సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 

 సామెత-348: ఇల్లాలు లేని ఇల్లు దెయ్యాలకు నిలయం
****
"ఏమో అవ్వా! పగోడికి సుత గిస్మంటి కట్టం రావొద్దు.గా తమ్మిని సూత్తుంటే మన్సు కలికలి అయితుంది. ఎట్ల బతుకు ఎల్లతీత్తడో ఎట్లనో ఏమో? బండి పయ్యెలు రొండుంటెనే నడుత్తది.గది సైకిలైనా,ఎడ్ల బండైనా, టుక్ టుక్ మోటరు అయినా?"
"ఏంది శెల్లె? ఎవలి ముచ్చెటి?గా నారయ్య యిష్యమేనా?"
"అవునవ్వా! నారయ్య యిష్యమే. పాపం ఒంటరి పోరాటం శేత్తుండు.ఇద్దరు పొల్లగాండ్లతోటి కింద మీద అయితుండు. గాళ్ళని వాళ్ళ అమ్మమ్మోళ్ళింటికి పంపురా అయ్యా అంటే.. నేనే సూస్కుంటత్త అంటడు."
"అవును శెల్లే! నారయ్య, నర్సమ్మ ఎంత ముద్దుగా శిలకా గోరింకల లెక్క ఉండేటోళ్ళు.గాళ్ళిద్దరు ఎన్నడూ ఒకల మీద ఒకలు షికాయితులు శెప్పుకొనుడు,పంచాతి పెట్టుకొనుడు ఎవ్వలూ సూడలే."
"అవునవ్వా! గా మాయదారి జొరం గిట్లొచ్చి గట్ల గద్ద దన్నుక పొయినట్టు తీస్కపోయింది.ఎన్నడన్న తుమ్మి ఎరగదు దగ్గి ఎరగదు.కళగల్ల మొకం. ఎప్పుడు సూశినా నవ్వుతనే ఉండేది ఇంట్లె జింక పిల్ల లెక్క ఉరుక్కుంట పన్జేశేది. ఎంతొద్ధన్నా  సద్ది బట్కొని పొలం కాడికి పొయ్యి మొగుడికి సొయంగ బెట్టి తినేదన్క ఉండొచ్చేది.సుట్టుపక్కనోళ్ళు గజ్జూసి పరాష్కమాడేటోళ్ళు.
"గాళ్ళని సూత్తుంటే మొగుడూ పెళ్ళాలు అంటే గట్లుండాలె అనిపిత్తది ఎవలికైనా. గా యమునికి కన్నుగుట్టిందో ఏమో ముప్పైఏళ్ళు దాటకుండనే  జొరం పాశమేశి పానాలు తీస్కబోయిండు. గిప్పుడు గా యిల్లు సూత్తుంటే ఎట్లనో ఉంది అవ్వా!"
"అద్దమస్మంటి గా యిల్లు గిప్పుడు మకిల బట్టి సూడ వొశం గాట్లే. ఎటు సూశినా  బూజులు ఏలాడుడు,ఏడేశిన వొత్తువులు ఆడనే పొర్లాడుడు. మడుసులున్న యిల్లు లెక్క లేనే లేదు. ఒకప్పటి ఇంటికి గిప్పటి యింటికి సస్రం తేడా కొట్టొచ్చినట్టు అగుపిత్తున్నది. మునుపు ఇంటి ముందు ముగ్గుల్తో అందంగా మెర్శిపోయేది.గిప్పుడు ముంగలంత పొక్కిలి పొక్కిలై ఎట్లనో ఉందవ్వా!''
"గదే శెల్లే! ఇంటికి దీపం ఇల్లాలు అంటరు.ఇంట్లె ఆడమనిషి తిర్గుతుంటే గా కళ ఏరే శెల్లే. ఆడమనిషి లేనిల్లంత అద్వానం ఇంకోటి లేదు. గందుకే మన పెద్దోళ్ళు"ఇల్లాలు లేని ఇల్లు దెయ్యాలకు నిలయం" అంటుంటరు."
 గంత పెద్ద ఇల్లు ఆకిలి లచ్చిందేవొచ్చి కూసున్నట్టు కళకళలాడుకుంట ఉండేది.గిప్పుడు గా వైభోగమే పోయింది.
అడ్డెడంత అయ్య కంటే తవ్వెడంత తల్లి ఉండాలంటరు గిందుకేనేమో. 
శెల్లే నాకు తెల్శిన మా సుట్టపోళ్ళ పొల్లుంది. శిన్నతనాన్నే మొగుడు సచ్చిపొయ్యిండు. గా పొల్లని తీస్కొత్తె ఇల్లు బాగువడ్తది.గా పొల్లకి  ఉండటానికి గింత తలము,తొవ్వ దొరుకుద్ది. దెయ్యాలు విముకితై పోతే మున్పటొతికే కళకళలాడుద్ది శెల్లే!"
అవునవ్వా! గా నర్సయ్యకి ఒంటి శేత పిల్లల్ని పెంచుడు ఎంత కట్టమో తెలిశొచ్చింది.నా మాట కన్న నీ మాట కాదనడు .గియ్యాల ఇద్దరమెల్లి నచ్చజెప్పొద్దాం.రేపు గా పొల్లని రప్పిద్దాం అవ్వా!"
"గదండీ సంగతి! ఇల్లాలు లేని ఇల్లు దెయ్యాలకు నిలయం" అంటే గిదే మరి.పాడుబడేసిన ఇల్లు లెక్క సూట్టానికే బయం కలిగేతట్టు కలహీనంగ ఉంటది.గట్ల గాకుండా సూడాలంటే అవ్వ,శెల్లె అస్మంటోళ్ళు పట్టిచ్చుకొని ఓ తొవ్వకి తీస్కరావాలె."
కామెంట్‌లు