చైనాలోని ఒక పల్లెటూరిలో ఒక పిల్లోడు ఉండేవాడు. ఆ పిల్లోడు చాలా మంచోడు. చిన్నప్పుడే నాన్న చచ్చిపోవడంతో అమ్మ జాగ్రత్తగా పెంచి పెద్ద చేసింది. చిన్నప్పటి నుంచీ మంచి మంచి నీతికథలు, దేశభక్తి కథలు చెబుతూ వుండేది. దాంతో ఆ పిల్లోనికి పుట్టిన నేలమీద, సాటి మనుషుల మీద చాలా ప్రేమ పెరిగింది. తాను కూడా ప్రజల కోసం, దేశం కోసం ఏదైనా చేయాలి అనుకునేవాడు. ఆ పిల్లోడు ప్రతిరోజు పొద్దున్నే అడవికి పోయి పచ్చని గడ్డి కోసుకొని తెచ్చేవాడు. దాన్ని ఊర్లో అమ్మి ఆ వచ్చిన డబ్బుతో అమ్మను బాగా చూసుకునేవాడు.
ఒకసారి చైనాలో పెద్ద కరువు వచ్చింది. ఒక్కచుక్క నీళ్లు కూడా లేక చెట్లన్నీ వాడిపోయాయి. బావులు నదులు ఇంకిపోయాయి. భూమి నెర్రలు వారింది. పశువులు తినడానికి గడ్డి లేక, మనుషులు ఆహారం లేక, పక్షులు గింజలు లేక అల్లాడిపోసాగాయి. పనుల కోసం, తిండి కోసం వలస పోవడం మొదలుపెట్టారు. మూడుపూటలా తినడం సంగతి దేవుని కెరుక ఒక్క పూట దొరికినా చాలు అనుకునేవాళ్ళు.
ఆ పిల్లవాడు రోజూ అడవిలో మైళ్ళకు మైళ్ళు గడ్డి కోసం వెతుకుతా పోయేవాడు. రోజూ కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లేవాడు. ఎక్కడైనా కొంచెం ఎండుగడ్డి దొరికితే దానినే తెచ్చి వచ్చిన కాడికి అమ్మేవాడు.
ఒకరోజు అట్లా వెతుక్కుంటూ పోతావుంటే ఒకచోట పచ్చని గడ్డి మోకాలెత్తు పెరిగి కళకళలాడుతూ కనపడింది. సంబరంగా పరుగెత్తుకొనిపోయి అక్కడున్న గడ్డంతా కోసుకొని ఇంటికి తెచ్చాడు. ఆరోజు మూడు పూటలా అన్నం తిన్నారు.
తర్వాతరోజు మరలా కొంచెం గడ్డి ఏమన్నా మిగిలి ఉంటే కోసుకొని వద్దామని అక్కడికి పోయాడు. తీరా పోయిచూస్తే ఇంకేముంది... అక్కడ నిన్నటిలాగే మరలా మోకాలు ఎత్తు గడ్డి పచ్చగా కళకళలాడుతూ కనపడింది. ఆ అద్భుతాన్ని చూసి తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. అలా ఎన్నిసార్లు కోసినా తర్వాతరోజుకంతా గడ్డి మరలా నిండుగా పెరగసాగింది.
అదిచూసి ఆ పిల్లోడు ఆలోచనలో పడ్డాడు. "ఊరిలో గానీ, అడవిలో గానీ ఎక్కడా గడ్డి లేదు. ఇక్కడ చూస్తే చుట్టు ఎక్కడా నీళ్లు లేకున్నా పచ్చగా కళకళలాడుతూ ఉంది. అంటే ఈ నేలలోనే ఏదో మహత్యం ఖచ్చితంగా ఉండి తీరాలి" అనుకున్నాడు. దాంతో పొద్దున్నే పలుగూ పారా తీసుకొనిపోయి ఆ గడ్డి కింది నేలంతా నెమ్మదిగా ఒక్క ఇంచు కూడా వదలకుండా జాగ్రత్తగా తవ్వసాగాడు. అట్లా తవ్వుతావుంటే ఒకచోట మట్టి పొరల కింద తెల్లగా ధగధగా మెరుస్తూ ఏదో వెలుగు కనపడింది. దాంతో తవ్వడం ఆపి చేతులతో మట్టిని నెమ్మదిగా తీసి చూశాడు. అక్కడ ఒక చిన్న ముత్యం మిలమిలా మెరుస్తా వెలుగులు విరుజమ్ముతా కనపడింది. దాన్ని జాగ్రత్తగా శుభ్రం చేసి జేబులో వేసుకున్నాడు. ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పి అమ్మకు ఆ ముత్యం అందించాడు.
అమ్మ దాన్ని జాగ్రత్తగా ఎక్కడ పెట్టాలా అని చుట్టూ చూసింది. బియ్యం డబ్బా ఖాళీగా కనబడింది. దాంతో ఆ బియ్యం డబ్బాలో పెట్టి గట్టిగా మూత పెట్టింది. తర్వాతరోజు ఆ ముత్యాన్ని ఒకసారి చూద్దామని ఆ పిల్లోడు బియ్యం డబ్బా మూత తెరిచాడు. అంతే... ఆశ్చర్యం. ఆ డబ్బా నిండుగా బియ్యం తెల్లగా మెరిసిపోతా కనపడ్డాయి. అది చూసి నోట మాట రాలేదు. తనకు దొరికిన ముత్యం మామూలు ముత్యం కాదు అద్భుతమైన అక్షయపాత్ర లాంటి శక్తులున్న మాయాముత్యం అని అర్థమైంది.
ఆనందంతో అమ్మను గట్టిగా పిలిచాడు. అమ్మ చూస్తుండగానే దాన్ని తీసుకుపోయి లడ్ల సంచీలో వేశాడు. తర్వాతరోజు కల్లా సంచి అంతా తీయని లడ్లతో నిండిపోయింది.
అదిచూసి "అమ్మా... ఊరంతా కరువుతో అల్లాడిపోతా ఉంది. తాగడానికి చుక్క నీళ్లు లేవు, తినడానికి పిడికెడు గింజలు లేవు. ఈ మాయాముత్యంతో అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపవచ్చు. ఏమంటావు" అన్నాడు.
అమ్మ నవ్వి "ఈ ఊరిలో ఇంతమంది జనాలు ఉన్నా దేవుడు ఈ ముత్యాన్ని నీకే ఎందుకు చూపించాడో తెలుసా... నీది వెన్నెలాంటి మనసు. ఎదుటివాని కష్టం చూసి కరిగి కన్నీళ్లు పెట్టుకుంటావు. మనతోపాటు అందరూ పచ్చగా కళకళలాడాలని కోరుకుంటావు. నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకో. నీ దగ్గర ఉన్న సంపద పదిమందికి పంచి పెట్టినప్పుడే దానికి నిజమైన విలువ కలుగుతుంది" అని చెప్పింది.
ఆ పిల్లవాడు అమ్మ కాళ్లు మొక్కి ఆ ముత్యాన్ని తీసుకుపోయి ఊరి చెరువులో పెట్టాడు. తర్వాత రోజుకంతా చెరువు నిండిపోయి గలగల పొంగి పొర్లసాగింది. అది చూసి ఊరు ఊరంతా సంబరం... సంబరం కాదు. ఆ పిల్లవాడు ఊరిలోని ప్రతి బావిని నీళ్లతో నింపివేశాడు. ఎండిపోయిన ప్రతి చెట్టును చిగురింప చేశాడు. బీడు పోయిన భూములన్నీ సాగులోకి తెచ్చాడు. ప్రతి పేద ఇంటిని ధన ధాన్యాలతో నింపాడు.
