సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
 కర్ణ పర్వం – తృతీయాశ్వాసం: - 394 వ రోజు


అర్జునుడు ధర్మజుని వధించుటకు కత్తి దూయుట
అన్ని మాటలు మౌనంగా భరించిన అర్జునుడు ఆఖరున ధర్మరాజు " నీ గాండీవాన్ని కృష్ణుడికి ఇచ్చి నీవు రథాన్ని తోలు " అన్న మాటలు సహించ లేక పోయాడు. పక్కనే ఉన్న కత్తి తీసుకుని ధర్మరాజును నరకబోయాడు. కృష్ణుడు అర్జునుడి చేయి పట్టుకుని వారించి " అర్జునా ఇక్కడ కత్తితో పని ఏమి? ఇక్కడ మనకు శత్రువులు ఎవరూ లేరు కదా ? మనం ఇక్కడకు ధర్మజుడు క్షేమంగా ఉన్నాడా లేడా అని చూడ వచ్చాము. క్షేమంగా ఉన్నాడని తెలుసుకున్నాము. ఇది సంతోషించ వలసిన సమయం కాని కోపం తెచ్చుకొనవలసిన సమయం కాదు " అని అన్నాడు. అర్జునుడు " కృష్ణా ! నా గాండీవాన్ని ఎవరికైనా ఇమ్మని అన్న వారి తల నరుకుతానని నా ప్రతిజ్ఞ. ధర్మజుని మాటలు విన్నావు కదా ! అలాంటి మాటలు అన్న వాడిని నరకడం ధర్మమే కాని అధర్మమం అంటావా  ! కనుక నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుని అసత్యదోషం నెరవేర్చుకుంటాను. పోనీ నీవు లోకజ్ఞానం కలవాడివి కదా నేను ఏమి చేయాలో చెప్పు " అన్నాడు. కృష్ణుడు " అర్జునా ! చాలు వ్యర్ధప్రేలాపనలు ఆపు. ధర్మాధర్మ విచక్షణ తెలిసిన వారు నీ వలె పలుకరు. ఎవరైనా వింటే నీకు పెద్దల ఎడ గౌరవం లేదని అనుకోగలరు. ఏది ధర్మమో ఏది కాదో తెలుసుకుని మాట్లాడు " అన్నాడు. సత్యము అహింస పరమ ధర్మములు. ఆ సత్యమే అహింసాచరణకు తోడ్పడాలి కాని హింసను ప్రేరేపంచ కూడదు. మనం చేసే కర్మలలో ధర్మము సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. కర్మను ఉచితానుచితాలు తెలుసుకుని చేయాలి. నీ అన్నయ్య, నీహితము కోరే వాడు, ధర్మము తెలిసిన వాడు, మనకు మహారాజు అతడిని చంపబూనడం ధర్మం అనిపించుకుంటుందా ! తెలిసీ తెలియని వయసులో చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవటానికి ఈ వయసులో ధర్మాధర్మ విచక్షణ మరవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. పెద్దలు ఇందుకు అంగీకరించరు. ధన, మాన, ప్రాణాలకు ముప్పు వాటిల్లినపుడు అసత్యము పలుకుట దోషం కాదు ఇందుకు నీకు ఒక దృష్టాంతం చెప్తాను " అన్నాడు.
కౌశికుని కథ
పూర్వము కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండే వాడు. వాడికి పెద్దలు చెప్పిన మాటలు వినే అలవాటు లేదు. తాను నమ్మిందే ఆచరిస్తాడు. అతడు ఒక సారి తన ఆశ్రమంలో తపస్సు చేసు కుంటున్నాడు. కొంత మంది దొంగలు దారిన పోయే బాటసారులను తరుముకుంటూ వస్తున్నారు. బాటసారులు తమ తమ ధనము ఆభరణముల మూటలతో ఆశ్రమ సమీపములోని పొదలలో దాక్కున్నారు. బాటసారులను వెదుక్కుంటూ వచ్చిన దొంగలు తాము తరుముతూ వస్తున్న బాటసారులు ఎక్కడ ఉన్నారని కౌశికుని అడిగారు. కౌశికుడు ధర్మాధర్మ విచక్షణ లేని వాడు కావడం చేత తనకు అసత్యదోషం చుట్టుకుంటుందని అనుకుని వారు పొదల మాటున దాక్కున్న విషయం చెప్పాడు. దొంగలు బాటసారులను చంపి వారి ధనమును దోచుకున్నారు. మరణానంతరం కౌశికుడు ఘోరనరకానికి పోయారు. కనుక అర్జునా !
అర్జునుడు శాంతించుట
హింసకు కారణమయ్యే సత్యము ధర్మం అనిపించు కోదు. సత్యాసత్యం, ధర్మాధర్మం గురించిన విచక్షణ పెద్దల చేత నిర్ణయించ బడాలి కాని ఎవరికి వారు వారికి తోచినట్లు చేయకూడదు. కనుక నీవు నీ అన్న ధర్మరాజును వధించుట ధర్మం కాదు " అన్నాడు. అప్పటికి శాంతించిన అర్జునుడు " కృష్ణా ! నన్ను మన్నించు. తల్లీ తండ్రి వలె నాకు హితవు చెప్పి నేను అనుచిత కార్యము చేయకుండా కాపాడావు. లేకున్న ఘోరం జరిగి పోయేది. కాని కృష్ణా ! జనులు నన్ను చేసిన ప్రతిజ్ఞ కాపాడని వాడని నిందించకుండా నాకు , నా అన్న ధర్మజునుకి ఆపద వాటిల్లని చక్కని మార్గం సూచించు " అన్నాడు. కృష్ణుడు " అర్జునా ! ధర్మజుడు కర్ణుని వాడి బాణములతో బాధించడమే కాక నీచమైన మాటలతో నిందించాడు కనుక ఆ బాధ భరించ లేక ఏవో మాటలు అన్నాడే కాని నీ మీద ప్రేమ లేక కాదు. నీకు అన్న ప్రభువు. మిమ్ములను తండ్రి వలె కాపాడే వాడు. అతడు నిన్ను అనకూడదా ! నీవు పడకూడదా ! అతడి వంశోద్ధారకులైన నీవు, భీముడు, నకులసహదేవులు అతడి వశంలో ఉంటారు కదా ! మీ మీద కోపం ఎందుకు ఉంటుంది. ఆయనను చంపడానికి నీవు కత్తి ఎత్తావు కదా ! ఆ భావన మనసులో ఉంచుకుని నీ అన్నయ్యలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ నిందించు. కాని ఆ మాటలు మనసులో పెట్టు కోవద్దని వినయముగా నమస్కరించు. ఆ తరువాత నీకు అనృత దోషం పోయి నీ మనస్సు శాంతపడుతుంది. ఆ పై మనం కర్ణుడిని చంపడానికి వెళదాము.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు