శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 180
 

వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
158. నిర్మదా (త్ర్యక్క్షరీ)
159. మదనాశినీ (పంచాక్క్షరీ)
నూట ఏభైతొమ్మిదవ నామ మంత్రము:
ఓం మదనాశిన్యై నమః
"నిర్మదా" గా ప్రకటితమైన చాముండేశ్వరి, సశరీరము లేని తనకు ఏ మదములు తగులుకోకపోయినా, ఈ చరాచర జగత్తులో వ్యాపించి ఉన్న దర్పము, గర్వము, మదము అనే లక్షణాలను తొలగించి వేస్తాను, అని కనిపించిన దేవదేవిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు, శ్రీలలితా పరాభట్టారికను, "మదనాశినీ" అని నుతులు చేసారు. అజ్ఞానముతో, అహంకారముతో చరించే సశరీరులను కాటుకపుల్లలాగా జ్ఞానం అనే వెలుగును నింపి, మన గర్వాన్ని, అహంకారము మొదలైన అరిషడ్వర్గాలనూ దూరం చేయగల శ్రీమహారాజ్ఞి అయిన కామేశ్వరపత్నికి నమస్కారము.
మదము అంటే పొగరు ప్రదర్శించడం. తనకు అన్నీ తెలుసు అని, ఎవరు ఏమి చెప్పినా , ఆ చెప్పినవారు వయసులోనూ, జ్ఞాన సముపార్జన లోనూ పెద్దవారైనా, వారికి ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా, తూలనాడుతూ ఉంటాడు. తన సాధకులలో ఉన్న ఆసురీ లక్షణాలను సర్వనాశనం చేస్తుంది, శ్రీమాత. అందుకనే "మదనాశినీ" అయ్యింది.
"కరాంగుళీ నఖోత్పన్న నారాయణ దశాకృతిః" - అమ్మ ఆసురీ శక్తులను నిర్జించడానికి తన చేతి వేళ్ళ గోళ్ళనుండి నారాయణనుని పదిరూపాలలో పుట్టిస్తుంది. "రావణ బ్రహ్మ" - వేద వేదాంగాలు, చతుష్షష్టి కళలరూపాలనూ అవపోసన పట్టినవాడు. స్వర్ణలంకాధిపతి. యుద్థకౌశలంలో తనను ఎదిరించి నిలబడ గలిగే వారు లేరు. ఇంత ఉదాత్తమైన లక్షణాలు ఉన్నా, తనను మించిన వారు లేరు, తానే పరమశివుడు అంతటి వానిని, అనే గర్వం, మదం తలకెక్కి, తప్పు చేసాడు, లంకకు చేటు తెచ్చాడు, రామ బాణానికి గురి అయ్యాడు. ఈ కోవకు చెందిన వారే, హిరణ్యక్ష, హిరణ్యకశప, కంస, దుర్యోధన , కార్తవీర్య, శిశుపాలాదులు. వీరందరి మదమును అణచడానికి నారాయణుని వివిధ అవతారాలలో పంపించిన, శ్రీమాత "మదనాశినీ" అని కీర్తించబడింది.
అర్ధనారీశ్వర తత్వం తో అందరినీ అక్కున చేర్చుకుని అనుగ్రహిస్తున్న చిదగ్నికుండసంభూత, మనలో కొలువైవున్న అరిషడ్వర్గాలను నాశనము చేస్తుంది అని గుర్తెరిగి, తనను పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు   ఓం మదనాశిన్యై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
కామెంట్‌లు