శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 196
 

వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
174. నిర్భవా (త్ర్యక్క్షరీ)
175. భవనాశినీ (పంచాక్క్షరీ)
నూట డెభై ఐదవ నామ మంత్రము:
ఓం భవనాశిన్యై నమః
భవ = సంసారము; భవనాశినీ = భవనాశినీ అనబడే నదీ స్వరూపూరాలు
"నిర్భవా" అనే నామము చదువుతూ, అమ్మకు "జననమరణ చక్రబంధం" లేదు అని తెలుసుకున్నాము. తనను ఆర్తితో ఆశ్రయించిన తన సాధకులను కూడా ఈ జననమరణ చక్రబంధ సంబంధమైన బంధనాలనుండీ ముక్తి ప్రసాదిస్తాను అని ప్రకటితమైన చాముండేశ్వరిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు శ్రీలలితా పరాభట్టారికను "భవనాశినీ" అని కీర్తించారు. మన శారీరక బంధనాలు అన్నీ పోగొట్టి, మనలను కాపాడే కాత్యాయినికి నమస్కారము.
నవమ్యాం శుక్లపక్షే తు విధివత్ చండికాం నృప
ఘృతేన స్నపయే ద్యస్తు తస్య పుణ్యఫలం శృణు !
దశ పూర్వాన్ దశ పరా నాత్మానాం చ విశేషతః
భవార్ణవా సముద్ధృత్య దుర్గా లోకే మహీయతే !! (సౌభాగ్య భాస్కరం)
శరన్నవరాత్రులలో శుక్లపక్ష నవమి తిథి నాడు, చండికను శాస్త్రవిదితంగా, స్వచ్ఛమైన ఆవు నెయ్యి తో అభిషేకము చేసి, పూజ చేసిన సాధకుని పూజా ఫలము వలన, తన ముందు పదితరముల వారు, తాను, తన తరువాత పదితరముల వారు కూడా సంసార బాహు బంధనాల నుండి ముక్తి పొందుతారు. అమ్మ సాయుజ్యాన్ని, దుర్గా లోకాన్ని పొందుతారు. "నాలో ఆసక్తి కలిగియుండి, పరమేశ్వర యోగమును పొందగలిగిన భక్తులను, సాధకులను, సంసార బంధనాలనుండీ విముక్తి ప్రసాదించి, మోక్షమార్గం లో నడిపిస్తాను" అని దేవీభాగవతం లో శ్రీమహారాజ్ఞి స్వయంగా చెప్పింది. కనుకనే, "నిర్భవా" అయిన పరమేశ్వరి "భవనాశినీ" అయ్యింది. అహోబిలము లోని జ్వాలానృసింహుని చేరి వచ్చినది ఈ నామము.
అమ్మ యొక్క మీననయనమ్ముల యొక్క చల్లని చూపుతో, ఈ భూమి మీదకు వచ్చిన ఆత్మ, తల్లి గర్భంలో మలమూత్రాల మధ్య, ఎటూ కదలలేక, తలక్రిందులుగా ఉండి, ప్రాణాలను కనిపించని అరచేతిలో పట్టుకొని, తొమ్మిది నెలలపాటు చేసే గర్భావాసం, అతి భయంకరమైనది. ఇన్ని యాతనలు పడి, భూమి మీదకు వచ్చాక, మంచివో, చెడ్డవో కర్మలను చేసి, మరణం పొందుతుంది. కానీ, ఆ చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించాలి కావున, మళ్ళీ జన్మ ఎత్తవలసినదే. ఈ జననమరణ చక్రబంధ విషవలయం నుండి బయటపడడానికి ఒకే మార్గం"శ్రీమాత శ్రీ చరణాలు". ఆ పద్మపాదాలను నమ్మి, కొలిచే వారికి మోక్షభిక్ష ఇస్తాను అని కనిపించే "అన్నపూర్ణ " యే "భవనాశిని".
నైషా ధాత్రీ విధాత్రీ చ పరమానన్ద మిచ్ఛతామ్ !
సంసారతాపా న్నిఖిలా న్నిహంతీశ్వర సంజ్ఞయే !!
తననే అత్యంత శ్రద్ధాభక్తులతో పూజించి సేవించి, ఐహికమైన కోరికలు సుఖములు కోరుకోకుండా, పరమార్ధమునూ, మోక్ష మార్గములో ప్రయాణం చేసి, తన సాయుజ్యాన్ని కోరుకుంటూ, తనను పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు   ఓం భవనాశిన్యై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
కామెంట్‌లు