అనగనగా ఒక చిన్న పల్లెటూరి బడి. ఆ బడిలో చిన్నారి, లహరి అనే ఇద్దరు అమ్మాయిలు చదువుకునేవారు. ఇద్దరికీ తమ గురువు అంటే చాలా గౌరవం. అమితమైన అభిమానం ఉండేవి. అయితే, తరువాతి సంవత్సరంలో ఆ గురువుగారు వేరే ఊరికి బదిలీపై వెళ్లిపోయారు. వారి స్థానంలో కొత్త గురువు వచ్చారు.
అప్పుడు చిన్నారి " గురువు ఎవరైతే ఏంటి? మనకు కావాల్సింది చదువు. కొత్త గురువుగారు చెప్పే విషయాలను కూడా శ్రద్ధగా విని, మంచిగా చదువుకుందాం" అని అనుకుంది. అన్నట్టుగానే కొత్త గురువుగారి బోధనలను శ్రద్ధగా వింటూ, కష్టపడి చదివింది. పరీక్షలు అన్నిటిలోనూ ఉత్తమ మార్కులతో పాసయ్యింది.
చిన్నారి కాలక్రమేనా ఒక మంచి ఉద్యోగం సాధించి, జీవితంలో చాలా సంతోషంగా స్థిరపడింది. కానీ లహరి మాత్రం " నాకు ఆ పాత గురువుగారు చెప్తేనే అర్థమవుతుంది. ఆయన నాకు నచ్చిన గురువు, ఆయన చెప్తేనే నేను చదువుతాను" అని అనుకుంది. లహరి కొత్త గురువుగారి మాటలను అస్సలు పట్టించుకోలేదు, చదువుపై శ్రద్ధ పూర్తిగా తగ్గించేసింది. ఫలితంగా లహరి ప్రతి పరీక్షలోనూ ఫెయిలవుతూ వచ్చింది. పల్లెటూరిలోనే ఉంటూ జీవించసాగింది.
నీతి : పరిస్థితులు మారినా మన లక్ష్యం మారకూడదు.
పై "శ్రద్ధ" కథ నా స్వీరచన ఎలాంటి అనువాదం కానీ, అనుసరణ గానీ కాదని, ఇతర పత్రికలకు పంపడం లేదని హామీ ఇస్తున్నాను.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి