అగ్రహారపు వీథిలో నాలుగిళ్ళ లోగిలిలో
విశాలమైన నడవలో వాలుకూర్చిలో
మీసాల రాయుడు తాత అరవై ఏళ్ళ క్రిందట కూర్చుని
స్వాతంత్ర్య పోరాటంలో మహనీయుల త్యాగాలు
బ్రిటీష్ పాలకుల కుటిల నీతులు చెప్పడం
ఏవిధంగా దేశ ప్రజలంతా తిలక్ గారి
" స్వరాజ్యమే నా జన్మహక్కు" అనే నినాదంతో
ప్రేరణ చెందడం చెప్పడం గుర్తు
మమ్మలందరిని కూర్చోబెట్టుకు వేమన సుమతీ శతకాలు చెప్పడం
మానవత్వమే మాధవత్వమని
ఆర్తితో వచ్చిన వారిని ఆదరించమనడం
ప్రజలకు మంచి చెడు అక్షరాస్యత గురించి చెప్పడం జ్ఞాపకమే.
తాతయ్య తరువాత నాన్న అధ్యాపకునిగా
ఎందరో శిష్యులకు ఆ కుర్చీ లోనే కూర్చుని పాఠాలు చెప్పడం
వారు ఉన్నతులుగా మారి
నాన్నగారి దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం
శ్రీరాముని దరిచేరినపుడు ఊరంతా
మంచి గురువును కోల్పోయారని బాధ పడటం మరువలేనిది.
నేను డెబ్బది సంవత్సరాల వయస్సులో
అమెరికా నుంచి అగ్రహారం వచ్చినపుడు
ఆ ఖాళీ వాలు కుర్చీని చూసి
అరవై ఏళ్ళ చెల్లితో ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాలను
గుర్తు చేస్తున్న కుర్చీ మన పాలిట దైవసింహాసనం అన్నాను..!!
..............................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి