ముసలాయన - కుక్కపిల్ల (జపాన్ జానపద కథ): -డా.ఎం. హరి కిషన్- కర్నూలు-9441032212
 

ఒక ముసలాయన పొలానికి పోతూవుంటే దారి పక్కన ఒక గోతిలో ఒక చిన్న కుక్కపిల్ల కనిపించింది. ఆ గోయి చాలా లోతుగా ఉంది. పైనుంచి జారి పడటంతో దానికి బాగా దెబ్బలు తగిలాయి. పైకి రాలేక కుయ్యి కుయ్యిమంటూ బాధతో అరుస్తా ఉంది. ఆ ముసలాయనకు దాన్ని చూస్తేనే చాలా జాలి కలిగింది. 'అయ్యో పాపం' అని నెమ్మదిగా లోపలికి దిగి ఆ కుక్కపిల్లను బయటకు తీసుకొచ్చాడు. దానిని జాగ్రత్తగా ఇంటికి తీసుకుపోయాడు.
ముసలామె ఆ చిన్న కుక్కపిల్లను చూసి చాలా సంబరపడింది. దాని ఒంటి మీద వున్న దెబ్బలు చూసి బాధపడింది. ఒళ్లంతా శుభ్రం చేసి మందుపూసి కడుపునిండా పాలబువ్వ పెట్టింది. ఆ రోజునుంచి ఆ కుక్కపిల్ల వాళ్ల ఇంటిలో ఒక సభ్యురాలిగా మారిపోయింది. తాము ఏమి తింటామో దానికి అదే పెట్టేవాళ్ళు. తాము ఏది తాగుతామో దానికి అదే తాపేవాళ్లు. సొంత బిడ్డలాగా చూసుకునేవాళ్లు. ఆ కుక్క ఎప్పుడు వాళ్లతోనే ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉండేది.
ఒకరోజు ఆ ముసలాయన పొలానికి కుక్కతో బాటు పోయాడు. పొలం దున్నుతా వుంటే ఒకచోట కుక్క ఆగిపోయింది. మూతితో వాసన చూస్తూ కాళ్లతో గుంత తవ్వసాగింది. ఎంత అదిలించినా పక్కకు పోవడం లేదు. తవ్వడం ఆపడం లేదు. ఆయన పంచ పట్టుకుని అటువైపు లాగుతా ఉంది. దాంతో 'ఎందుకబ్బా అది అట్లా చేస్తావుంది అని ఆ ముసలాయన కూడా అక్కడ తవ్వసాగాడు. కొంచెం లోపలికి తవ్విచూస్తే ఇంకేముంది... ఒక పెద్ద బంగారు బిందె బయటపడింది. తెరచి చూస్తే... లోపలంతా ధగధగా మెరిసిపోతావున్న వజ్రాలు, రత్నాలు, కెంపులు, పచ్చలు చాలా ఖరీదైనవి కనపడ్డాయి. దెబ్బకు ఆ ముసలోని దరిద్రం అంతా తీరిపోయింది. వాటిని అమ్మి పెద్ద మిద్దె కట్టుకున్నాడు. మంచి పొలం కొనుక్కున్నాడు. హాయిగా కాలుమీద కాలేసుకుని కులాసాగా బతకసాగాడు.
వాళ్ళ ఇంటి పక్కన ఒక ధనవంతుడు ఉన్నాడు. వాడు పక్కవానికి పైసా సాయం చేయడు గానీ ఎవరైనా బాగుపడుతుంటే మాత్రం కళ్ళలో నిప్పులు పోసుకునేవాడు. ఎవరు సంతోషంగా వున్నా చూడలేక పోయేవాడు. తన ఇంటిపక్కనే చిన్న గుడిసెలో వుండే ముసలోళ్ళు అంత పెద్ద ఇల్లు కట్టుకునేసరికి తట్టుకోలేకపోయాడు.
ఒకరోజు ఆ ముసలాయన దగ్గరికి వచ్చి "నిజం చెప్పు... ఎవరూ ఒక్క క్షణంలో ఇంత సొమ్ము సంపాదించలేరు. దేవతలు గానీ దయ్యాలుగానీ వరమిచ్చాయా. లేక ఎక్కడైనా ఎవరినైనా కొట్టో చంపో దోచుకుని వచ్చావా. నిజం చెప్పు. లేకపోతే నువ్వు దొంగతనం చేశావని నాకు తెలిసిన రాజభటులను పిలిచి పట్టిస్తాను. వాళ్ళు నిన్ను తీసుకుపోయి లోపలేసి చావగొట్టడం ఖాయం" అని భయపడించాడు.
అప్పుడు ఆ ముసలాయన జరిగిందంతా చెప్పాడు. దాంతో ఆ ధనవంతుడు వాళ్ళ దగ్గర వున్న కుక్క మెడకు తాడు కట్టి బలవంతంగా గుంజుకొని తన పొలానికి తీసుకుపోయాడు. "ఈ పొలంలో ఎక్కడయినా లంకె బిందెలు ఉన్నాయేమో చూడు" అంటూ తరిమాడు. అది పొలమంతా తిరగసాగింది. అలసిపోయి ఆగితే చాలు వెనకనుంచి కర్రతో రపారపా కొట్టసాగాడు. పాపం అది పొద్దున్నుంచి సాయంత్రం వరకు తిండి నీరు లేకుండా ఎర్రని ఎండలో తిరిగి తిరిగి పూర్తిగా అలసిపోయింది. ఇక అడుగు కూడా ముందుకు వేయలేక ఒకచోట కూలబడిపోయింది. కొట్టినా కదల్లేదు. తిట్టినా కదల్లేదు. దాంతో ఆ ధనవంతుడు "ఓహో... ఇక్కడే లంకె బిందెలు ఉన్నట్టున్నాయి. అందుకే ఇది ఇంచు కూడా కదలడం లేదు" అనుకుంటూ అక్కడ తవ్వడం మొదలుపెట్టాడు. అట్లా తవ్వుతావుంటే ఒకచోట ఖనేల్మని గట్టిగా చప్పుడయింది. 'ఏముందబ్బా' అని ఆశగా తవ్విచూస్తే ఒక పాత ఇనుపపెట్టె బయటపడింది. దాన్ని తీసి మూత తెరిచాడు. దానినిండా ఎముకలు, పుర్రెలు, రాళ్లు రప్పలు ఉన్నాయి. అదిచూసి ఆ ధనవంతునికి చాలాకోపం వచ్చింది. "ఓసి దొంగదానా... వానికేమో బంగారు నాణాలు, నాకేమో పనికిరాని ఎముకలా" అంటూ కోపంతో ఊగిపోతూ చేతిలోని కట్టెతో దాన్ని గట్టిగా ఒక్కదెబ్బ కొట్టాడు. అది సరిగ్గా దాని నెత్తిమీద తగలడంతో పాపం తట్టుకోలేక అక్కడికక్కడే పడి చచ్చిపోయింది.
విషయం తెలిసి ముసలాయన పరుగు పరుగున అక్కడికి వచ్చాడు. ఆ కుక్కను గుండెలకు హత్తుకొని కిందామీదాపడి ఏడ్చాడు. కళ్ళనీళ్ళతో దాన్ని జాగ్రత్తగా తన పొలంలోకి తీసుకుపోయి ఒకచోట సమాధి చేశాడు. తను ఎంతో ప్రేమించే ఆ కుక్కకు గుర్తుగా ఆ సమాధిపై ఒక మంచి మామిడి పండ్ల మొక్క నాటాడు. అది చూస్తుండగానే రోజుకు ఒక అడుగు చొప్పున పెరుగుతూ నెల రోజులకంతా పూలు పూసి, పళ్ళనిచ్చింది. తామెంతో ప్రేమించే తమ కుక్క చెట్టుగా మరలా మొలిచిందని ముసలోళ్ళు చాలా సంబరపడిపోయారు. ఆ పళ్ళు తెంపుకొని ఇంటికి తీసుకు వచ్చారు. తిందామని కోస్తే ఆ తీయని మామిడిపండు మధ్యలో బంగారు టెంకలు ధగధగా మెరిసిపోతా కనపడ్డాయి.
ఈ విషయం ఆ ధనవంతునికి తెలిసిపోయింది. వెంటనే రాత్రికిరాత్రి పోయి ఆ చెట్టు మీద వున్న కాయలన్నీ ఒక్క పిందె కూడా వదలకుండా తెంపుకొని ఇంటికి తెచ్చుకున్నాడు. సంబరంగా పండుకోసి చూస్తే ఇంకేముంది ఒకటే కుళ్ళిన వాసన. ముక్కులు పగిలిపోయేలా గుప్పుమని కొట్టసాగింది. చేతులు ఎంత కడిగినా కంపు కంపు కాదు. ఆ వాసనకు ఇంటి చుట్టుపక్కల వాళ్లంతా ముక్కులు మూసుకుని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టసాగారు. ధనవంతునికి పిచ్చికోపం వచ్చింది. రాత్రికి రాత్రి కూలీలని తీసుకొని ఆ చెట్టు దగ్గరికి పోయాడు. చెట్టు మొత్తాన్ని ముక్కలు ముక్కలుగా నరికించి అక్కడికక్కడే తగలబెట్టేశాడు. అంతే అరగంట కల్లా అది మొత్తం కాలి బూడిదగా మారిపోయింది.
పొద్దున్నే ఆ ముసలాయన పోయిచూస్తే ఇంకేముంది... చెట్టు లేదు. సమాధి లేదు. పెద్ద బూడిద కుప్ప మాత్రమే కనపడింది. అదిచూసి కదిలిపోయి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఆ బూడిద కుప్పలో తామెంతో ప్రేమించే బుజ్జికుక్క మనసు ఉంది కదా... దాంతో ఆ బూడిద కొంచం తీసుకుపోయి ఏదైనా పుణ్యనదిలో కలపాలి అనుకున్నాడు. ఒక బస్తా నిండా తీసుకొని ఇంటికి వచ్చాడు. అంతలో పెద్దగాలి వచ్చింది. సంచీలోని బూడిద కొంచెం గాలిలోకి లేచి ఇంటి పెరట్లో ఉన్న ఎండిపోయిన చెట్లమీద పడింది. అంతే... మరుక్షణంలో ఆ ఎండిపోయిన చెట్లు చిగురించి, రంగురంగుల పువ్వులు పూయసాగాయి. నిమిషాల్లో అక్కడంతా అందమైన పూలతోట చూడముచ్చటగా మిరమిట్లు గొలుపుతా తయారయింది. దాంతో "ఆహా... ఇదంతా నేనెంతో ప్రేమించే నా బుజ్జి కుక్కపిల్ల మహిమే" అనుకుంటూ తోటలోని బూడిదంతా తెప్పించి ఇంట్లో భద్రపరిచాడు.
ఆ ఊరి రాజుకు ఒక చిన్నపాప ఉంది. లేక లేక కలగడంతో ఆ పాపంటే వాళ్లకు చాలా ప్రేమ. అల్లారుముద్దుగా అడిగింది కాదనకుండా, కళ్ళల్లో నీళ్ళు కారకుండా పెంచసాగారు. ఆ పాప ఒకసారి ఒక రంగురంగుల గులాబీ చెట్టు తెచ్చుకుంది. ఆ చెట్టు అంటే ఆ పాపకు చాలా ఇష్టం. దానికి రోజూ నీళ్లు పోస్తూ పువ్వులు ఎప్పుడు కాస్తాయా అని ఎదురు చూడసాగింది. కానీ అనుకోకుండా ఆ చెట్టుకు తెగులు పట్టి రోజురోజుకీ వాడిపోసాగింది. దాన్ని బతికించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ మొక్క చిగురించడం లేదు. ఆ మొక్క అంటే ఆ పాపకు ప్రాణం గదా... దాంతో చాలా బాధపడింది. అన్నం సరిగా తినకుండా, ఎవరితో మాట్లాడకుండా ఎప్పుడు దిగులుగా ఆ పూలచెట్టునే చూస్తూ ఉండసాగింది. ఎన్నో రకరకాల రంగురంగుల అందమైన పూలచెట్లు తెచ్చి ఆ పాప ముందు పెట్టారు. కానీ ఆ పాప "నాకు ఇవేమీ వద్దు. నా గులాబీ మొక్కే నాకు కావాలి" అని మొండిపట్టు పట్టింది. ఎన్ని ఎరువులు వేసినా, ఎన్ని పురుగుమందులు చల్లినా ఆ చెట్టు బతకడం లేదు. ముద్దుల కూతురి చిన్న కోరిక కూడా తీర్చలేక రాజు బాధపడతా వుంటే ఎండిన చెట్లను చిగురింపచేసి పూలు పూయించిన ముసలాయన గురించి తెలిసింది. వెంటనే అతన్ని పిలిపించి విషయమంతా వివరించాడు.
ఆ ముసలాయన ఒక చిన్న సంచిలో బూడిద తీసుకొని వచ్చాడు. తన బుజ్జికుక్కను ప్రేమగా మనసులో తలుచుకొని ఆ ఎండిపోతున్న గులాబీ మొక్క మీద కొంచెం చల్లాడు. అంతే... అది మరుక్షణంలో నెమ్మదిగా పచ్చగా మారసాగింది. కళ్ళముందే కొత్త చిగుర్లు వేసి పువ్వులు పూయసాగింది. అదిచూసి ఆ పాప సంబరంగా గంతులు వేసింది. పరిగెత్తుకొనిపోయి ఆ తాతను చుట్టుకుని 'మా మంచి తాత' అంటూ బుగ్గమీద ముద్దు పెట్టుకుంది. నెలరోజుల తర్వాత నవ్విన తన ముద్దుల కూతుర్ని చూసి రాజు చాలా సంబరపడ్డాడు. పెద్ద ఏనుగు మీద అది మోసినన్ని బంగారు వరహాలు నింపి ఆ ముసలాయనకు కానుకగా ఇంటికి పంపించాడు.
విషయం తెలిసి ఆ ధనవంతుడు మరింత కుళ్ళుకున్నాడు. రాత్రి ఎవరూ లేని సమయంలో గోడ దుంకి ముసలోని ఇంట్లో దూరాడు. బూడిదతో నిండి వున్న ఒక సంచి తీసుకుని బయటకు వచ్చాడు.
తర్వాతరోజు ఆ బూడిదను తీసుకొని రాజభవనం చేరుకున్నాడు. రాజు కూతురితో "పాపా... ఆ ఒక్క మొక్కనే కాదు. మొత్తం మీ రాజభవనం అంతా అందమైన పూలతోటగా మారుస్తా చూడు" అంటూ ఆ పాప వద్దంటున్నా వినకుండా సంచీలోని బూడిద తీసి చల్లసాగాడు. అంతలో పెద్ద గాలి వీచింది. ఆ గాలికి బూడిద అంతా పైకి లేచి రాజకుమారి కళ్ళలో పడింది. దాంతో ఆ పాపకు కళ్ళు మంటలేసి ఎర్రగా అయిపోయాయి. నొప్పిని తట్టుకోలేక పెద్దగా ఏడవసాగింది.
రాజు అదిచూసి "ఏరా.. నా కూతురి కళ్ళలోనే నీళ్లు కారిపిస్తావా. ఎంత పొగరురా నీకు" అంటూ కొరడా తీసుకొని కొట్టినచోట కొట్టకుండా కొట్టి "ఇంకోసారి నా రాజ్యంలో ఎక్కడయినా కనపడ్డావనుకో కళ్ళు పీకి కాకులకు గద్దలకు వేయిస్తా చూడు" అన్నాడు. దాంతో వాడు భయపడి రాత్రికిరాత్రి ఆ రాజ్యం వదిలి ఎవరికి కనపడకుండా పారిపోయాడు.  
**********
కామెంట్‌లు