విఘ్నేశ!మమ్ములను ప్రీతితో దరిచేర్చు!
ఉద్ధండరాయుడా!ఉండ్రాళ్ళు పెట్టితిమి!
కష్టముల పోద్రోలి కామితంబుల దీర్చు!
పార్వతీతనయుడా!పాడితిమి నీ లీల
బాధలను తరిమేసి వరములను గుప్పించు!
గజవక్త్ర!నీ మ్రోల కైమోడ్చి మ్రొక్కితిమి!
వెనుక ముందుగ నడచి విఘ్నాలు తొలగించు!
ఆదిపూజ్యుడ నీకు హారతుల నిచ్చితిమి!
జనవాహినికి సుంత శాంతినే పొలయించు!
శంకర ప్రియనంద!శ్రద్ధగా కొల్చితిమి!
వసుధకే రక్షణగ పాలనము నందించు!
వర్షమున కొకమారు వ్రతమునే చేసెదము!
తిరిగి చూచుచు మాకు దిక్కువై చరియించు!
వెళ్ళిరా గణపయ్య!వేవేల దండాలు!
మరచిపోకుమ స్వామి!మాపై మమతపంచు!//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి