రైతు కథ: - తోట జాహ్నవి, 6వ తరగతి, ప్రాథమికోన్నత పాఠశాల అంబం, ఎడపల్లి, నిజామాబాద్ జిల్లా.


 అనగనగా అందమైన అంబం అనే పేరు గల పల్లెటూరు  ఉండేది. ఆ ఊరి చుట్టూ పచ్చని పొలాలు, పెద్ద పెద్ద చెట్లు, చిన్న చిన్న చెరువులు ఉండేవి. ఉదయం కోళ్ల కూతలతో, పక్షుల కిలకిలారావాలతో గ్రామం మేల్కొనేది. ఆ ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు.
రామయ్య చాలా కష్టపడి పనిచేసే మనిషి. అతనికి పెద్దగా ఆస్తిపాస్తులు ఏమీ లేవు. ఊరి చివర ఒక చిన్న పెంకుటిల్లు ఉండేది. ఇంటి ముందు రెండు మామిడి చెట్లు, పక్కన కొన్ని పూల మొక్కలు ఉండేవి. అతనికి ఒక ఎకరం పొలం మాత్రమే ఉండేది. అదే అతని జీవనాధారం.
ప్రతి రోజు తెల్లవారకముందే రామయ్య నిద్రలేచేవాడు. ఇంటి పనులు ముగించుకుని పొలానికి వెళ్లేవాడు. ఎండైనా, వానైనా తన పనిని మాత్రం మానేవాడు కాదు.
ఒక సంవత్సరం వర్షాలు ఆలస్యంగా వచ్చాయి. పొలాలు ఎండిపోయాయి. రైతులందరూ ఆకాశం వైపు చూస్తూ వర్షం కోసం ఎదురుచూశారు. రామయ్య కూడా తన పొలాన్ని చూసుకుంటూ,
“వానలు బాగా పడితే ఈసారి మంచి పంట పండించాలి. కష్టపడితే భూమి మనల్ని ఎప్పుడూ మోసం చేయదు” అని అనుకునేవాడు.
కొన్ని రోజుల తర్వాత ఒక రాత్రి ఆకాశం ఒక్కసారిగా మబ్బులతో నిండిపోయింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. వర్షం పడుతుండటం చూసి రామయ్య ఎంతో సంతోషించాడు. మరుసటి రోజు ఉదయమే పొలానికి వెళ్లాడు. పొలంలో తేమ బాగా ఉంది.
రామయ్య వెంటనే నాగలి తీసుకుని వెళ్లి పొలాన్ని దున్నడం ప్రారంభించాడు. మట్టిని బాగా కలిపి, పొలాన్ని విత్తనాలు వేయడానికి సిద్ధం చేశాడు. మరుసటి రోజు మంచి విత్తనాలను తీసుకొచ్చి పొలమంతా వేశాడు.
“ఈ విత్తనాలు మంచి మొక్కలుగా పెరిగి మంచి పంట ఇస్తే చాలు” అని భగవంతుడిని ప్రార్థించాడు.
ఆ రోజు నుంచి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పొలానికి వెళ్లి వచ్చేవాడు. ఒకరోజు పొలంలో చిన్న చిన్న పచ్చని మొలకలు కనిపించాయి.
“అయ్యో! మొలకలు వచ్చాయి!” అని రామయ్య ఆనందంతో అరిచాడు.
ఆ చిన్న మొలకలను చూసి అతని కళ్లలో ఆనందం కనిపించింది. ఇంటికి వెళ్లి తన భార్యతో,
“మన కష్టం ఫలించింది. పొలంలో మొలకలు వచ్చాయి” అని సంతోషంగా చెప్పాడు.
రోజులు గడిచేకొద్దీ మొక్కలు పెద్దవయ్యాయి. పొలం మొత్తం పచ్చగా మారింది. ఆ దృశ్యం చూడటానికి ఎంతో అందంగా ఉండేది. రామయ్య పంటకు నీరు పెట్టేవాడు. కలుపు మొక్కలను తొలగించేవాడు. పంటకు ఎలాంటి పురుగు పట్టకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు.
కొంతకాలానికి పంట చేతికి వచ్చింది. రామయ్య పంటను కోసి, దాన్ని రైతు బజారుకు తీసుకెళ్లి అమ్మాడు. పంటకు మంచి ధర రావడంతో అతనికి కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో రామయ్య రెండు ఆవులను కొనుక్కున్నాడు.
“ఈ ఆవులను కూడా మన పిల్లల్లా చూసుకోవాలి” అని తన భార్యతో చెప్పాడు. అతను ఆవులకు సమయానికి మేత పెట్టేవాడు. నీరు తాగించేవాడు. ప్రతిరోజూ వాటిని పొలం దగ్గరకు తీసుకెళ్లేవాడు. ఆవులు కూడ రామయ్య చెప్పినట్లు వినేవి.
ఒకరోజు ఉదయం రామయ్య తన ఆవును పొలానికి తీసుకెళ్తున్నాడు. దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద ఒక ముసలివాడు అలసిపోయి కూర్చుని ఉన్నాడు.
రామయ్య అతని దగ్గరకు వెళ్లాడు.
“పెద్దాయనా! మీరు ఇక్కడ ఒంటరిగా ఎందుకు కూర్చున్నారు? ఏమైనా సహాయం కావాలా?” అని అడిగాడు. పెద్దాయన మెల్లగా తలెత్తి చూశాడు. “బాబూ! నాకు చాలా దాహంగా ఉంది. కొంచెం మంచి నీళ్లు తీసుకొచ్చి ఇస్తావా?” అని అడిగాడు.
“అంతేనా పెద్దాయనా! ఇప్పుడే తీసుకొస్తాను” అని రామయ్య చెప్పాడు.
అతను వెంటనే దగ్గరలోని చెరువు వద్దకు వెళ్లాడు. అక్కడ తనకు దొరికిన కొబ్బరి చిప్పను మంచిగా కడిగి నీటిని తీసుకుని పెద్దాయన దగ్గరకు వచ్చాడు.
“ఇదిగో పెద్దాయనా, నీళ్లు తాగండి” అని ప్రేమగా అందించాడు.
ఆ నీటిని అతను నెమ్మదిగా తాగాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత రామయ్యను చూస్తూ,
“బాబూ! ఈ రోజు నువ్వు నాకు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను” అన్నాడు.
రామయ్య నవ్వుతూ,
“పెద్దాయనా! ఇందులో నేను చేసిన గొప్ప పని ఏమీ లేదు. దాహంగా ఉన్నవారికి నీళ్లు ఇవ్వడం మనిషిగా మన బాధ్యత కదా!” అన్నాడు.
అతను రామయ్య మాటలకు ఎంతో సంతోషించాడు. తన దగ్గర ఉన్న చిన్న సంచిని తెరిచి అందులోని కొన్ని బంగారు నాణేలను బయటకు తీశాడు.
“బాబూ! నా దగ్గర నీకు ఇవ్వడానికి ఇంకేమీ లేదు. ఈ బంగారు నాణేలను తీసుకో. నీ కుటుంబానికి ఉపయోగపడతాయి” అని చెప్పాడు.
రామయ్య ఆశ్చర్యపోయాడు.
“వద్దు పెద్దాయనా. నేను మీకు నీళ్లు ఇచ్చింది ప్రతిఫలం కోసం కాదు” అని అన్నాడు.
“నీ మనసు నాకు తెలుసు బాబూ. ఇది నీ మంచితనానికి గుర్తుగా మాత్రమే తీసుకో” అని ముసలివాడు చెప్పాడు.
రామయ్య ఆ నాణేలను తీసుకున్నాడు. పెద్దాయనకు నమస్కరించి, “చాలా ధన్యవాదాలు పెద్దాయనా” అని చెప్పాడు.
“నువ్వు ఎప్పుడూ ఇలాగే మంచిగా ఉండు. నీకు మంచి జరుగుతుంది” అని ముసలివాడు ఆశీర్వదించాడు.
రామయ్య ఇంటికి తిరిగి వచ్చాడు. జరిగిన విషయాన్ని తన భార్యకు చెప్పాడు. ఇద్దరూ ఆ నాణేలను చూసి ఆశ్చర్యపోయారు. కానీ రామయ్య వాటిని వృథాగా ఖర్చు చేయలేదు.
“మనకు వచ్చిన ఈ డబ్బును జాగ్రత్తగా ఉపయోగించాలి. ముందుగా పొలాన్ని అభివృద్ధి చేద్దాం” అని అన్నాడు.
కొంత డబ్బుతో వ్యవసాయ పనిముట్లు కొనుక్కున్నాడు. పొలానికి నీటి సౌకర్యం కల్పించాడు. మరికొంత డబ్బుతో పంటకు పెట్టుబడిగా ఉపయోగించాడు. మిగిలిన డబ్బును భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్నాడు.
అతని పొలంలో పంటలు బాగా పండసాగాయి. ఆవుల సంఖ్య కూడా పెరిగింది. పాలు అమ్మడం ద్వారా కూడా ఆదాయం రావడం ప్రారంభమైంది. కొంతకాలానికి రామయ్య ఆర్థికంగా అభివృద్ధి చెందాడు. అయితే డబ్బు వచ్చిన తర్వాత కూడా అతని స్వభావం మారలేదు. గతంలో ఎలా కష్టపడి జీవించాడో అలాగే జీవించాడు. పేదవారికి చేతనైనంత సహాయం చేసేవాడు. దాహంతో ఉన్నవారికి నీళ్లు ఇచ్చేవాడు. రైతులకు మంచి సలహాలు ఇచ్చేవాడు.
ఒకరోజు రామయ్యకు ఆ పెద్దాయన గుర్తుకు వచ్చాడు. అతను మళ్లీ కనిపిస్తాడేమోనని ఆ చెట్టు దగ్గరకు వెళ్లాడు. కానీ అక్కడ అతను కనిపించలేదు.
రామయ్య ఆ చెట్టు కింద నిలబడి,
“ఆయన ఎవరో నాకు తెలియదు. కానీ ఆయన వల్ల నాకు వచ్చిన సంపద కంటే, మంచితనం ఎప్పుడూ వృథా కాదనే విషయం విలువైనది” అని తెలిసింది.
ఆ రోజు నుంచి రామయ్య మరింత ఎక్కువగా ఇతరులకు సహాయం చేయసాగాడు.
కొంతకాలానికి ఆ గ్రామంలోని ప్రజలందరూ రామయ్యను ఎంతో గౌరవించేవారు. అతను ధనవంతుడు అయినందుకు కాదు, మంచి మనసున్న మనిషి అయినందుకు అందరూ అతన్ని ఇష్టపడేవారు.
నీతి:
మనం చేసే చిన్న సహాయం కూడా ఒకరి జీవితంలో పెద్ద మార్పును తీసుకురావచ్చు. ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు సహాయం చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది. కష్టపడి పనిచేయడం, మంచితనంతో జీవించడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం ప్రతి మనిషి అలవాటు చేసుకోవాలి.
=========================
===============================================
గైడ్ టీచర్: 
బొడ్డు భరద్వాజ 
స్కూల్ అసిస్టెంట్ తెలుగు ప్రాథమికోన్నత పాఠశాల అంబం, ఎడపల్లి, నిజామాబాద్ జిల్లా.
కామెంట్‌లు