అదే అడ్డంకి: -- యామిజాల జగదీశ్
 

ఒక నూతన ఆశ్రమానిక ప్రవేశ ద్వారం కోసం ఓ మంచి పెయింటింగ్ తయారు చేసివ్వమని ఒక బౌద్ధ భిక్షుతో చెప్పారు. ఆయన మంచి చిత్రకారుడుకూడా.
సరేనని ఆ మేరకు ఆయన అనేక పెయింటింగ్ వేయడానికి సిద్ధపడ్డారు. ఆయన దగ్గర చాలా ప్రతిభావంతుడైన ఒక శిష్యుడు ఉండేవాడు. అతనంటే  ఆ గురువుకు చాలా ప్రియం. కనుక తను చిత్రిస్తున్నంతసేపూ పక్కనే ఉండమని శిష్యుడితో చెప్పారు.
గురువు చిత్రించేవాటిని ఆ శిష్యుడు గమనిస్తూ ఉండాలి. తను గీసింది నచ్చితే, 'బాగుందండీ' అని చెప్పాలి. అది నచ్చకపోతే, 'నిర్మొహమాటంగా బాగులేదని చెప్పడమే ఆ శిష్యుడు చెయ్యవలసిన పని.
"నేను పెయింటింగ్ చేసే వాటిలో నీకు ఏది బాగుందనిపిస్తే దానిని మాత్రమే ఆ ఆశ్రమ కమిటీకీ పంపుతాను. నీకు నచ్చే వరకు చిత్రిస్తాను. అవి ఎన్నయినా కానివ్వు... నేనేమీ విసుక్కోను..." అని అన్నారు గురువు. అలాగే అన్నాడు శిష్యుడు.
అప్పటికి మూడు నెలలు గడిచిపోయాయి. శిష్యుడు తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. 
గురువుగారికి భయం వేయడం మొదలైంది,...కానీ ఆయన తన మాట నిలబెట్టుకోవాలి...గురువు గీసే చిత్రాలలో ఏదో ఒక లోటు చెప్తూ వచ్చాడు శిష్యుడు. గురువు ఏ మాత్రం నొచ్చుకోకుండా మళ్ళీ వర్ణాలు మారుస్తున్నారు. కాలం గడిచిపోతోంది.
ఒకరోజు కలం, సిరా, వర్ణాలు చివరికొచ్చేశాయి. 
గురువు, "ఇదిగో నువ్వెళ్లి కొన్ని కలాలు, సిరా తీసుకురా," అన్నారు శిష్యుడితో.
సరేనని శిష్యుడు వెళ్ళాడు.
మరోవైపు, గురువు, శిష్యుణ్ణి,
అతని ఉనికిని కూడా మరచిపోయి పరధ్యాన్నంలో ఉన్నారు. కలమూ సిరా తీసుకురావడానికి శిష్యుడు వెళ్ళినా అతను ఎదుటే ఉన్నాడనే ధ్యాసలో ఉన్నారు.
'శిష్యుడు ఇక్కడే ఉన్నాడు, చూస్తు న్నాడు' అనే ఆలోచన గురువుగారి మనసులో ఇంకా మెదులుతూనే ఉంది....
అతనికి ఇది నచ్చుతుందో లేదో, దీన్ని కూడా తిరస్కరిస్తాడేమో అని ఆయన ఆలోచిస్తూనే ఉన్నారు. ఆయన పెయింటింగ్ కొనసాగిస్తూనే ఉన్నారు...
మనసులో పరిపరి విధాల ఆలోచనలు. మనసులో ఒక రకమైన ఉద్రిక్తత ఏర్పడింది....
అందువల్ల గురువు మామూలుగా ఉండలేకపోయారు....
శిష్యుడు బయటకు వెళ్ళాడు....శిష్యుడు ఎదుట లేడుగా అనే ఆలోచన రావడంతోనే ఆయన తాననుకున్న చిత్రాన్ని పూర్తి చేశారు.
శిష్యుడు తిరిగొచ్చి ఇలా అన్నాడు,
"చాలా బాగుందండీ. కానీ మీరు దీన్ని ఇంతకు ముందే ఎందుకు గీయలేదు?" అని అన్నాడు శిష్యుడు.
గురువుగారూ, "అది ఎందుకో నాకు ఇప్పుడే అర్థమైంది....
అదంతా నీ వల్లే....నీ వల్లే, నువ్వేం చెప్తావోననే భయం నాలో గూడు కట్టుకుంది...నువ్వెక్కడ బాగులేదంటావోనని లోలోపల తెలియని భయం... నీతో చెప్పలేని భయం... ఆ భయమే నాలో ఒత్తిడి పెంచింది....నిన్ను పక్కనే ఉండమన్నాను కానీ అలా ఎందుకు చెప్పానో తెలీలేదు... నువ్వు నన్నే చూస్తున్నావనే ఓ రకమైన జంకు... నన్ను నన్నుగా ఉండనివ్వలేదు... నాలోని కళను మరచిపోయాను... నా ఆలోచననంతా నువ్వాక్రమించావు... నేను సహజంగా ఉండలేకపోయాను... ఎంతగా ఉండలనుకున్నా ఏకాగ్రత కుదరలేదు... ఏదో తెలియని భయం... సహజంగా ఉండటం కోసం చేసిన
ఆ ప్రయత్నమే నన్ను నడిపించ లేకపోయింది...కానీ ఎప్పుడైతే బయటకు వెళ్ళావో వర్ణాలన్నీ ఆలోచనలన్నీ కలిసొచ్చాయి.... పెయింటింగ్ పూర్తి చేశాను" అని అన్నారు గురువుగారు.
ఈ కథను చెప్తూ, మీరు ధ్యానం చేసినప్పుడల్లా, మీరు చేసే ప్రయత్నమే, అందులో విజయం సాధించాలనే మీ ఆలోచనే, ఒక అడ్డంకి....దీని గురించి తెలుసుకోండి....
దీన్ని చేస్తూనే ఉండండి....ఒక రోజు వస్తుంది.... మీరు ఓపికతో ఉంటే, 
ఒక రోజు వస్తుంది....మీకంటూ ఓ రోజొస్తుంది...అప్పుడు అప్రయత్నం గానే ధ్యానం సిద్ధిస్తుంది... ఆ రోజు తప్పక వస్తుంది....అప్పుడు నిజానికి మీరు అక్కడ ఉండరు...కేవలం ధ్యానం మాత్రమే ఉంటుందంటారు ఓషో!
కామెంట్‌లు