ముప్పై మూడు; - కొత్త విరిత


 అమ్మ ఒక విషయం చెబితే పిల్లలు వినరు… ఎందుకంటే అమ్మ కదా, మళ్లీ చెబుతుందని వాళ్లకు నమ్మకం!
“చదువుకో”,
“సమయానికి పడుకో” 
"తీసిన వస్తువు తీసిన చోటే పెట్టు"
"బట్టలు సర్దుకో"
"ఇల్లు నీట్ గా పెట్టుకోండి"
ఇలా అమ్మ  చెప్పినదే ఒక ముప్పై మూడు సార్లు చెబుతూనే ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లా!
పిల్లలు వింటున్నట్టే ఉంటారు… కానీ పని జరగదు.మరి అదే విషయం నాన్న ఒక్కసారి చెబితే… ఒక్కసారిగా ఇంట్లో మిలిటరీ క్రమశిక్షణ మొదలవుతుంది!
“నాన్న చెప్పారుగా!” అంటూ పిల్లలు వెంటనే పనిలో పడిపోతారు.
అప్పుడు అందరికీ ఒక సందేహం ...
అమ్మ గొప్పా? 
నాన్న గొప్పా?
అసలు విషయం అక్కడే ఉంది,నాన్న ఆ ఒక్క మాటకు వచ్చిన బలం, ఆయన ఒక్కరోజులో సంపాదించింది కాదు.ఆ మాటకు బలం ఇచ్చింది అమ్మ ఇన్నాళ్లుగా చెప్పిన ఆ ముప్పై మూడు సార్లే!
అమ్మ ప్రతిరోజూ వేసిన విత్తనమే… నాన్న ఒక్కసారి చెప్పగానే మొలకెత్తుతుంది.
అమ్మ చేసిన హెచ్చరికలే… నాన్న మాటకు గౌరవంగా మారతాయి.అమ్మ చెప్పిన ప్రతి “జాగ్రత్త”కీ… నాన్న చెప్పిన ఒక్క “ఇదిగో చూడు!” తో ముగింపు వస్తుంది.
కాబట్టి పిల్లలు నాన్న మాట వింటున్నారని అమ్మ ఓడిపోయినట్టు కాదు.నాన్న ఒక్క మాటకే అంత పవర్ వచ్చిందంటే… దాని వెనుక అమ్మ ముప్పై మూడు సార్లు చెప్పిన అమ్మ మాటలే ఉన్నాయి!
ఇంట్లో నాన్నది ఒక్క డైలాగ్ పవర్ అయితే…
ఆ డైలాగ్‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం కచ్చితంగా అమ్మదే!
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Meru pette prathi post chala chala bagutade.