కర్ణ పర్వం – తృతీయాశ్వాసం: 393 వ రోజు
ధర్మజుడు అర్జునుడిని నిందించుట
అన్నయ్యా ! నేను సంశక్తులతో యుద్ధము చేస్తున్నప్పుడు అశ్వత్థామ తన సేనలతో నన్ను చుట్టుముట్టాడు. నేను ఆ సేనలోని అయిదువందల రథాలను విరిచి రణభూమిని వారి శవాలతో నింపాను. అశ్వత్థామ నన్నూ నా రధాన్ని కనిపించనంతగా శరములతో కప్పి నాకు దిక్కు తోచకుండా చేసాడు. ఆ తరువాత నేను అతడిని తరిమి కొట్టాను. నీ కొరకు వెదికాను నీవు కనపడ లేదు భీమసేనుడు నిన్ను గురించి చెప్పాడు. నీ యోగక్షేమాలు కనుక్కోవడానికి వచ్చాను నా మనస్సు శాంతించింది. ఇక నేను యుద్ధ భూమికి వెళ్ళి నీ మనస్సు ఆనందించేలా కర్ణుడిని వధించి తిరిగి వస్తాను " అన్నాడు. కర్ణుడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడని తెలుసుకుని ధర్మరాజు కోపంతో ఊగి పోయాడు. " అర్జునా ! నేను రణభూమి నుండి తిరిగి వచ్చి మీకు అందరికి చులకన అయ్యాను. నేనే కాదు భీముడు, నకులసహదేవులు కర్ణుడి చేత ఓడి పోయారు. ఆఖరికి నీవూ కృష్ణుడు కూడా కర్ణుడి చేతిలో ఓడి పోయారు. ఇక మనకు యుద్ధ భూమిలో పని లేదు. మనమంతా తిరిగి అడవులకు పోయి తాపస వృత్తి స్వీకరిస్తాము. లేకున్న సుయోధనుడి వద్దకు వెళ్ళి అతడి చెప్పుచేతలలో ఉంటాము " అన్నాడు. ఆ మాటలకు అర్జునుడి కళ్ళు నిప్పులు కక్కాయి. ధర్మరాజు తిరిగి " అర్జునా ! నీవు ఇంతటి వాడివి అని తెలిసిన మనము యుద్ధముకు దిగక మనకు తోచిన పని చేసే వాళ్ళము. ముందుగా నీవు నాకు కర్ణుడిని చంపడం చేతకాదని చెప్పి ఉంటే ఈ యుద్ధానికి ఎందుకు అంగీకరిస్తాను. అప్రయోజకులమైన మనకు రాజ్యమెందుకు రాజ్య పాలన ఎందుకు ? యుద్ధముకు ముందు కర్ణుడిని వధిస్తానని చెప్పి ఇప్పుడు ఓడి పోయి వచ్చి నన్ను అవమానాలపాలు చేసావు. అసలు నన్ను ఆకాశానికి ఎక్కించి నాలో ఆశలు కల్పించి పాతాళంలోకి నెట్టడ మెందుకు. ఆ రోజు కృష్ణుడి ముందు నీవు చెప్పినవన్నీ అసత్యములేనా ! నీవు పుట్టినప్పుడు గొప్ప వీరుడివి ఔతావని శత్రువులను నిర్జిస్తావని ఆకాశవాణి, మహా మునులు చెప్పారు. నీవున్నిటినీ వమ్ము చేసావు. నీవు కర్ణుడిని చంపలేవని తెలియక సుయోధనుడితో వైరము పెట్టుకున్నాను. అర్జునా ! నీకేమి తక్కువ. దేవత లిచ్చిన రథము ఆశ్వములు ఉన్నాయి. నీ ధ్వజము మీద కపిధ్వజము ఉన్నది. నీచేత తిరుగులేని గాండీవం ఉంది. అక్షయ తుణీరము ఉంది. అన్నిటికీ మించి దేవదేవుడైన శ్రీకృష్ణుడు సారధిగా నిన్నెప్పుడూ వెన్నంటి ఉన్నాడు. నీవు కర్ణుడి చేతిలో ఎలా ఓడి పోయావో నాకు అర్ధము కాలేదు. సుయోధనుడు నీవు కర్ణుడిని జయించలేవని ఎప్పుడో చెప్పాడు. కాని నేను నమ్మలేదు నీ పరాక్రమాన్ని నమ్మి భంగపడ్డాను. కోరి కష్టాలు తెచ్చుకున్నాను. మన ఇద్దరినీ మిత్ర రాజులు నమ్మి అనవసరంగా తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు " అని అనేక నిష్టూరోక్తులు పలికినా అర్జునుడు ఏమీ పలుక లేదు. ధర్మరాజు ఇంకను శాంతించక " కృష్ణా ! ఇక లాభం లేదు కర్ణుడిని జయించడం మన శక్యము కాదని తెలిసింది. సుయోధనాది శత్రురాజుల ముందు ఘోరావమానం పాలయ్యాను. భీముని దయ వలన ప్రాణాలతో బయట పడ్డాను. పాపం భీముడు ఒక్కడే అర్జునుడిలా పారి పోక ప్రాణాలకు తెగించి యుద్ధము చేస్తున్నాడు " అని తిరిగి " అర్జునా ! ఈ రోజు అభిమన్యుడు, ఘతోత్కచుడు ఉంటే బాగుండేది. అయినా చేసిన పాపాలకు వాళ్ళు మనకు ఎందుకు దక్కుతారు. చుట్టము అంటే ఆపదలో ఆదుకునే వాడు. శ్రీ కృష్ణుడి వంటి చుట్టము ఉండగా నీవు యుద్ధ భూమి నుండి ఎందుకు వచ్చావు. ఒక్క పని చేయి నీ గాండీవం కృష్ణుడికిచ్చి నీవు రథము తోలు. ఒక్క క్షణంలో కర్ణుడిని వధించి సుయోధనుడి రాజ్యం అపహరించ గలడు. నీవు కుంతీ గర్భాన ఉండగానే గర్భస్రావం అయి ఉంటే ఇంతటి దుర్గతి పట్టి ఉండదు కదా ! " అన్నాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి