తలరాతను మార్చిన గీతలు : - యామిజాల జగదీశ్
 

తొమ్మిదేళ్ల చిన్నారి తరగతి గదిలో గీతలు గీసుకుంటూ కూర్చున్నందుకు ఒకసారి శిక్ష అనుభవించాడు. కాలక్రమేణా ఆ గీతలే అతని ప్రతిభను లోకానికి చాటడానికి పునాది అయ్యాయి. 
ఇంగ్లాండు దేశంలోని శ్రూస్‌బరీ నగరానికి చెందిన జోసెఫ్ వేల్ అనే బాలుడు, తన పుస్తకాల్లోనూ, తరగతి గదిలోని తెల్ల పలకలపై రకరకాలుగా గీతలు గీస్తూ తరచూ ఇబ్బందుల్లో పడేవాడు.
​ఐతే అలా చేయవద్దని మందలించకుండా, తల్లిదండ్రులు వాడు చూపిన సృజనాత్మకతను ప్రోత్సహించి ఒక చిత్రకళా తరగతిలో చేర్పించారు.
​వాడి ప్రతిభ గురువు గారి దృష్టిని వెంటనే ఆకర్షించింది. ఆయన జోసెఫ్ చిత్రాలను ఒక స్థానిక తినుబండార కేంద్రానికి పంపించారు.
​ఆ బొమ్మలను చూసి ముచ్చటపడిన ఆ కేంద్ర నిర్వాహకులు, తమ గోడలపై చిత్రాలు గీసే అవకాశం జోసెఫ్‌కు ఇచ్చారు — ఒక కళాకారుడిగా వాడు మొదటిసారిగా పారితోషికం అందుకున్న క్షణం అది.
​బడిలో మామూలుగా మొదలైన ఆ గీతలు, తన ఊహాశక్తితో ఒక పెద్ద భవనాన్నే మార్చేసే అద్భుత అవకాశంగా మారాయి. 
​ఒకరికి చికాకుగా అనిపించేది, మరొకరికి వెలుగులోకి రావడానికి కాచుకుని ఉన్న ఒక వరంగా మారుతుంది.
​తగిన ప్రోత్సాహం ఒక చిన్నారి సాధారణమైన అభిరుచినీ అసాధారణమైనదిగా మలచగలదు అనడానికి ఆ కుర్రాడి గీతలే ఓ నిదర్శనం.
కామెంట్‌లు