మంత్రదండం: - వరలక్ష్మి యనమండ్ర
 

అనగనగా ఒక పచ్చని పల్లెటూరు. ఆ ఊరిలో చింటూ వాళ్ళ ఇల్లు. ఇంటి వెనకాల పెద్ద మామిడి తోట. ఆ తోట చింటూ వాళ్ళ తాతగారిదే.
ప్రతిరోజూ సాయంత్రం అమ్మతో కలిసి చింటూ తోటలోకి వెళ్ళేవాడు. ఎండిన ఆకులు ఏరుకోవడానికి, చెట్లకు నీళ్ళు పోయడానికి. అమ్మ పూలు కోసుకుంటూ ఉంటే, చింటూ సీతాకోక చిలుకల వెంట పరిగెత్తేవాడు.
ఒకరోజు అమ్మ చీరలు ఉతుకుతోంది. "చింటూ, నేను వచ్చేవరకు ఈ అరుగు మీదే కూర్చుని బొమ్మలు గీస్తూ ఉండు నానా. తోటలోకి ఒంటరిగా వెళ్ళొద్దు సరేనా?" అని చెప్పి వెళ్ళింది.
చింటూ "సరే అమ్మా" అని బొమ్మలు గీస్తున్నాడు. ఇంతలో అరుగు పక్కనే ఉన్న పొదలోంచి "కిచ కిచ" అని శబ్దం. ఒక ముసలి ఉడుత బయటకు వచ్చింది.
"అబ్బాయ్, నాకు దాహంగా ఉంది. కొంచెం నీళ్ళు పోస్తావా?" అంది ఉడుత.
చింటూ ఆశ్చర్యపోయాడు. "ఉడుత మాట్లాడుతోందా!" అనుకున్నాడు. కానీ పాపం అని చెంబులో నీళ్ళు తెచ్చి పోశాడు.
ఉడుత నీళ్ళు తాగి, "నువ్వు మంచి పిల్లాడివి. ఇదిగో నీకు బహుమతి" అని తన తోకలో దాచుకున్న చిన్న మెరిసే కర్ర ఇచ్చింది.
"ఇది మంత్రదండం. ఇది నీ ఒక్కడి కోసం కోరుకుంటే పనిచేయదు. ఇతరుల మంచి కోసం, రోజుకు మూడు సార్లు మాత్రమే కోరుకోవాలి" అని చెప్పి గెంతుకుంటూ వెళ్ళిపోయింది.
చింటూకి సంబరం. కానీ అమ్మ చెప్పిన మాట గుర్తుంది. వెంటనే అమ్మ దగ్గరకు పరిగెత్తాడు. "అమ్మా, చూడు! ఉడుత ఇచ్చింది!" అని మంత్రదండం చూపించాడు.
అమ్మ నవ్వింది. "అలాగా! అయితే మంచి పనులకు వాడాలి సరేనా, ముందుగా హోంవర్క్ చెయ్యి" అన్నది.
చింటూ సరే అన్నాడు. ఆ సాయంత్రం నాన్న ఆఫీస్ నుండి వచ్చాక, అమ్మా నాన్నా ఇద్దరికీ మంత్రదండం చూపించాడు. నాన్న కూడా నవ్వి, "అయితే మన ఊరికి ఏం మంచి చేద్దాం?" అని అడిగాడు.
మొదటి కోరిక: చింటూ మంత్రదండం ఊపి, "మా బడి గోడ కూలిపోయింది. పిల్లలం ఆడుకుంటే కిందపడతాం. కొత్త గోడ రావాలి!" అన్నాడు.
తళుక్కుమని మెరిసింది. మర్నాడు సర్పంచ్ గారు కొత్త గోడ కట్టించారు. "ఎవరో దాత డబ్బు ఇచ్చారు" అన్నారు. చింటూ, అమ్మ, నాన్న ముగ్గురూ ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు.
రెండో కోరిక: "పక్కింటి పంతులుగారి పాపాయికి పాలు కొనడానికి డబ్బులు లేవు అమ్మా వాళ్ళు దగ్గర. పాపాయి కోసం పాలు రావాలి!" అన్నాడు.
మెరిసింది మంత్రదండం. 'ఆ సాయంత్రమే పంతులుగారికి ఒక ఆవును ఇచ్చారు ఎవరో దక్షిణగా, పాలు పితుక్కుని తాగండని'. 
మూడో కోరిక: "మన ఊరి చెరువు ఎండిపోయింది నాన్నా. కాకులు, పిచ్చుకలు , పశువులు నీళ్ళు లేక ఏడుస్తున్నాయి. చెరువులో నీళ్ళు రావాలి!"
మెరిసింది. ఆ రాత్రే పెద్ద వాన. చెరువు నిండిపోయింది.
ఊరంతా సంతోషం. 'ఇదంతా ఎలా జరుగుతోంది?' అని అందరూ అనుకున్నారు. చింటూ మాత్రం అమ్మానాన్నలకు చెప్పి, ముగ్గురూ కలిసి నవ్వుకునేవారు.
మూడు రోజుల తర్వాత మంత్రదండం మాయం అయిపోయింది. చింటూ ఏడవలేదు. ఎందుకంటే అమ్మ చెప్పింది: "మాయాజాలం కన్నా, మంచి మనసు గొప్పది నాన్నా. నువ్వు అందరి గురించి ఆలోచించావు చూడు అదే పెద్ద మంత్రం... ఇలాగే మంచి ఆలోచనలతో ఉండాలి నాన్నా" అన్నారు తల్లి తండ్రి.

కామెంట్‌లు