"అదృశ్యవీరుడు" జానపద నవల 9️⃣✅వ భాగం - : : "నాగమణి రావులపాటి"


ఎందుకో అనుమానం వచ్చిన చెలికత్తెలు, రక్షణ పరివారంతో వెనుతిరిగి శివాలయం వెతకగా, ఎక్కడా మహారాజు కానీ, సుసేనులవారు కానీ, యువరాణీ వారు కానీ కనిపించలేదు. రాజమహల్‌కి వెళ్ళగా అక్కడ ఉన్న మహారాజును చూసి విస్తుపోయారు...
"మహారాజా! మమ్మల్ని పంపించి మీరింత త్వరగా ఇక్కడకు ఎలా రాగలిగారు? యువరాణీ అమృతవల్లి ఎక్కడ?" అని అనేసరికి, "ఏమంటున్నారు మీరు? నేనే కదా అమ్మాయిని మీ వెంట ఆలయానికి పంపింది..."
"మరల నేను పంపటమేమిటి? అమ్మాయి ఏది!!" అని శివదత్తుడు అనేసరికి, "అవును మహారాజు! రాచకార్యం వలన రావటం కుదరక, మహారాణీ వారికి వీలుపడక తగిన సైనిక బందోబస్తుతో మిమ్మల్ని పంపినారు. పండితులవారు, సుసేనుని ఆజ్ఞ మేరకే కదా అలా చేశాము" అని అన్నాడు మంత్రి సుబుద్ధి.
"మంత్రివర్యా! పండితులవారు యువరాణి వారిచేత పూజ చేయించారు. అంతలోనే ఆయన కనిపించలేదు. మహారాజు అక్కడికి వచ్చారు. 'నేను అమ్మాయిని తీసుకువస్తాను, మీరంతా కలిసి రాజమహల్‌కు వెళ్ళండి' అని ఆజ్ఞ జారీ చేశారు..."
"రాజాజ్ఞననుసరించి మేమంతా ఇక్కడికి చేరుకున్నాం. మాకంటే ముందే మహారాజు చేరుకోవటం మాకు ఆశ్చర్యం కలగజేస్తోంది" అనగానే, మహామంత్రి "అంతా మాయలా ఉన్నదే! పండితులవారు ఏమయ్యినట్టు?" అని అన్నాడు మంత్రి సుబుద్ధి.
"ఎవరక్కడ? వెంటనే పండితుల వారిని తోడ్కొని రమ్మని వర్తమానం పంపండి" అని మంత్రి సుబుద్ధి ఆజ్ఞాపించారు. ఆఘమేఘాల మీద సుసేనుడు వచ్చి, "ఏమిటి ప్రభూ? ఉన్నపళంగా రమ్మని కబురు చేయటానికి కారణమేమిటి? నాకు కాస్త నలతగా ఉండి విశ్రాంతి తీసుకొనుచున్నాను" అని అన్నాడు.
"అదేమిటి ఆచార్యదేవా! అలా అంటారు? మీరేగా యువరాణీ వారిని శివాలయానికి తోడ్కొని రమ్మని నాకు చెప్పగా, నేను మహారాజు ఆజ్ఞ మేరకు అమ్మాయిని పంపాను. మీరు ఆమెతో పూజ కూడా చేయించారట!" అనేసరికి, "మంత్రివర్యా! నేను పొద్దుటి నుండి ఇంటి గడప కూడా దాటలేదు, విశ్రాంతి తీసుకుంటున్నాను."
"ఈ బటుడు వచ్చి మీరు రమ్మన్నారని వర్తమానం పంపితే ఇదిగో ఇలా వచ్చాను ప్రభూ! ఇదంతా చూస్తుంటే నాకు అనుమానం కలుగుచున్నది. ఏదో అనర్థం ముంచుకొచ్చింది ప్రభూ! పదండి, ముందు అమ్మాయిని వెతికే ప్రయత్నం చేయండి..."
అని సుసేనులవారు పలికేసరికి మహారాజు విస్తుపోయాడు. వెంటనే బటులను పిలిచి, "అంగుళం వదలకుండా యువరాణీ వారిని వెతకండి" అని ఆజ్ఞాపించగా, వెళ్ళిన బటులు "మొత్తం చుట్టుపక్కల అంతా గాలించాము ప్రభూ!"
"ఎక్కడా యువరాణీ వారి జాడ తెలియరాలేదు" అని విన్నవించుకున్న భటుల మాటలకు, జరిగినదానిని అవలోకనం చేసుకున్న పండితపుంగవుడు: "ప్రభు! ఏదో జరగరానిది జరిగింది..."
"మహారాజా! నేను అసలు మీతో సంప్రదింపులు జరపకుండా కోట గుమ్మం బయట నుంచోవటం ఏమిటి? మంత్రివర్యులకు నేను చెప్పటం ఏమిటి? మీరు అమ్మాయిని కేవలం చెలికత్తెలను తోడునిచ్చి భటులతో పంపటమేమిటి? కనీసం మహారాణీ సుదేష్ణా వారిని కూడా వెంట పంపకపోవటం నాకు బహు విచిత్రముగాను, అగమ్యగోచరంగానూ తోచుచున్నది..."
"చూస్తుంటే ఇదేదో మాయలా ఉన్నది! ఏ మాయాకుడో వలపన్ని యువరాణీ వారిని అపహరించి ఉంటాడు. శివదత్తా! ఆలస్యం చేయక అమ్మాయిని చుట్టుపక్కల వెతికించే ప్రయత్నం మరలా చేయించండి. త్వరితగతిన జాడ తెలియకపోతే అమ్మాయి చాలా ప్రమాదానికి గురికాక తప్పదు మహారాజా!"
"అమ్మాయికి ఇదే ప్రభూ గండము" అని వివరించేసరికి మహారాజు శివదత్తుడు, మంత్రి సుబుద్ధి విస్తుపోయారు. అమ్మాయి అపహరణకు గురిఅయిందా? ఎవరో మాయలు పన్ని తీసుకువెళ్ళారా!! ఇంత రక్షణ కవచం చుట్టూ ఉన్నా యువరాణిని కాపాడలేక పోయామా...
ఎక్కడెక్కడి రాకుమారులో స్వయంవరానికి విచ్చేసియున్నారు. మరెందరో స్వయంవరాన్ని తిలకించాలని ఎదురుచూస్తున్నారు. పురజనులు, పరివారము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేను, మన మహారాణీ వారు ఎంతో ఆనందంతో అమ్మాయి వివాహం కళ్ళారా చూసి తరిద్దామని ఎదురు చూసే తరుణంలో నా ఆశలన్నీ మంటగలసిపోయాయి. అమ్మాయి ఏమయింది? అని ఆవేదనకు గురై మహారాజు కుప్పకూలిపోయాడు.
శివదత్తుడు కుప్పకూలిపోయాడు! (సశేషం) 
కామెంట్‌లు