దానిమ్మ (బాల పంచపదులు): - వరలక్ష్మి యనమండ్ర


చెట్టుమీద కాయ ఉంది 
ఎర్రెర్రని దానిమ్మ  అది 
ఆకులలో నక్కి ఉన్నది 
తొంగి తొంగి చూస్తున్నద 
దానిమ్మ పండు అదేరా లక్ష్మీ 

చిన్న చిన్నవి ఆకులు 
పక్కనున్నాయి ముళ్ళు 
కాయలోని విత్తనాలు
ఎర్రరంగునున్న ముత్యాలు
ఆరోగ్యానికి మంత్రమది లక్ష్మీ 

కంటికింపుగా ఉంటుంది 
తీపి పులుపు ఉంటుంది 
గుత్తులుగా కాయునది 
రుచి భలేగ ఉంటుంది 
దానిమ్మ పండు అదేరా లక్ష్మీ 

పువ్వులెంతో సుందరము 
అందమైనది ఆకారము
దాని సోకెంతో వయ్యారము 
దానిమ్మ చూడ అద్భుతము 
భలేభలే పండురా దానిమ్మ లక్ష్మీ 

పంటి వరుసకు పోలిక 
ఆ దైవమిచ్చిన కానుక 
ఆరోగ్యానికి ఇది ఏలిక
తినాలందరము కనుక 
దానిమ్మ కాయలను ఇక లక్ష్మీ 

పొటాసియము ఉన్నదంట 
ఫైబరుతోటి మిత్రత్వమట 
రక్తవృద్ధినిది చేయునంట 
రక్తపోటు తగ్గింఛునంట 
దానిమ్మకాయ పోషక నిధి లక్ష్మీ 

హృదయానికి ఇచ్చు రక్షణ 
ఇది చేయు ఆరోగ్య సంరక్షణ
కాన్సరును చేయు నియంత్రణ 
అతి దాహానికి నివారణ 
దానిమ్మ రుచిలోన మేటి లక్ష్మీ

విటమిన్ సి సమృద్ధట
అల్జీమర్సు తగ్గించునట 
విటమిను కె నిండునట 
వినాయక చవితిలో పత్రట 
పలు రోగాలకు ఔషధము లక్ష్మీ

వాణిజ్యపు పంటగా పండును
రైతులకు లాభాలు చేకూర్చును
చూపరులను ఆకర్షించు చుండును
చిత్రదుర్గలో ఈ పంట పండును 
ఈ పండులో ఔషధులు మెండు.. లక్ష్మీ

కామెంట్‌లు