సామెత -356: ఇత్తు కొట్టి (యిసిరి/ దంచి) యిరస అంబలి
కాచి ఇంటికి నలుగురిని పిల్చి యిందు చేసినట్లు
**
"అవ్వా! నువ్వేమన్న అన్కో గని గస్మంటి మడిషిని ఏడ సూడలేదవ్వా! మాటలు కోటలు దాట్తుంటయి- శేతలు గడ్ప దాటవు గని,తెల్వనోళ్ళు మాత్తరం గీమెది ఏ మారాణి పుట్కో అన్కుంటరు. నోరు తెరిత్తే సాలు అవద్దాలు వరదొతికె బయిటికొత్తుంటయ్!"
ఎవరు శెల్లే! గామెవరో గని జాత్కమంత యిప్ఫి శెబుతున్నవ్! నువ్వన్నయి, మన మన్కున్నయి తెలిత్తే గామెతో లొల్లి తప్పదు జెర జాగర్త మరి. "
ఉన్న మాటకు ఎవలికైన ఉల్కెక్కువే మరి. గా బుచ్చమ్మొదిన శెకలు సూత్తె" శెప్పింది పైసొంతు సూశింది గింతుందా అన్పిత్తది తెల్సా! అవ్వా"
" అవునా శెల్లె! బుచ్చమ్మ మాటకారి అన్కున్న గని గిస్మంటి మాటలు మాట్లాడ్తదనుకోలే."
ఇంటికి వొక్క సుట్టపోడొత్తెనే పదిమందిరి వొచ్చినట్టు షో శేత్తది.మరి గామె ఎచ్చుల ముచ్చెటి శెప్పనా అవ్వా!"
""మొన్నోపాలి గాళ్ళింటికి పొయ్యే తల్కి ఓ నల్గురు సుట్టపోళ్ళు ఉన్రు.గాళ్ళకి గిలాసల నిండ మంచిళ్ళు యిచ్చింది.తాగిన్రు కూసున్రు.ఇంగ గాళ్ళలో ఒక్కోల్ని పిల్సుకుంట మావా నీకు కాయి కూర ఇట్టమేనా? గుడ్లు పొట్లిచ్చాల్నా? అంది.ఇంగ సూస్కో గాయిన మొకం శాటంత అయ్యింది. 'నీ యిట్టమే తల్లీ! అన్నడు."
"ఇంగ ఇంకొకల్ని పల్కరిచ్చుకుంట శేపల పుల్సు తింటవు గద, లేదంటే గోలిచ్చి పెట్టనా అంది. ఇంగ గాయినకి ఊరీలొచ్చి నోట్లోంచి సొల్లు సుత కారింది అవ్వా!"
" ఇంకిద్దర్ని సుత "బగార కాన కావాల్నా? పులావ్ బిరానీ కావల్నా"?" అని గిట్ల రకరకాలుగా అడ్గుతుంటే గాళ్ళ మొకాలు దీపాల పండక్కి ఎలిగిచ్చే పటాసుల్లెక్క ఎల్గి పోయినయి. "
" ఇంగ నాకు సుత! గియ్యన్ని సేశి పెడ్తదా? తెప్పిచ్చి పెడ్తదా సూడాలని మా ఆరాటంగ వుంది.వంటర్రలకి బోవుడు లేదు.పొయ్యి ఎలిగిచ్చుడు లేదు."
"గాల్లేమో త్యాపకో పాలి బుచ్చమ్మొదిన వొయిపు,వొంటర్ర వొయిపు సూసుడు మొదలు వెట్టిర్రు. ముందగాల గియ్యి తాగుండ్రి అన్కుంట అన్నం గంజి నీళ్ళు లెక్క జేసి,గందుట్ల ఉప్పుగల్లేశి నపరొక్క గిలాసు ఇత్తే ఆవురావ్రని తాగి కూసుర్రు.జెర్రాగి వో పెద్దాయిన బోయినం ఎప్పుడు వెడ్తవు బిడ్డా! అన్నడు. మీ అల్లుడు పన్లకి బోయిండు రాత్రికొత్తడు గప్పుడు ఆయిన వొచ్చినంక " అంటుండంగనే ఒక్కొక్కల మొకాలు సూడాలె అవ్వా! గోడకి గొట్టిన సున్నం లెక్క తెల్లగయినవి. గిప్పుడే వొత్తం అన్కుంట మెల్లగ గానించి జారుకుర్రు.
" గాల్లటు బోంగనే వండిన అన్నం,కూర బెట్కొని పొట్లెంగ తిన్నది. గాళ్ళని గట్ల ఆశబెట్టుడు సూశి తెర్శిన నా నోరు గిప్పుడు సుత మూత వల్లేదవ్వా! మరీ గిన్ని ఎచ్చులా? అన్పిచ్చిందవ్వా!"
" శెల్లే గస్మంటోళ్ళు మన సుట్టూత ఉన్న లోకంల కొందరుంటరు.మడ్సులు లేకుండనే పల్లకి ఎక్కిత్తరు."
గందుకే గస్మంటోళ్ళ మీద గమ్మత్తైన శాత్రం పుట్టిచ్చిర్రు.సూడు మరి. " ఇత్తు గొట్టి యిరస గంజి కాశి ,ఇంటికి నల్గురిని పిల్శి యిందు( విందు జేసిందంట" అగ్గో గట్లున్నది గీ ముచ్చెటి"
"వామ్మో! అవ్వోవ్! గిస్మంటి మడుసులు సుత వుంటరా? యిరస అంటే ఏందవ్వా?"
" ఇరస అంటే రొండు కుంచాలు., అంబలి అంటే గంజి " శెల్లే!"
"బలే గమ్మతిగ ఉందవ్వా! గీ శాత్రం గదేదో సైన్మాల కోట శీనివాసరావు, రాజేంద్దపసాదు యాదికొచ్చిర్రవ్వా! "
"అవును శెల్లే! గస్మంటోళ్ళు మన సుట్టూతల ఉన్నోళ్ళల్ల ఎవలో ఒకలు వుంటరు. గందుకే గీ శాత్రం పుట్టింది . "
" గదండీ సంగతి! ఇత్తు గొట్టి యిరస గంజి కాశి ఇంటికి నల్గురిని పిల్శి యిందు చేసినట్లు " అంటే గిదే మరి. గస్మంటోళ్ళు జేసే శకలు గిట్లనే ఉంటయి శెల్లే! "
" బలే శిత్రమైన లోకంల వున్నం గదవ్వా మనం."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి