క్షణంలో ఒక మాయా దర్పణాన్ని సృష్టించాడు వక్రమల్లుడు. "మాయా దర్పణమా! దైవాంశ సంభూతురాలు, అందంలో అప్సరస అయిన కన్యకామణి అయినా సరే, ఒక రాచకన్యను చూపించవే" అని వేడుకున్నాడు...!!!
అంత ఆ మాయా దర్పణం... "ఓరీ వక్రాసురా! నీవు కోరిన సుందరి సౌరాష్ట్ర దేశ యువరాణి అమృతవల్లి. అందంలో అప్సరస ఆమె; కాత్యాయని వర సంపన్నురాలు, సహజ సౌందర్యరాశి, సకల గుణ విద్యా సంపన్నురాలు...!!!" అని పలికింది.
"ఆమెకు త్వరలో వివాహం నిశ్చయమయింది. ఆ దేశ మహారాజు ఆమెకు స్వయంవర ఏర్పాట్లు చేయించాడు. ఇంకా రెండు దినాలలో ఆమె ఎవరినైనా వరించగలదు..."
"ఇదిగో చూడు ఆ సౌందర్యవతిని" అని ఆమె చిత్రాన్ని ప్రస్పుటింపజేసింది మాయా దర్పణం. ఆ మాయా దర్పణం చూపిన సుందరిమణి అమృతవల్లిని చూసిన వక్రమల్లుడి మనసు కలుక్కుమన్నది...!!!
"ఆహా! ఎంత అద్భుతమైన సౌందర్యరాశి... ఈమె దేవలోక కన్యే కానీ భూలోక సుందరి కాదు, అంత అందమైన రూపం ఈమె సొంతం! ఈమెను బలి ఇవ్వడానికంటే నా హృదయరాణిని చేసుకుంటే ఎంత బాగుండును...!!!"
"ఇంత అందాల రాశిని బలిపీఠం ఎక్కించాలా? వద్దు, వద్దు! ఈమెను నా దేవేరిని చేసుకుంటాను" అని క్షణం ఆలోచించి, "కాదు, కాదు! నా మనసు ఈమె అందానికి వశుడైపోతోంది..."
"నేను దేనికీ లొంగకూడదు, గురువుగారు సెలవిచ్చారు కదా! ఈ కోమలిని బలి ఇచ్చి నేను చిరంజీవినై యవ్వనంతో జీవించాలంటే నా మనసును బండరాయి చేసుకోక తప్పదు..."
"ఈమెవల్ల నేను సిద్ధి పొందితే ఇంతకు మించిన అందగత్తెల నెందరినైనా నా పాదాక్రాంతులను చేసుకోవచ్చు" అని నిశ్చయించుకున్నవాడై, "ఓ మాయా దర్పణా! నాకు తగిన రాకుమారిని చూపి ఉపకారం చేశావు."
"ఇక నీ స్థానానికి నువ్వు వెళ్ళు" అని ఆజ్ఞాపించాడు. ఆ మాయా దర్పణం మాయమయింది.
ఇంకా రెండు రోజులలో ఆమె ఎవరినైనా వరించవచ్చు; వివాహం జరిగితే ఆమెను బలి ఇవ్వడం కుదరదు!
(సశేషం).....
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి