ద్రోణ పర్వము పంచమాశ్వాసము- 347 వ రోజు
నకులుడు శకునితో యుద్ధం చేస్తున్నాడు. శకుని పదునైన బాణంతో నకులుని మూర్చపోయేలా కొట్టాడు. నకులుడు తేరుకుని శకుని విల్లు, కేతనమును విరిచి శకుని తొడలపై బాణములతో కొట్టి అతడిని కదలకుండా చేసాడు. నకులుని బాణధాటికి శకుని మూర్ఛపోయాడు. శకుని రథసారథి రథమును పక్కకు తీసుకు వెళ్ళాడు. కృపాచార్యుడు శిఖండితో యుద్ధం చేస్తున్నాడు. శిఖండి కృపాచార్యుని విల్లు విరిచాడు. కృపాచార్యుడు వేరొక విల్లందుకుని శిఖండి మీద శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. శిఖండి దానిని నిర్వీర్యం చేసాడు. కృపాచార్యుడు మరొక దృఢమైన బాణంతో శిఖండిని మూర్చిల్లచేసాడు. కృపాచార్యుడు శిఖండిని చంపడానికి వేరొక బాణం తీయగానే పాంచాలవీరులు అడ్డుకుని కృపాచార్యునితో యుద్ధానికి దిగారు. రథసారథి శిఖండి రథమును పక్కకు తప్పించాడు. కాగడాల వెలుతురులో ఆ నాటి యుద్ధం రసవత్తరంగా సాగింది. ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని అయిదు బాణాలతో కొట్టాడు. ద్రోణుడు ధృష్టద్యుమ్నుని విల్లు విరిచాడు. ధృష్టద్యుమ్నుడు వేరొక విల్లందుకుని అగ్ని బాణమును ప్రయోగించాడు. కర్ణుడు అది చూసి దానిని మధ్యలోనే తుంచాడు. సుయోధనుడు, శల్యుడు, దుశ్శాసనుడు అక్కడకు చేరి ధృష్టద్యుమ్నుని ఎదుర్కొన్నారు. ధృష్టద్యుమ్నుడు వారితో ఒంటరిగా పోరు సాగించాడు. కర్ణుడినితో తలపడిన ద్రుమసేనుడిని ఒకే బాణంతో కర్ణుడుసంహరించాడు. అది చూసిన ధృష్టద్యుమ్నుడు కోపించి కర్ణుని విల్లు విరిచాడు. కర్ణుడు మరొక విల్లందుకుని ధృష్టద్యుమ్నుని ఎదుర్కొన్నాడు. ఇంతలో సాత్యకి నిర్వీర్యం చేసి కర్ణుని ఎదుర్కొన్నాడు. ఇంతలో వృషసేనుడు మధ్యలో వచ్చి సాత్యకిని ఎదుర్కొన్నాడు. సాత్యకి ఒకే బాణంతో వృషసేనుని మూర్ఛిల్లజేసాడు. కర్ణుడు తన కుమారుడు మృతిచెందాడనుకుని సాత్యకి మీద శరవర్షం కురిపించాడు. వృషసేనుడు తేరుకుని కర్ణుడితో చేరి సాత్యకిని ఎదుర్కొన్నాడు.
సుయోధనుడికి కర్ణుడి సలహా
అర్జునుడు దేవదత్తము పూరించాడు. ఇది విని కర్ణుడు " రారాజా ! అర్జునుడు ఇటు వైపు వస్తున్నాడు. అతడిని సాత్యకిని చేరకుండా ఆపగలిగితే మనము సాత్యకిని వధించ వచ్చు. ఇలా చేస్తేనే సాత్యకిని అభిమన్యుని చంపినట్లు చంపగలము. మన విజయానికి అదే నాంది. సాత్యకి మరణం తెలిసిన అర్జునుడు ఇక్కడకు వస్తాడు కనుక అతడికి సాత్యకి మరణం తెలియకుండా మన మహాయోధులను పంపి అర్జునుడిని ఇక్కడకు రాకుండా నిలువరించు " అన్నాడు. సుయోధనుడికి కర్ణుడి ఆలోచన నచ్చింది పక్కనే ఉన్న శకుని చూసి " మామా ! నీవు పదివేల ఏనుగులను, పదివేల రధములను తీసుకుని అర్జునుడిని ఎదుర్కొని అతడు ఇక్కడకు రాకుండా ఆపు. నీకు తోడుగా నా తమ్ములు దుశ్శాసనుడు, సుబాహుడు, దుష్ప్రదర్షణుడు, దుర్విషహుడు తోడుగా వస్తారు. నీవు అర్జునుడు, భీముడు, ధర్మరాజులను ఎదుర్కొని విజయం సాధించు " అన్నాడు. సుయోధనుడి మాటను అనుసరించి శకుని మేనల్లుళ్ళను తీసుకుని అర్జునుడిని ఎదుర్కొనుటకు వెళ్ళాడు. కర్ణుడు సాత్యకిని ఎదుర్కొన్నాడు కాని సాత్యకి యుద్ధ కౌశలానికి కౌరవ సేన నిలువలేక పోయింది. సుయోధనుడు సాత్యకిని ఎదుర్కొన్నాడు. సాత్యకి సుయోధనుడి సారథిని, రథాశ్వములను చంపి, విల్లు విరిచాడు. సుయోధనుడు కిందకు దూకి పక్కనే ఉన్న రథమును ఎక్కి తప్పించుకున్నాడు. సుయోధనుడి పరాజయం చూసి కౌరవసేన పారిపోయింది. శకుని తన కుమారుడైన ఉలూకునితో చేరి అర్జునుడిని ఎదుర్కొన్నాడు. ఉలూకుడు అర్జునుడి మీద శరములు గుప్పించాడు. అర్జునుడు శకుని సారథిని, రథాశ్వములను చంపి, అతడి వింటిని, రథమును విరిచాడు. శకుని కుమారుని రథము ఎక్కి అర్జునుడిని ఎదుర్కొన్నాడు. కాని వారు అర్జునుడి గాండీవం నుండి వెలువడుతున్న శరముల ధాటికి తాళలేక పోయారు. శకునికి సాయంగా వచ్చిన రథికులు యుద్ధం చేయలేక పారి పోయారు. శకుని అతడి కుమారుడు దిక్కు తోచకుండా నిలబడ్డారు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుని ఎదుర్కొని అతడి వింటి నారిని విరిచాడు. ద్రోణుడు మరొక విల్లందుకుని శరప్రయోగం చేసాడు. అర్జునుడు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు కౌరవ సేనలను తనుమాడుతున్నారు. విజయ సూచకంగా అర్జునుడు దేవదత్తమును శ్రీకృష్ణుడు పాంచజన్యము, ధృష్టద్యుమ్నాది యోధులు తమతమ శంఖములు పూరించారు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి