చూస్తూ  జీవిస్తోంది.
##########################################
కామెంట్‌లు