వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
156. నీరాగా (త్ర్యక్క్షరీ)
157. రాగమథనా (పంచాక్క్షరీ)
నూట ఏభైఏడవ నామ మంత్రము:
ఓం రాగమథన్యై నమః
జీవుల యొక్క రాగబంధములను తుత్తునియలు చేసే సామ్రాజ్ఞి తానే, అని తెలుపుతూ ప్రకటితమైన శ్రీచక్రరాజసింహాసనేశ్వరిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు జగన్మాతను "రాగమథనా" అని కీర్తించారు. మనలో ఉన్న రాగ ద్వేషాలను పటాపంచలు చేస్తూ వైరాగ్య భావన పెంపు చేసే "నీరాగా" అయిన వల్లభనాయికకు నమస్కారము.
రాగము, ద్వేషము, మోహము, అహంకారము మొదలైన అరిషడ్వర్గాలకూ లొంగిపోయి, మానవులు అనంతమైన కోరికల సుడిగుండంలో చిక్కుకుని తిరుగుతూ ఉంటారు. ఒక కోరిక తరువాత ఇంకొక కోరిక పుడుతూనే ఉంటుంది. ఈ కోరికలు అనంతమైనవి. చివరకు అంత్యకాలము లో కూడా ఏదో ఒక తీరని కోరిక వలన, మళ్ళీ జన్మ ఎత్తుతారు. అందుకే ఆదిశంకరులు చెప్పారు, "పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం! ఇహ సంసారే బహు దుస్తారే, కృపయా పాహే పాహి మురారే!! భజ గోవిందం" అని. ఇంతటి బాధను మిగిల్చే కోర్కెల సుడిగుండం లోనుండి బయటకు రావాలంటే, నిర్మోహం లేదా వైరాగ్యం కలగాలి. ఈ వైరాగ్యాన్ని ఇవ్వ గలిగిందే, "నీరాగా" అయిన శాంకరి. అందుకనే శ్రీమాత, "రాగమథనా" అయ్యింది.
మన మానవులకు, ఒక కోరికను తీర్చుకోగలిగాము అనే గెలుపు మత్తు, మనలను అమితమైన ఆనందంలో తలమునకలుగా ఉంచి, మనకు దేహాభిమానాన్ని పెంచి పోషించి, మనలను ఆ కోర్కెల వలయంలోనే చిక్కుకుని ఉండేటట్లు చేస్తుంది. ఈ దురభిమానాన్ని తునాతునకలు చేసి, వైరాగ్యం వైపు నడిపించేది, అనంతమైన తల్లి ప్రేమ. కోరికల మత్తులో ఉన్న మనం, పరమేశ్వరిని గుర్తించిక పోయినా, ఒక చురక వేసి, తనవైపు మన బుద్ధి మరలి, వైరాగ్యం దారిలో నడిచేటట్టు చేస్తుంది, శ్రీమాత. మనలో వున్న "కోరికలు" అనబడే "రాగాలను" నాశనం చేసి, తన మోక్ష కౌగిలి అందేచేదే "రాగమథనా" అయిన శంభుని పత్ని.
నిరంతరాయంగా మనలో రగులుతున్న కోరికల కొలిమిని చల్లార్చి, దేహాదుల అనురాగము నుండి బయట పడేసి, ఇంద్రియ నిగ్రహ శక్తిని ఇచ్చి, మోక్ష మార్గములో నడిపించెలిగేది పరబ్రహ్మ స్వరూపిణి అయిన శ్రీమహారాజ్నియే అని నమ్మి, తనను పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం రాగమథన్యై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి