సీత కథ: - యామిజాల జగదీశ్
 

సీతాదేవి, రామచిలుకల జంట కథ వాల్మీకి రామాయణం ఉత్తరకాండలో, పద్మ పురాణంలో కనిపిస్తుంది. ఇది ఎంతో భావోద్వేగమైన కథ. తెలియక చేసిన పొరపాటుకు కూడా ప్రతిఫలం అనుభవించక తప్పదని ఈ కథ చెబుతుంది. ఈ సంఘటన వల్లే సీతాదేవి తన జీవితంలో శ్రీరాముడికి దూరం కావాల్సి వచ్చింది.
సీతాదేవి చిన్నపిల్లగా ఉన్నప్పటి మాట ఇది. ఆమె జనక మహారాజు కోటలోని తోటలో స్నేహితురాళ్లతో ఆడుకుంటోం ది. అదే తోటలో ఒక చెట్టు మీద రామచిలుకల జంట నివసిస్తోంది. అవి సాధారణ పక్షులు కావు. పూర్వ జన్మ పుణ్యం వల్ల మనుషుల భాష అర్థమయ్యేది. వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గర ఉండి అవి రామాయణ కథను పూర్తిగా విన్నాయి.
ఆ పక్షులు తమలో తాము ఇలా మాట్లాడుకుంటున్నాయి, "ఈ భూమి మీద రాముడు అనే గొప్ప రాజు పుడతాడు. ఆయనకు జనక మహారాజు కూతురు సీతతో పెళ్లి జరుగుతుంది. పెళ్లి తర్వాత వాళ్లిద్దరూ చాలాకాలం సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్లాల్సి వస్తుంది, అక్కడ సీతాపహరణం జరుగు తుంది."
తోటలో ఆడుకుంటున్న చిన్నారి సీత, తన పేరు, తన భవిష్యత్తు గురించి ఆ పక్షులు మాట్లాడుకోవడం విని ఆశ్చర్యపోయింది. వెంటనే తన స్నేహితురాళ్ల సాయంతో ఆ రెండు పక్షులను పట్టుకుంది.
సీతాదేవి ఎంతో ప్రేమగా వాటిని ఇలా అడిగింది, "మీరు ఎవరు? నాకు, శ్రీరాముడికి సంబంధించిన ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలుసు?"
అప్పుడు మగ చిలుక ఇలా బదులిచ్చింది, "ఓ రాకుమారీ! మేము వాల్మీకి మహర్షి ఆశ్రమం నుంచి వచ్చాము. ఆయన 'రామాయణం' అనే గొప్ప కావ్యాన్ని రాశారు. అందులో మీ, శ్రీరాముని జీవిత కథ మొత్తం ఉంది. మేము అక్కడే ఆ కథను విన్నాం."
ఆ పక్షులు చెప్పే మాటలు వినడం సీతాదేవికి చాలా ఆనందాన్నిచ్చింది. చీకటి పడే సమయానికి మగ చిలుక సీతాదేవిని ఇలా వేడుకుంది, "అమ్మా! నా భార్య గర్భంతో ఉంది. దయచేసి మమ్మల్ని వదిలేయండి. మేము మా గూటికి వెళ్లిపోతాము."
కానీ చిన్నపిల్లల సహజమైన పంతంతో సీతాదేవి మగ చిలుకను మాత్రమే వదిలేసింది. ఆ ఆడ చిలుక నుంచి ఇంకా కథలు వినాలనే కోరికతో దాన్ని పంజరంలోనే ఉంచేసింది.
మగ చిలుక సీతాదేవిని ఎంతగానో బతిమిలాడింది. తన భార్య తనను విడిచి ఉండలేదని ప్రాధేయపడింది. ఆడ చిలుక కూడా ఏడుస్తూ, "నా భర్త నేను బతకలేను, దయచేసి నన్ను వదిలేయండి" అని కన్నీరుమున్నీరుగా వేడుకుంది. అయినా సీతాదేవి దాన్ని వదల్లేదు.
భర్తకు దూరమయ్యాననే బాధతో, ఆవేదనతో ఆ ఆడ చిలుక గిలగిలా కొట్టుకుని ప్రాణాలు విడిచింది. చనిపోయే ముందు తీవ్రమైన దుఃఖంతో సీతాదేవికి ఇలా శాపం పెట్టింది, "నేను గర్భవతిగా ఉన్న సమయంలో నన్ను నా భర్తకు దూరం చేశావు. సరిగ్గా ఇలాగే నువ్వు కూడా గర్భవతిగా ఉన్నప్పుడు నీ భర్తకు దూరం అవుతావు."
తన భార్య మరణాన్ని తట్టుకోలేక మగ చిలుక కూడా గంగా నదిలో దూకి ప్రాణాలు వదిలేసింది. కానీ చనిపోయే ముందు, "వచ్చే జన్మలో నీ నగరంలో (అయోధ్యలో) పుట్టి, నీ భర్త దూరం కావడానికి నేనే కారణం అవుతాను" అని ప్రతిజ్ఞ చేసింది.
పురాణాల ప్రకారం, ఆ మగ చిలుకే మరుసటి జన్మలో అయోధ్యలో చాకలివాడిగా పుట్టింది. ఆ చాకలివాడే సీతాదేవి శీలాన్ని శంకించి మాట్లాడాడు. అతడి మాటల కారణంగానే, లోకాపవాదుకు భయపడి శ్రీరాముడు సీతాదేవిని అడవులకు పంపాల్సి వచ్చింది.
లక్ష్మణుడు సీతాదేవిని అడవిలో విడిచిపెట్టే సమయానికి ఆమె గర్భవతి (లవకుశులు ఆమె కడుపులో ఉన్నారు). ఇలా చిన్నతనంలో తెలియక చేసిన తప్పు కారణంగా సీతాదేవి తన జీవితంలో ఆ ఆడ చిలుక శాపాన్ని అనుభవించాల్సి వచ్చింది.


కామెంట్‌లు