ఆ ఊరిలో ఒక జమీందారు ఉన్నాడు. ఆ జమీందారు చాలా ఆశపోతు. ఎవరు ఎట్లా పోయినా పర్వాలేదు తాను మాత్రం పచ్చగా ఉంటే చాలు అనుకునేవాడు. ఆ జమీందారుకు ఈ వింతలన్నీ తెలిసి "ఆ పిల్లవాని దగ్గర ఏదో మాయమో, మంత్రమో ఖచ్చితంగా ఉండాలి. అది గనక చేజిక్కిచ్చుకుంటే తాను కూడా అద్భుతాలు సృష్టించి అంతులేని సంపదలను పొందవచ్చు" అనుకున్నాడు. వెంటనే కొందరు సైనికులకు నిరుపేదలుగా వేషాలు వేసి ఆ పిల్లవాని ఇంటికి పంపించాడు.
వాళ్లు రహస్యంగా ఆ పిల్లవాడు మాయా ముత్యాన్ని ఉపయోగించి ధనాన్ని, ధాన్యాన్ని రెండింతలు చేస్తున్న విషయాన్ని గ్రహించి జమీందారుకు చేరవేశారు. తర్వాతరోజు జమీందారు తన సైనికులతో ఆ పిల్లవాని ఇంటి మీదకు దాడి చేశాడు. "ఈ ఊరికి నేను అధిపతిని. నువ్వు నా అనుమతి లేకుండా, నాకు చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. నీలాంటి చిన్నపిల్లోని దగ్గర అంత అద్భుతమైన రాయి ఉండడం మంచిది కాదు. దాన్ని నాకిచ్చేయి. ఎలా ఉపయోగించాలో నేను ఆలోచిస్తా" అన్నాడు.
కానీ ఆ పిల్లవానికి జమీందారు గురించి బాగా తెలుసు. దాంతో ఆ ముత్యాన్ని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. సైనికులు ఇల్లంతా చిందర వందర చేస్తూ వెతకసాగారు. ఆ పిల్లవాడు దానిని ఎవరికీ దొరకకుండా జాగ్రత్తగా నోటిలో దాచాడు. ఒక సైనికుడు అది గమనించి ఆ పిల్లవాని బుగ్గలు గట్టిగా ఒత్తుతూ నోట్లో నుంచి బయటికి రప్పించడానికి ప్రయత్నించ సాగాడు. ఆ పిల్లవాడు ఏదైతే అది అవుతుందని దాన్ని అలాగే మింగివేశాడు.
అంతే ఆ మరుక్షణం... ఆ పిల్లవాని ఒళ్లంతా అగ్నిని కదా మింగినట్లు భగభగా మండిపోసాగింది. కళ్ళు రెండూ అగ్ని గోళాల్లా ఎర్రగా మారి నిప్పులు విరజిమ్మసాగాయి. ముక్కులోనుండి వేడి పొగలు రాసాగాయి. అది చూసి భయపడి సైనికులు అతని చేతులు వదిలివేసి వెనక్కు వెళ్లిపోయారు.
ఆ పిల్లవాడు కడుపులోని ఆ మంటకు తట్టుకోలేక ఇంటిలోని నీళ్లన్నీ బిందెలకు బిందెలు గుబగబా ఎత్తి తాగేశాడు. కానీ ఆ వేడి కొంచెం కూడా చల్లారలేదు. దాంతో మెరుపులాంటి వేగంతో పరిగెత్తుతూ ఆ ఊరి బయట చెరువు దగ్గరికి పోయాడు. చెరువులోని నీళ్లన్నీ గబగబా తాగసాగాడు.
అలా తాగుతూవుంటే ఆ పిల్లవాని శరీరం నెమ్మదిగా పెరగసాగింది. వెన్నుపూస నుండి పెద్దపెద్ద వెడల్పయిన పొలుసులు బయటకి వచ్చాయి. కాళ్లకు చేతులకు పదునైన గోర్లు మొలిచాయి. తలపై అందమైన కొమ్ములు మొలిచాయి. వంద ఏనుగుల ఎత్తు పెరిగాడు. చూస్తుండగానే అద్భుతమైన డ్రాగన్ గా మారిపోయాడు.
ఒక్కసారిగా గట్టిగా గుండెలదిరేలా అరుస్తూ గాల్లోకి ఎగిరాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి చేరాడు. కళ్ళనీళ్ళతో అమ్మ కాళ్ళకు మొక్కాడు. "అమ్మా... ఇక నేను మానవునిగా తిరిగి మారలేను. ఇప్పుడు నేను ప్రజలను కాపాడే డ్రాగన్ ని. ఇక నా పని ఈ ఊరినే కాదు ఎక్కడ కరువు ఉన్నా అక్కడికిపోయి వానలు కురిపించి ప్రజలను కాపాడడం. నన్ను పంపించు తల్లీ" అన్నాడు.
అమ్మ ప్రేమగా తల మీద ముద్దు పెట్టి "నాన్నా... ఇప్పుడు నీవు నా ఒక్కదానికే కొడుకువు కాదు. దేశంలోని కోట్ల మంది తల్లులకు ముద్దుల బిడ్డవి. వాళ్లను కళ్ళలో పెట్టుకొని చూసుకోవలసిన బాధ్యత నీదే" అంటూ కళ్ళనీళ్ళతో వీడ్కోలు పలికింది.
డ్రాగన్ బాలుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. మొత్తం ఆకాశంలోని మేఘాలన్నింటినీ పిలిచాడు. ఆ ఊరి మీద అంతులేని వానను కురిపించమని ఆదేశించాడు. అంతే... ఆకాశమంతా మబ్బులతో నిండిపోయింది. ఉరుములు, మెరుపులతో పెద్ద వాన చుట్టుముట్టింది. చెరువులు, బావులు, కాలువలు, నదులు అన్నీ నీటితో పొంగి పొర్లసాగాయి. భూమితల్లి తనివితీరా నీళ్లు తాగి పసిపిల్లోని లెక్క కక్కడం మొదలుపెట్టింది. కరువు తీరి ప్రజలంతా హాయిగా ఆనందంగా ఆ డ్రాగన్ బాలునికి ధన్యవాదాలు చెబుతూ జేజేలు పలికారు. డ్రాగన్ బాలుడు అందరికీ వీడ్కోలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఇదీ డ్రాగన్ బాలుని కథ.
మిత్రులారా... మీకు ఈ కథతో బాటు ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పాలి. చైనాలో డ్రాగన్ అంటే చాలా గౌరవం. వాళ్లు వాటిని చాలా ప్రేమగా, భక్తిగా కొలుస్తారు. డ్రాగన్లు నీటికి అధిపతులని, నదులు సముద్రాలు వాటి స్థావరాలని, డ్రాగన్లకు వానలను కురిపించే శక్తి ఉందని, అవి ప్రజలకు రక్షకులుగా ఉంటాయని అక్కడి ప్రజల నమ్మకం.
మనదేశంలో నదులకు గంగా, యమునా, సరస్వతి ఇలా దేవతల పేర్లు ఉన్నట్లే చైనాలోని కొన్ని ప్రధానమైన నదులకు డ్రాగన్ల పేరు ఉంటుంది. చైనాలో ప్రధానమైన నదులు నాలుగు. అవి హీలాంగ్జియాంగ్, హువాంగ్ హే (ఎల్లో రివర్), యాంగ్జీ, జుజియాంగ్ (పెర్ల్ రివర్). ఈ నాలుగు నదుల పుట్టుక వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది.
ఒకసారి చైనాలో పెద్ద కరువు వచ్చి పంటలన్నీ ఎండిపోయాయి. ప్రజలు ఆకలితో అల్లాడిపోసాగారు. ఆకాశంలో తిరుగుతా వున్న నల్ల డ్రాగన్, పసుపు డ్రాగన్, పొడవు డ్రాగన్, ముత్యపు డ్రాగన్ అనే నాలుగు డ్రాగన్లు ఈ విషయాన్ని గమనించాయి. వెంటనే స్వర్గలోక అధిపతి అయిన జేడ్ చక్రవర్తి దగ్గరికి పోయి "మహారాజా... భూలోకమంతా అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడ చూసినా ఎండిన నేలలు, బక్క చిక్కిన మనుషులే కనపడుతున్నారు. కరువు విలయతాండవం చేస్తుంది. మీరు వెంటనే మేఘాలను పంపి వానలు కురిపించండి. భూమిని కాపాడండి" అని వేడుకున్నాయి. జేడ్ చక్రవర్తి "అలాగే... రేపు కురిపిస్తాలే" అని చెప్పి వాటిని పంపించి వేశాడు.
