భారతీయ నాణేల కథనం: - ​- యామిజాల జగదీశ్
 

భారతదేశ నాణేలపై ఉన్న చుక్కల అర్థం ఏమిటో మీకు తెలుసా? భారతీయ నాణేల గురించి....
​భారతీయ రూపాయి నోట్లు నాసిక్ నగరంలో ముద్రితమవుతాయని మనకు తెలుసు. మరి భారతీయ నాణేలు ఎక్కడ తయారవుతాయో చూద్దాం....
​ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్ నగరాలలో తయారవుతాయి. ఏ నాణెం ఏ నగరంలో తయారైంది అనడానికి ఒక గుర్తు ఉంటుంది. నాణేల కింద తయారైన సంవత్సరం ముద్రితమై ఉంటుంది. దానిని మనమందరం చూస్తూ ఉంటాం.
​అలాగే ఒక గుర్తు కూడా ఉంటుంది. ఆ గుర్తును చూసి ఆ నాణెం ఏ ఊళ్ళో తయారైందో తెలుసుకోవచ్చు. అది నాణెంపై ఉన్న సంవత్సరానికి కింద, ఉంటుంది.
​ఒక చుక్క ఉంటే అది ఢిల్లీలో, డైమండ్ ఆకారం ఉంటే అది ముంబైలో, నక్షత్రం ఆకారం ఉంటే అది హైదరాబాద్‌లో, ఎలాంటి గుర్తు లేకపోతే అది కోల్‌కతాలో తయారైందని అర్థం.
​1950లో భారత ప్రభుత్వం కొత్త నాణేలను విడుదల చేసింది. ఒక రూపాయికి 16 అణాలు, 1957లో 100 పైసల విలువ గల ఒక రూపాయి నాణెం పరిచయం చేసింది.
​తర్వాత దశలవారీగా ఒక పైసా, రెండు, మూడు, ఐదు, పది, ఇరవై పైసల నాణేలు రద్దయ్యాయి. అంటే చలామణిలో నుంచి తీసేసారు. 1990లలో ఐదు రూపాయల, రెండు రూపాయల నాణేలు వచ్చాయి. 2006లో పది రూపాయల నాణెం పరిచయమైంది. ఆ తర్వాత ఇటీవలి కాలంలో ఇరవై రూపాయల నాణెం కూడా వాడకలోకి వచ్చింది.
​నాణేలపై మనం చూసే ప్రతి చుక్కకు ఒక అర్థం ఉంది. ముఖ్యంగా, మన భారతీయ నాణేలపై ఉన్న ఈ గుర్తులకి ప్రత్యేక అర్థాలు ఉన్నాయి.
​భారతీయ రూపాయి గురించిన కొన్ని విశేషాలు
​భారతీయ రూపాయి నోట్లు మనం అనుకున్నట్లుగా మొదట్లో కాగితంతో తయారవలేదు. పత్తి దారాలతో తయారయ్యాయి. 
​భారతదేశంలో మొట్టమొదట బెంగాల్ బ్యాంక్, హిందుస్థాన్ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులే రూపాయి నోట్లను ముద్రించి విడుదల చేశాయి. 18వ శతాబ్దంలోనే భారతదేశంలో రూపాయి నోట్లు వచ్చాయి.
​1934లో ఆర్బీఐ చట్టం వచ్చాక ప్రభుత్వమే రూపాయి నోట్లను ముద్రించాలనే నిబంధన వచ్చింది. ఆర్బీఐ మొట్టమొదటగా 1938 సంవత్సరంలో కింగ్ జార్జ్ బొమ్మ ఉన్న ఐదు రూపాయల నోటును విడుదల చేసింది.
కామెంట్‌లు