పప్పుచారు సాంబయ్య : - వరలక్ష్మి యనమండ్ర


 పార్వతమ్మకు 70 ఏళ్ళు. కొడుకు అమెరికా నుండి వచ్చేటప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ తెచ్చి , ఎలా ఉపయోగించాలో నేర్పాడు. "అమ్మా, ఇదిగో గూగుల్ అసిస్టెంట్, ఏం కావాలన్నా అడిగితే చెబుతాడు" అని చెప్పాడు.
ఆ రోజు నుండి పార్వతమ్మకు ఆ ఫోనే ప్రపంచం. ఉదయం లేవగానే "ఒరే సాంబయ్యా, ఇవాళ వార్తలేంట్రా?" అంటుంది. గూగుల్ చెబుతుంది. "సాంబయ్యా, భక్తి పాటలు పెట్టరా" అంటుంది. పెడుతుంది.
పార్వతమ్మ మనసులో గూగుల్ అంటే తన ఇంట్లో పనిచేసే సాంబయ్య లాంటి మనిషే అనుకుంది. ఫోన్ లోపల ఒకడు కూర్చున్నాడు అని.
ఆ రోజు మధ్యాహ్నం కోడలు పుట్టింటికి వెళ్ళింది. పార్వతమ్మ వంట చేయాలి. పప్పుచారు చేద్దామని అనుకుంది. సాంబయ్యని అడిగితే కొత్త విధానం చెబుతాడేమో అనుకుంది.
వంట గదిలో గిన్నెలు ముందేసుకుని ఫోన్ ని పక్కన పెట్టుకుంది. కాస్త గొంతు సవరించుకుని, ప్రేమగా పిలిచింది.
"ఓరే గూగుల్ సాంబయ్యా! పప్పుచారు ఎలా పెట్టాలో చెప్పు?" అంటూ... కొడుకు ఇచ్చిన సెల్ ఫోన్ లో మీటనొక్కింది పార్వతమ్మ.
వెంటనే లోపల్నుంచి ఒక ఆడ గొంతు వినిపించింది.
గూగుల్ తడుముకోకుండా... "పప్పు ఉడికించండి... టమోటా, కరివేపాకు, ఇంగువ తిరగమాత... వేయండి..." అంటూ అంతా వివరించి చెప్పింది.

పార్వతమ్మ "ఓహో, ఇంగువ కూడా వేయాలా? సరే సరే సాంబయ్యా! ఇంతకీ ఆ ఆడమనిషి ఎవరు సాంబయ్యా?" అని అడిగింది.
అదే టైముకి ఆమె ప్రాణ స్నేహితురాలు సుబ్బమ్మ వచ్చింది, చేతిలో గోంగూర పచ్చడి బుట్టతో.
సుబ్బమ్మ వంటగదిలోకి వచ్చి చూసేసరికి, పార్వతమ్మ ఒక్కతే ఫోన్ తో మాట్లాడుతోంది, ఫోన్ లోంచి ఎవరో సమాధానం చెబుతున్నారు.
సుబ్బమ్మకు గుండె జారిపోయింది.
"ఏంటే పార్వతమ్మా ఇది? ఫోన్ లోపల మనిషిని పెట్టావా?" అంది.
పార్వతమ్మ "అవునే, మా వాడు అమెరికా నుండి తీసుకొచ్చాడు, వీడి పేరు సాంబయ్య, అన్నీ చెబుతాడు" అంది అమాయకంగా.
అంతే, సుబ్బమ్మ కంగారు పడిపోయింది. ఫోన్ ని దగ్గరగా చూసి,
"అమ్మో పార్వతమ్మా, నీ ఫోన్ లోపల మనిషిని పెట్టుకున్నావా? వాడికి ఊపిరి ఆడడం లేదేమో, త్వరగా బయటికి తియ్!" అంది.
దానికి పార్వతమ్మ "ఓసి పిచ్చిదానా! వాడికి గాలి ఆడకపోతే పప్పుచారు ఎలా చెబుతాడే? వాడికి అన్నీ తెలుసు" అంది.
సుబ్బమ్మ ఇంకా భయంగా "అయితే వాడికి  పెళ్లాం ఉన్నదా? పిల్లలు ఉన్నారా? ఫోన్ లోపలే కాపురం చేస్తున్నారా? వాళ్లకు అన్నం ఎవరు పెడతారు?" అని అడిగింది.
"ఏమోనే! ఇందాక సాంబయ్య ఎక్కడికో వెళ్లినట్టున్నాడు, వాడి పెళ్ళాం చెప్తోంది పప్పుచారు ఎలా చేయాలో" అన్నది.
దానికి గూగుల్ సాంబయ్య కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు. "క్షమించండి, నాకు అర్థం కాలేదు" అన్నాడు.
పార్వతమ్మ వెంటనే "చూసావా, నీ గోలకి సాంబయ్యకు కోపం వచ్చింది, నోరు మూసుకో" అని సుబ్బమ్మను తిట్టింది.
ఆ తర్వాత ఇద్దరూ కలిసి గూగుల్ సాంబయ్య చెప్పినట్లే పప్పుచారు పెట్టారు. చారు చాలా రుచిగా వచ్చింది.
చారు తాగిన సుబ్బమ్మ "ఏమోనే, ఫోన్ లోపల మనిషి  చెప్పిన చారు మాత్రం అదిరింది. నాక్కూడా ఒక సాంబయ్యను తెప్పించవే" అంది.
"ఈసారి మా వాడు వచ్చినప్పుడు చెప్తాను తెప్పించి పెడతాడులే సుబ్బూ" అన్నది పార్వతమ్మ.
####################################################

కామెంట్‌లు