కర్ర గణపతి, పాలజ్ : - డి.వినాయక రావు, భైంసా , 9059494259


సీ:గణనాథుడా నిన్ను ఘనముగా కొలిచేము 
పాలజయ్యా, కర్ర పర్శుపాణి 
సందడుండు ప్రజల సంబరంబంటదిన్
పన్నెండు రోజులు ప్రమదముగను 
ముడుపులు కట్టగన్ మొక్కులు మ్రొక్కేరు 
కోర్కెలన్ తీర్చంటు కోరుకొంద్రు 
వాహనములనెక్కి వరదగా వచ్చేరు 
దర్శింప భక్తులు దండుగాను 
తేగి: కష్టమైనను భక్తులు కదలివచ్చు 
కాలి నడకతో నినుచూడ గణపతయ్య 
దీక్ష చేసేరు నీవిచ్చు దీవెనలకు 
కృపనుచూపించి నెరవేర్చు గృధ్యములను

భావము:ఓ గణపతీ! నిన్ను అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా పూజిస్తున్నాము. పాలజ్ గ్రామంలో కర్ర,  గణపతిని భక్తులు కొలుస్తున్నారు.
ఉత్సవాల సందర్భంగా గ్రామమంతా ప్రజల సందడితో, సంబరాలతో కళకళలాడుతుంది. పన్నెండు రోజులపాటు ఉత్సవాలు ఆనందంగా జరుగుతాయి. భక్తులు తమ కోరికలు నెరవేరాలని ముడుపులు కట్టి, మొక్కులు చెల్లించుకుంటారు. తమ కోర్కెలను తీర్చమని గణపతిని ప్రార్థిస్తారు.
దూరప్రాంతాల నుంచి కూడా భక్తులు వాహనాలపై పెద్ద సంఖ్యలో వచ్చి గణపతిని దర్శించుకుంటారు. దర్శనం కోసం భక్తుల రాకతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతాయి.
“కష్టమైనను భక్తులు కదలివచ్చు” — ప్రయాణం కష్టమైనప్పటికీ భక్తులు వెనుకాడరు. కొందరు కాలినడకన కూడా వచ్చి గణపతిని దర్శించుకుంటారు. ఆయన అనుగ్రహం పొందడానికి దీక్షలు చేపట్టి, నియమ నిష్ఠలతో పూజలు చేస్తారు.
“గణపతీ! నీ భక్తులపై కృప చూపించి, వారికి నీవిచ్చే దీవెనలతో వారి కోరికలను, సంకల్పాలను నెరవేర్చు.”

కామెంట్‌లు