అద్దం ( భిన్న సంఘటనలను ప్రతిబింబిస్తూ ): - పాలగుమ్మి జ్యోతి.
 

వర్ష అద్దం ముందు కూర్చుని తయారవుతూ అనుకుంటోంది 'ఈ సంవత్సరం పోటీ చాలా గట్టిగా ఉంది. "మిస్ ఇండియా" కావాలనే నా కలను నిజం చేసుకోవడానికి సంవత్సరం అంతా కష్టపడుతూనే ఉన్నాను, ఎలాగైనా ఈ పోటీలో గెలిచి తీరాలి' వర్షను పిలవడానికి గదిలోకి వచ్చిన నిర్వాహకుడు"వర్షా! ఏమిటి ఆలోచిస్తున్నావ్?త్వరగా తయారవు" అనడంతో ఉలిక్కిపడి ఆలోచన నుంచి బయటకు వచ్చి తన కలలను సాకారం చేసుకోవడానికి స్థిరంగా అడుగులు వేస్తూ వేదిక వైపు కదిలింది వర్ష.
            ********** 
            
              "జానకమ్మ గారు! ఈ కాగితం మీద సంతకం పెట్టండి. మీ వారికి అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాలి. ఆలస్యమైతే బ్రతికే అవకాశం ఉండదు" సిస్టర్ చూపించిన కాగితం పైన సంతకం పెడుతుంటే  చేతులు వణికాయి జానకమ్మకు. భర్తను ఉంచిన ఐసీయూ గదికి ఉన్న అద్దంలోంచి లోపలికి చూస్తే నిస్తేజంగా మంచం మీద ఉన్నాడు. "భగవంతుడా! నా ఐదోతనానికి ఏమీ కానీకు! నా భర్తను సురక్షితంగా నాకు దక్కించు' నోట్లో చెంగు కుక్కుకొని ఏడుస్తూ అక్కడే ఉన్న వినాయకుడి విగ్రహం వైపు పరుగు తీసింది జానకమ్మ.
           ********
                ఎఱ్ఱని ఎండలో కూర్చున్న రత్తాలు "మామ కి జొరం ఇంకా తగ్గలేదు. కాత్త గంజి తాగి తొంగున్నాడు.ఆడి దగ్గరే కూకొని సూసుకుందాం అనుకుంటే నోటి కాడికి  కూడు ఎట్టా వత్తది? ఇయ్యాల అద్దాలన్నీ అమ్ముడైపోవాల! ఆ డబ్బులు వత్తే ఒక రెండు దినాలు మామ కాడే ఉండి జొరం తగ్గేదాకా సూసుకోవచ్చు' అనుకుంటూ వచ్చే పోయే వాళ్ళను తన అద్దాలు కొంటారేమో అని ఆశగా చూస్తోంది రత్తాలు. "అద్దాలు బాబూ! అద్దాలు కొనండమ్మా!" రత్తాలుకి అరచి అరచి నోరెండుకు పోతోంది. రత్తాలు కోరిక నెరవేరుతుందో లేదో ఆ భగవంతుడికే తెలియాలి. 
              ********
కామెంట్‌లు