గాలి స్వరాల మధుర గీతికలు: - బి.ఉషారాణి--Govt టీచర్- మంచిర్యాల


గాలి స్వరాలు మధుర గీతికలై
ఆమని తోటలో ఆలపించగా
గంగమ్మ పరవశించి ఉరవళ్లతో పొంగి
గగనతలాన మేఘాల ఒడిలో చేరి
చినుకు బిందువులై జల్లులుగా కురిసి
నేలతల్లిని ప్రేమగా తడిపే వేళ...

ప్రకృతి పులకించి వేడుకలే చేయగా
చల్లని గాలి చెవిలో గుసగుసలు చెప్పగా
చినుకుల జల్లులు ముత్యాలై రాలగా
చిగురాకుల కలలు పండగా
పచ్చని పైర్లు పరవశించి తలలూచగా
పుడమి అంతా పరిమళాలతో నిండగా...

ఊగే చెట్ల కొమ్మలు రాగాలు పలికించగా
చిలకల కిలకిల మధుర రవాలు వినిపించగా
కోయిల తీయని గానాలతో
ప్రకృతి మధురిమను చాటగా
పులకించిన మది పరవశించగా
పుడమి ఒడిలో ఆనందం వెల్లివిరియగా...

వాగులు వంకలు పరుగులు తీసేలా
ఎండిన నేలకు ఊపిరిని పోసేలా
రైతు గుండెల్లో ఆశలను నింపేలా
గాలి స్వరాలకు గంగమ్మ చినుకులు
జీవన గీతాలై జల్లులుగా కురుస్తూ
పుడమి ఒడిలో పచ్చదనాన్ని పరిచి
పంట పొలాలకు పసిడి వర్ణాలు పూయించే...
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Nice