కానీ జేడ్ చక్రవర్తి విందులు వినోదాలలో మునిగిపోయి ప్రజల గురించి అస్సలు పట్టించుకోలేదు. పది రోజులైనా వాన కురిపించలేదు. అసలు అతనికి ఆ విషయమే గుర్తులేదు. భూమిపై మనుషులు, పశువులు తిండి లేక, నీళ్లు లేక నిమిషానికి ఒకరు చొప్పున చచ్చిపోతా ఉన్నారు.
నాలుగు డ్రాగన్లు ఆ విషాదాన్ని చూడలేకపోయాయి. వాటి కళ్ళ వెంబడి నీళ్ళు కారాయి. ఎలాగైనా వాళ్లను కాపాడాలి అనుకున్నాయి. వెంటనే తూర్పు సముద్రాన్ని చేరుకున్నాయి. కడుపునిండా నీళ్ళను తాగి తిరిగి భూమి మీదకు వచ్చాయి. ఆ నీటిని ఆకాశంలో విరజిమ్మసాగాయి. దాంతో భూమంతా జల్లులు పడుతూ తడిసి ముద్ద కాసాగింది. నెమ్మదిగా చెరువులు, కుంటలు నిండిపోయాయి. భూమి మరలా పచ్చగా కనువిందు చేయసాగింది. అదిచూసి జనాలంతా ఆనందంతో ఎగిరి గంతులు వేస్తూ తమను కాపాడిన డ్రాగన్లకు చేతులెత్తి మొక్కసాగారు.
ఈ విషయం జేడ్ చక్రవర్తికి తెలిసింది. అసూయతో, కోపంతో రగిలిపోయాడు. తన అనుమతి లేకుండా సముద్రంలోని నీటిని వాడినందుకు ఆ నాలుగు డ్రాగన్లను శిక్షించాలి అనుకున్నాడు. వెంటనే నాలుగు పెద్ద కొండల్ని తెప్పించాడు. అవి మరలా పైకి ఎగరకుండా నాలుగు డ్రాగన్లను నాలుగు కొండల కింద బంధించాడు.
కానీ తాము చేసిన పనికి ఆ డ్రాగన్లు కొంచెం కూడా బాధపడలేదు. ప్రజలకు శాశ్వతంగా మేలు చేయాలని, భూమిని నిరంతరం కాపాడుతూ పచ్చని పంటలు పండించాలని, ప్రజలను కరువు నుంచి దూరం చేయాలని నిర్ణయించుకున్నాయి. వెంటనే అవి నాలుగు నదులుగా మారిపోయి ఆ కొండల కింద నుండి ప్రవహించడం మొదలుపెట్టాయి.
నల్ల డ్రాగన్ ఉత్తరాన హీలాంగ్జియాంగ్ నదిగా మారింది. పసుపు డ్రాగన్ మధ్య చైనాలో హువాంగ్ హే (ఎల్లో రివర్) గా మారింది. పొడవు డ్రాగన్ దక్షిణాన యాంగ్జీ నదిగా మారింది. ముత్యపు డ్రాగన్ సుదూర దక్షిణాన జుజియాంగ్ (పెర్ల్ రివర్) గా మారింది. అలా అవి ఆ రోజునుంచీ నిరంతరం ప్రజలను కాపాడుకుంటూ వాళ్ళ పూజల్ని అందుకుంటూ రక్షకులుగా నిలబడ్డాయి.
*******

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి