సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 


సామెత-357: - ఇంట్లో ఇత్తులు లేవు - ఇద్దర్కి మాటలు లేవు
**
"అవ్వా!గా పొల్ల శెరలంటె శెరలు గావు.పగోనికి సుత రావొద్దు.అస్లే లేమిడి సంసారం. కూలినాలికి బొయ్యి గా శిన్నపొల్లగాండ్లను బల్లెకు పంపిచ్చుకుంట గుట్టుగ బత్కెల్ల దీస్కుంటున్నది.
శెల్లే నువ్వు శెప్పేది గా బత్కమ్మ ముచ్చెటినే గద. నిండ పాతికేండ్లు లేవు పొల్లకి.ఇద్దరు పిల్లలు.తాగుబోతు మొగుడు.గానితో ఏగుడే మా కట్టం.'గదేంది బిడ్డా! గాన్ని మార్సుకోలేక పోయినవా?' అని అడిగితే తాగకుంటె మంచోడవ్వా.శెడ్డోల్ల సవ్వాసం బట్టి గట్లయ్యిండు.ఏం జేత్త నా కరమ అవ్వా! కరమ! అంటది."
"అవునవ్వా! సక్కదనాల పొల్ల.వొల్లు దాస్కోకుండ పొద్దత్తమానం ఏదోక పన్జేత్తనేగా ఉంటది. గది బోని పని లేదు.పొలంల నాటుకు బోతది. ఇల్లు కట్టుబడికి యిటుకలు మొయ్యబోద్ది.గయ్యేమి దొర్కనప్పుడు.ఎవలికన్న ఏదన్న పనిల సాయం బోద్ది.అయిన గని ఈరిగాడికి ఏమన్న బుద్ధి గ్యానం ఉందా? పనికి బొయ్యి తెచ్చిన పైసలు మొత్తం తాగుడుకే బెడ్తుండె. కొంపల పెళ్ళాం బిడ్డల సోయే లేదు. ఎన్ని త్యేపల నయాన బయాన శెప్పినా మారట్లేదు. "
అవును శెల్లే! గీత నడ్మల గా పొల్లకి సుస్తీ జేశిందట గద. పన్ల కాడ అగబడట్లేదెందుకో వాల్ల శిన్నోడిని అడ్గితే శెప్పిండు" .
"అవునవ్వా!గీ నడ్మల ఆనలు పడ్డ కానించి శాన మందిరికి తుమ్ములు పడిశాలు జొరాలు వొత్తున్నయి.వొచ్చినయ్ ఎంటనే పోక శానొద్దులు అవత్త బెడ్తున్నయి.అయితే పనికి బోక ఇల్లెల్లక, ఓ పక్క జొరంతో అవత్త పడ్తున్న గా పొల్లతో మాటలు బంజేసిండంట గీ లఫంగి గాడు."
 "ఎందుకు శెల్లే! గానికేం దొబ్బుడయ్యింది.తెచ్చి పెడ్తే తినుడు తాగుడు ఊరిమీద బలాదూర్ తిరుగుడు తప్ప కొంపల పెళ్ళాం బిడ్డల యిష్యం పట్టిచ్చుకునుడే లేదాయె."
"గదే నవ్వా! ఇంట్లో ఇత్తులు లేవు వొండి పెడ్తే తినడానికి. వోపిక జేస్కొని నూకల గంజి కాశి పిల్లల్ని తాపి బడికి పంపుతున్నది. గా గంజి గీనికి సొక్కట్లేదట.అన్నమైతనే తింటనని మొండికేస్కుని మాటలు బంజేసిండంట. "
" ఇంట్లో ఇత్తులు లేవు ఇద్దర్కి మాటలు లేవు" అంటే గిదే." కడ్పుల మాడితే గుర్రం వొరిగడ్డి తిన్నట్టు" గీనికి సుత కడ్పుల మాడితే గా గంజి నీళ్ళు తాగుతడు. శేతుల పైసల్లేవు.గాని దోత్తుగాళ్ళు ఎవలు సందు బెట్టట్లేదట్టుంది." కాలు గాలిన పిల్లి లెక్క ఇంట్లెకి బయిటికి తిర్గుతుంటే సూశిన. గట్ల  కాక మీద ఉన్నప్పుడే సమ్మెట దెబ్బల పోటు బడాలి.గప్పుడే ఇనుముతో అనుకున్న వొత్తువు శెయ్యొచ్చు.గాన్ని మా యింటికి రమ్మని శెప్పు శెల్లే! నాల్గు మంచి మాటలు శెప్పి మారేతట్టు శేద్దాం.గట్లనే గా పొల్ల ఉసురు గొట్టుకోవొద్దని గట్టిగ శెప్దాం. "
 " గట్లనే అవ్వా! గీ మాటలు లేనప్పుడే ఎవలికి ఆళ్ళకి గాళ్ళ మన్సు, మనతత్తం తెల్శొత్తయి. శెప్పే మంచి మాటలు తల్కాయ కెక్కుతయి. గిప్పుడే గాన్ని తోల్కోని వత్తవ్వా! "
" గదండీ సంగతి! కూలినాలోల్లకయినా నాల్గు పైసలు సంపాయిచ్చేటోళ్ళకయినా శేతుల పైసలాడనప్పుడు ఇంట్లో ఇత్తులే కాదు ఏవైనా లేవనంగనే సర్రున కోపతాపాలు వొత్తుంటయి. గస్మంటప్పుడు మొగుడు పెళ్ళాలు మాటకి మాట అన్కోవుడో గిట్ల మాటలు బంజేసుకొనుడో జర్గుతుంటయి. గస్మంటి తితి ఎవ్వలూ తెచ్చుకోవద్దని,పొదుపుగ సంసారం ఎల్లదీస్కోమని శెప్పడానికే  "ఇంట్లో ఇత్తులు లేవు ఇద్దర్కి మాటలు లేవు" శాత్రాన్ని మన పెద్దోళ్ళు శెప్పి గాళ్ళని శాంత పరుత్తుంటరు.జెర యిశారిచ్చుకోమని శెప్తుంటరు.. "
కామెంట్‌లు