నారాయణపేట జిల్లా మద్దూరులో ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పరిశీలించారు.జిల్లా పర్యటనలో భాగంగా మద్దూరుకు చేరుకున్న సీఎం.. పాఠశాల నిర్మాణ ప్రణాళికలను పరిశీలించి, నిర్మాణ ప్రాంగణంలో కలియతిరిగారు. పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రజల అవసరాల కోసం సుమారు పదేళ్ల క్రితం కొంతమంది భూమి యజమానులు సొంత డబ్బుతో భూమిని కొనుగోలు చేసి, అనంతరం ప్రభుత్వానికి అప్పగించినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అదే స్థలంలో ప్రస్తుతం సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం జరుగుతోంది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్థానికులతో కలిసి వారి విజ్ఞాపనలను స్వీకరించారు. గతంలో పాఠశాల కోసం భూములు ఇచ్చిన రైతులను ప్రత్యేకంగా గుర్తించి వారితో మాట్లాడారు.భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పాఠశాల నిర్మాణ పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి