విజయపురి ఉన్నత పాఠశాలలో విమల, విజయ, శ్రుతి, తుషార, సహస్ర, మీనాక్షి, అలివేలు, శ్రావణి, వినత, శ్రావణి మంచి స్నేహితులు. అందరూ కలిసిమెలిసి చదువుకుంటారు, ఆడుకుంటారు. మధ్యాహ్న సమయంలో భోజన విరామంలో ఈ పదిమంది కలిసి తాము తెచ్చుకున్న కూరలు పంచుకుంటూ భోజనం చేస్తారు. వీళ్ళ స్నేహబంధం ఆ పాఠశాల ఉపాధ్యాయులకు ముచ్చట గొలిపేది.
మాలిని అనే అమ్మాయికి కడుపు మండుతుంది. శ్రావణి లేని సమయంలో మిగతా తొమ్మిదిమంది దగ్గరికి మాలిని వచ్చింది. "ఆ శ్రావణితో మీకు స్నేహమా? ఆ శ్రావణి చాలా పేద అమ్మాయి. పూర్ వెరీ పూర్. అన్నం తప్ప కూరలు ఏమీ తెచ్చుకోదు. మీరు తెచ్చుకున్న కూరలే తీసుకొని తింటుంది సిగ్గు లేకుండా. అలాంటి పూర్ అమ్మాయితో స్నేహం చేయడం వల్ల నీకు నష్టమే తప్ప లాభం లేదు. కాబట్టి ఆ శ్రావణితో స్నేహాన్ని వదిలిపెట్టండి." అని అన్నది మాలిని.
అప్పుడు శ్రుతి ఇలా అన్నది. "నీ పేరు మాలిని కాదు. మంథర. మేమందరం కలిసిమెలిసి ఉండడం చూసి కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు. నీకు అన్యోన్యంగా ఉండే స్నేహితుల మధ్య చిచ్చు పెట్టడం తప్ప మరే విద్య రాదు. నీకు చదువు అసలే రాదు. మంథర చదువులో వెరీ పూర్ వెరీ వెరీ వెరీ పూర్." అని. మిగతా అమ్మాయిలు పగలబడి నవ్వారు. మాలిని ముఖం మాడ్చుకుంది.
అప్పుడు తుషార ఇలా అన్నది. "శ్రావణి నిరుపేద విద్యార్థిని కావచ్చు. కానీ చదువులో చాలా బాగా చదువుతుంది. భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదించి ధనవంతురాలు అవుతుంది. నీకు చదువు అసలే రాదు. చదువు మధ్యలో ఆగిపోయి అప్పుడు నువ్వు పేద విద్యార్థినివి అవుతావు. పూర్ మాలిని. ఇలా అన్యోన్యంగా ఉండే స్నేహితుల మధ్య పెట్టడం ఆపేసి, చదువు మీద ధ్యాస పెడితే బాగుపడతావు.*అని. మాలిని ముఖం మాడ్చుకొని అక్కడ నుంచి వెళ్ళింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి