ధనవంతుడు - రిక్షావాడు: - - యామిజాల జగదీశ్
 

ఒకసారి ఒక ధనవంతుడు కారులో వెళ్తుంటే మధ్యలో కారు ఆగిపోతుంది. యాంత్రికలోపంతో ముందుకు కదలదు. అతనేమో అత్యవసరంగా ఒక చోటికి వెళ్ళాలి. అటూ ఇటూ చూస్తే దూరంగా ఒక చెట్టు కింద అతనికి ఒక రిక్షా కనిపిస్తుంది. ఆ రిక్షావాడి దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి, ఆ రిక్షావాడు తన కాళ్ళను హ్యాండిల్ మీద పెట్టి, వీపును తన సీటుకు ఆనించి, తల ప్రయాణికులు కూర్చునే సీటుపై పెట్టి హాయిగా పడుకుని ఉంటాడు.
అంతేకాదు, అలా హాయిగా పడుకుని ఒక పాట పాడుకుంటూ ఉంటాడు. ఆ రిక్షావాడిని అలా చూసి ఆ ధనవంతుడికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంత సంతోషంగా ఒక మనిషి ఎలా ఉండగలడు, ఇంత సంతోషంగా ఎలా పాటలు పాడుకోగలడు అని అనుకుంటాడు.
తనను తీసుకువెళ్ళమని రిక్షా అతనిని అడుగుతాడు ధనవంతుడు.  వెంటనే ఆ రిక్షావాడు లేచి, 20 రూపాయలు ఇమ్మని అడుగుతాడు. దారిలో ఆ రిక్షావాడు మళ్ళీ అదే పాటను పాడుకుంటూ ఎంతో ఉల్లాసంగా రిక్షా తొక్కుతాడు. ఆ ధనవంతుడికి మళ్ళీ ఆశ్చర్యం వేస్తుంది, కేవలం 20 రూపాయలకే ఒక మనిషి ఇంత సంతోషంగా ఎలా ఉండగలడు అని. అతనికి కొంచెం అసూయ కూడా కలుగుతుంది. ఆ రిక్షావాడి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలని, రాత్రి భోజనానికి తన బంగ్లాకు రమ్మని పిలుస్తాడు. ఆ పిలుపుకు రిక్షావాడు సంతోషంగా ఒప్పుకుంటాడు.
బంగ్లాలో రిక్షావాడికి విలాసాలు
ఆ రిక్షావాడికి అత్యుత్తమమైన భోజనం వడ్డించాలని ధనవంతుడు తన పనివాళ్ళందరికీ ముందే చెప్తాడు. రకరకాల వంటకాలు సిద్ధం చేస్తారు. సూప్స్, ఐస్ క్రీమ్, గులాబ్ జామ్, రకరకాల కూరలు... ఇలా ప్రతి ఒక్కటి అక్కడ వడ్డిస్తారు.
రిక్షావాడు తినడం మొదలుపెడతాడు, అతనిలో ఎలాంటి బెదురు, కంగారు కనిపించవు. తన పాటికి తను ఆ పాటను పాడుకుంటూ హాయిగా భోజనం చేసాడు. అతన్ని చూస్తే, అలాంటి భోజనం తినడం అతనికి మొదటిసారి కాదు, ఇంతకు ముందు కూడా చాలాసార్లు తిన్నాడు అన్నంత సహజంగా ఉంటాడు. ఆ ధనవంతుడికి మళ్ళీ ఆశ్చర్యం, అసూయ కలుగుతాయి. ఒక సామాన్యుడు ఇన్ని రకాల వంటకాలను చూసి కూడా ఎలాంటి ఆశ్చర్యం ఎందుకు వ్యక్తం చేయలేదు, రిక్షాలో ఉన్నప్పుడు ఎలా పాడుకున్నాడో ఇక్కడ కూడా అలాగే ఎలా పాడుకుంటున్నాడు అని మనసులో అనుకుంటాడు.
ఇదంతా చూసి ఆ ధనవంతుడికి అసూయ ఇంకా పెరుగుతుంది. ఆ రిక్షావాడిని కొన్ని రోజులు తన బంగ్లాలోనే ఉండిపోమని చెప్తాడు. దానికి కూడా రిక్షావాడు సరేనంటాడు.
అతనికి అక్కడ ఎంతో గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఒకరు బూట్లు తొడుగుతారు, మరొకరు కోటు వేస్తారు. ఒక బెల్ కొట్టగానే ముగ్గురు పనివాళ్ళు ప్రత్యక్షమవుతారు. పెద్ద టీవీ స్క్రీన్ పై కార్యక్రమాలు చూపిస్తారు. ఏసీ గదిలో పడుకోమని చెప్తారు.
ఇదంతా చూసినా ఆ రిక్షావాడి నుంచి ఎలాంటి ప్రతిస్పందనా ఉండదు. అది ఆ ధనవంతుడు గమనించాడు. అతను మామూలుగానే ప్రవర్తిస్తుంటాడు. రిక్షాలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉంటాడు. ఆ పాటనే పాడుకుంటూ ఉంటాడు.
ధనవంతుడి పరీక్ష
ధనవంతుడికి అసూయ ఇంకా పెరిగిపోయి, ఇది మరీ విడ్డూరంగా ఉందని అనుకుంటాడు. ఈ రిక్షావాడికి ఏ ఆశ్చర్యమూ లేదు, వీడికి ఎలాంటి తేడా అనిపించట్లేదు. ఎప్పటిలాగే సంతోషంగా ఉన్నాడు అని లోలోపల రగిలిపోతాడు.
అప్పుడు ఆ ధనవంతుడు అడుగుతాడు: "నువ్వు సంతోషంగా ఉన్నావు కదా?" 
 రిక్షావాడు: "అవును బాబు, చాలా సంతోషంగా ఉన్నాను."
ధనవంతుడు మళ్ళీ అడుగుతాడు: "నీకు హాయిగానే ఉంది కదా?"
దానికి రిక్షావాడు: "అవును, చాలా హాయిగా ఉంది."
అప్పుడు ఆ ధనవంతుడు ఒక నిర్ణయానికి వస్తాడు, వీడిని మళ్ళీ ఆ రిక్షా దగ్గరే వదిలేయాలని. అప్పుడే వీడికి ఇక్కడున్న విలాసాల విలువ తెలుస్తుంది, అక్కడికి వెళ్ళాక ఇవన్నీ గుర్తుచేసుకుని బాధపడతాడు.
ఆ ధనవంతుడు తన సెక్రటరీని పిలిచి, "నువ్వు కేవలం పైకి మాత్రమే సంతోషంగా, హాయిగా ఉన్నానని చెబుతున్నావు. కానీ నువ్వు సంతోషంగా లేవని మా సార్ కి అర్థమైపోయింది. అందుకే నిన్ను మళ్ళీ నీ రిక్షా దగ్గర వదిలేస్తాం, అని వాడికి చెప్పు" అని ఆదేశిస్తాడు.
సెక్రటరీ ఆ మాట చెప్పగానే, రిక్షావాడు: "సరే సార్, మీ ఇష్టం వచ్చినప్పుడు, మీరు ఎలా చెబితే అలా" అంటాడు.
తిరిగి పాత జీవితంలోకి...
అతన్ని తీసుకెళ్లి మళ్ళీ తన రిక్షా ఉన్న చోటే వదిలేస్తారు. అప్పుడు ఆ ధనవంతుడు కారు అద్దాలు పైకి ఎత్తి లోపలి నుండి అతన్నే గమనిస్తాడు.
రిక్షావాడు తన సీటు తీసి, సంచిలోంచి ఒక నల్లటి మాసిన గుడ్డ బయటకు తీసి, రిక్షాను తుడుచుకుని, హాయిగా నిలబడి మళ్ళీ అదే పాటను పాడుకుంటాడు.
ధనవంతుడు తన సెక్రటరీతో అంటాడు: "అసలు ఏంటిది? వీడికి ఎలాంటి దిగులూ లేదేమిటీ... అంత విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి మళ్ళీ ఈ కష్టాల జీవితంలోకి వచ్చినా అంతే సంతోషంగా ఉన్నాడు, అదే పాట పాడుకుంటున్నాడు!"
అప్పుడు సెక్రటరీ ఆ ధనవంతుడితో ఇలా అంటాడు: "సార్, ఇదే ఒక నిజమైన విజేత లక్షణం. గెలిచిన వాడు ఎప్పుడూ వర్తమానంలో జీవిస్తాడు, దాన్ని ఆస్వాదిస్తాడు. రేపు ఏదో గొప్ప జీవితం వస్తుందన్న ఆశతో తన ఈ రోజును పాడుచేసుకోడు. అంతకన్నా మంచి జీవితం దొరికితే దాన్ని ఆహ్వానిస్తాడు, ఎంజాయ్ చేస్తాడు, ఆ క్షణాన్ని ఆనందంగా గడుపుతాడు. ఒకవేళ జీవితంలో మళ్ళీ కష్టాలు ఎదురైనా, ఆ రోజు కూడా వెతుక్కుంటూ, అంతే ఆనందంగా అనుభవిస్తాడు, దానిలో కూడా సంతోషిస్తాడు."
జీవిత సత్యం...
జీవితంలో ఉన్న కఠోర సత్యం ఇదే. నిజమైన విజయం మన సంతోషంలోనే దాగి ఉంది.
మంచి రోజుల కోసం ఎదురుచూస్తూ ప్రస్తుతాన్ని పాడుచేసుకోకూడదు.
అలాగే కష్టకాలంలో పాత మంచి రోజులను తలుచుకుంటూ ఈ క్షణాన్ని నాశనం చేసుకోకూడదు.
ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఏది దొరికిందో, అదే మనకు చాలు అని తృప్తి పడాలి.
కామెంట్‌లు