సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
 కర్ణ పర్వము ప్రథమాశ్వాసము- 377 వ రోజు


భార్గవరాముని కథ
సుయోధనుడు శల్యునితో భార్గవ రాముని గురించి చెప్పసాగాడు. " నా తండ్రి గారికి ఒక ధర్మ ప్రవీణుడగు బ్రాహ్మణుడు చెప్పగా విన్నాను. జమదగ్ని మహామునికి రాముడనే నిర్మల హృదయుడు పుత్రునిగా అవతరించాడు. అతడి శివుడి గురించి తపస్సు చేసి శివుని ప్రత్యక్షము చేసుకుని తనకు దివ్యాస్త్రములు ప్రసాదించమని కోరాడు. మహాశివుడు నేను ప్రసాదించు దివ్యాస్త్రాలు అశుచిగా ఉన్న వారిని దహిస్తాయి కనుక నీవు శుచి అయి వచ్చిన దివ్యాస్త్రములు లభించగలవు " అన్నాడు. రాముడు " నేను ఈ అస్త్రములు గ్రహించుటకు ఎప్పుడు పాత్రుడను అని నీవు తలుస్తావో అప్పుడే వాటిని నాకు ప్రసాదించ వచ్చు " అన్నాడు. ఒక రోజు శివుడు పార్వతికి పరశురాముని చూపి " దేవీ ఇతడు రాముడు. నన్ను నిష్కలంక చిత్తముతో ఆరాధిస్తున్నాడు. నాకు పరమ భక్తుడు " అన్నాడు. ఆ సమయంలో దేవతలు తమను రాక్షస బాధ నుండి రక్షించమని శివుని వేడారు. శివుడు భార్గవరాముని చూసి " వెంటనే నీవు వెళ్ళి రాక్షస సంహారం చెయ్యి " అన్నాడు. అందుకు రాముడు " దేవా ! నేను ఏ అస్త్రములు అభ్యసించ లేదు కనుక బలవంతులైన రాక్షసులను నేను సంహరించగలనా ! " అని సందేహం వెలిబుచ్చాడు. పరమశివుడు " రామా ! నేను నా సంకల్పము నీ మీద ఉంచుతాను. నా సంకల్ప బలం చేత నీవు రాక్షసులను నిర్జించు " అన్నాడు. రాముడు రాక్షసులతో భయంకర యుద్ధము చేసి వారిని నిర్జించాడు. అప్పుడు రామునికి అయిన గాయాలను అతడి శరీరం అంతా శివుడు నిమరగానే మాయం అయ్యాయి. రామా నా స్పర్శ పొందిన నీకు ఎలాంటి ఆయుధములు తగిలినా గాయము కాదు. నా వద్ద వరములు పొందుటకిది తగిన సమయము " అన్నాడు. అప్పుడు రాముడు శివుడిని కోరి అనేక దివ్యాస్త్రములను ఆయుధములను పొంది తన ఆశ్రమముకు వెళ్ళాడు. తరువాత కర్ణుడు భార్గవ రాముని సేవించి అనేక దివ్యాస్త్రములను పొందాడు. హీనకులజుడైన కర్ణుడికి భార్గవరాముడు దివ్యాస్త్రములను ఎందుకు ఇస్తాడు. భార్గవ రాముని ఆదరణ పొందిన అతడు ఉత్తమ కులజుడనే తలుస్తాను. అతడి ఆజానుబాహువైన ఆకారము దేవకుమారుని తలపిస్తుంది. ఒక సాధారణ స్త్రీ సకజ కవచకుండలములతో సూర్యప్రభలా వెలిగి పోయే బిడ్డను కనగలదా ! సూతుని చేత పెంచబడటము వలన కర్ణుడికి సూతుడనే అపవాదు వచ్చింది. కనుక శల్య మహారాజా ! శివుడి శిష్యుడైన భార్గరాముని శిష్యుడైన కర్ణుడికి సారధివై రుద్రుడికి బ్రహ్మదేవుడు సారధి అయినట్లు రధికుడికంటే సారధి గొప్పవాడన్న కీర్తి నిలబెట్టు " అన్నాడు.
కర్ణ సుయోధనులు శల్యుని శ్లాఘించుట
సుయోధనుడి యుక్తాయుక్తమైన మాటలకు శల్యుడు పొంగి పోయాడు. సుయోధనుడిని ఆదరంతో కౌగలించుకున్నాడు. సుయోధనా ! నన్నూ నా పరాక్రమాన్ని నీవు గ్రహించి మెచ్చుకుని నాకు ఆనందం కలిగించావు. కాని ఒక్క మాట నేను నాకు తోచినట్లు మాట్లాడి సలహాలు ఇస్తుంటాను. మీరు కోపించక ఓపికగా ఏమీ అనుకోకుండా వినాలి " అన్నాడు. కర్ణుడు " మహానుభావా ! ఆ పరమేశ్వరునికి బ్రహ్మవలె, అర్జునుడికి శ్రీకృష్ణుడి వలె నాకు సారథ్యం వహించు " అన్నాడు. శల్యుడు " నేను ఇంద్రుడికైనా ! సారథ్యం వహించ గలను. నా రథికుని క్షణమైనా ఏమరిపాటుగా ఉండనివ్వను. కృష్ణుడి సారథ్యంలో ఘనుడైన అర్జుడిని గెలువడానికి నా సారథ్యము కోరుతున్నావు కనుక నేను నీకు సారథ్యం వహిస్తాను " అని అన్నాడు. సుయోధనుడు " కర్ణా ! కృష్ణుడికంటే శల్యుడు సారథ్యంలో సమర్ధుడు. ఇంద్రుడి సారథి మాతలికంటే కూడా శల్యుడు ఘనుడు అటువంటి మహాఘనుడు నీ భాగ్యవశాత్తు నీకు సార్ధ్యం వహిస్తున్నాడు. ఇక నీవు అర్జునుడిని గెలువగలవు " అన్నాడు. వెంటనే శల్యుడు కర్ణ సార్ధ్యానికి తగిన రథమును సమాయత్తం చేయమని చెప్పాడు. రథముకు పూజాది కార్యములు నిర్వహించారు. కర్ణుడు రథముకు ప్రదిక్షిణము చేసి శల్యుని ముందుగా రథమును అధిరోహించమని తాను తరువాత రధుమును అధిరోహించాడు. ఆ ప్రకారముగా శల్యుడి సారధ్యంలో కర్ణుడి రథము యుద్ధముకు కదిలింది " అన్నాడు సంజయుడు.
*కర్ణ పర్వము ప్రథమాశ్వాసము సమాప్తం *
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు