​"అదృశ్యవీరుడు" జానపద నవల - 1️⃣0️⃣✅వ భాగం; - నాగమణి రావులపాటి
 

​"శివదత్తా, ధైర్యం వహించండి. మీరిలా నీరుగారిపోతే అమ్మాయిని దక్కించుకోలేం. ఆ కాత్యాయనీ దేవిని వేడుకుని, తక్షణ కర్తవ్యాన్ని తగిన విధంగా వినియోగించండి. సైనికులను నలుదిక్కులా పంపి, జాడ కనిపెట్టే ప్రయత్నం గావించండి..."
​"త్వరపడండి ప్రభూ!" అని సూరసేనుడు తొందర చేశాడు. వెంటనే సైనికులను పంపి అమ్మాయి జాడ తెలుసుకు రమ్మని ఆదేశాలు జారీ చేశాడు మహారాజు. మంత్రి సుబుద్ది కూడా వెతికే ప్రయత్నంలో బయలుదేరాడు.
​"మహారాజా! ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బయటకు రాకండి. ఈ విషయం గోప్యంగా ఉంటే మంచిది. చూద్దాం, అమ్మవారి దయ ఎలాగున్నదో!" అని తగిన జాగ్రత్తలు చెప్పి, మంత్రి సుబుద్ది కూడా వెతకడంారంభించాడు. రెండు రోజులు గడిచాయి. రాజప్రాసాదంలో మౌనం రాజ్యమేలుతోంది.
​పరిచారికలు, మహారాణి, మహారాజు వేదనలో కృంగిపోవుచున్నారు. కానీ, స్వయంవరానికి విచ్చేసిన రాకుమారులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా, యథావిధిగా విందులు వినోదాలకు లోటు లేకుండా తగిన ఏర్పాట్లు గావించారు.
​వారికేమాత్రం రాకుమారి అమృతవల్లి గురించి తెలియనీయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, కక్కలేక మింగలేక మహారాజు పరిస్థితి దీనంగా మారింది. రెండు రోజులు గడిచాయి. స్వయంవర ముహూర్తపు రోజు రానేవచ్చింది.
​రాకుమారులంతా అందంగా ముస్తాబై, మండపానికి ఆహ్వానం రాగానే వెళ్లడానికి తయారవుతున్నారు. కానీ, వాళ్లకెందుకో అనుమానం రానే వచ్చింది. ఈసరికే స్వయంవర మండపాన్ని తగిన విధంగా అలంకరించాలి కదా! ఆ ఆనవాళ్లు ఎక్కడా తెలియరావట్లేదు.
​ఇంతవరకు ఆ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. ముహూర్తం మారిందా? ఆ విషయమన్నా చెప్పాలిగా, ఏదో జరుగుతున్నది అని కూపీ లాగే ప్రయత్నాలు కొందరు చేయకపోలేదు.
​యువరాణి ఆచూకీ తెలుసుకోవడానికి వెళ్ళిన సిబ్బంది ఒక్కొక్కరుగా వచ్చి జాడ తెలియలేదని చెబుతుంటే, రాజు శివదత్తుడు గుండె పగిలినంత బాధతో విలవిలలాడుతున్నాడు. ఈలోపల మంత్రి సుబుద్ది కూడా వచ్చి, "ప్రభూ! దాదాపు అన్ని ప్రదేశాలూ తిలకించి వచ్చాను, ఎక్కడా అమ్మాయి జాడ తెలియరాలేదు" అన్నాడు.
​"ఈనాడే కదా స్వయంవర ముహూర్తం! ఇక మనం ఈ విషయాన్ని వెల్లడించక తప్పదు మహారాజు! మీరు గుండె దిటవు చేసుకోండి. ఒక పథకం ప్రకారం ఈ విషయాన్ని వారికి తెలియజేస్తాను" అని మంత్రివర్యుడు సుబుద్ది చెప్పేసరికి, శివదత్తుడు తల నేలకు వాల్చక తప్పలేదు.
​"సరే మంత్రివర్యా! ఈ సమస్యను మీరే పరిష్కరించండి, మీకు పూర్తి హక్కును ఇస్తున్నాను" అనేసరికి, మంత్రి అప్పటికప్పుడే పండితవర్యులను, ప్రధానోద్యోగులను, ముఖ్యమైన అతిథులను పిలిచి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయించాడు.
​"మీ అందరికీ అమ్మాయి అపహరణ తెలిసిన విషయమే. ఇంతవరకూ యువరాణి ఏమైందో తెలియరాలేదు. ఇప్పటికే స్వయంవరానికి మనం ఆహ్వానించిన రాకుమారులతో మన అతిథి గృహాలు నిండిపోయాయి. ముందు వారిని సమాధానపరచి, తరువాత అమ్మాయి గురించి ఆలోచిద్దాం."
​"ఈ విషయమై అందరినీ సమావేశపరచి విశదీకరించే సమయం ఆసన్నమైనది. మీ మీ సలహాలు మాకు తెలియజేయండి" అని మంత్రి వచించిన మాటలకు, సభికులు వారికి తోచిన సలహాలు అందజేశారు. వాటిని స్వీకరించి ఒక పథకం రచించి వినిపించాడు మంత్రిశేఖరుడు సుబుద్ది. అందరూ దానికి ఆమోదం తెలిపారు. మహారాజు శివదత్తుడు నిమిత్తమాత్రుడైనాడు.
కామెంట్‌లు