వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
177. నిరాబాధా (చతురక్క్షరీ)
178. నిర్భేదా (త్ర్యక్క్షరీ)
నూట డెభై ఎనిమిదవ నామ మంత్రము:
ఓం నిర్భేదాయై నమః
అర్థనారీశ్వర తత్వ స్వరూపిణి అయిన తనకు భేదమైనది / వేరైనది వేరేదీ లేదు అని తెలుపుతూ ప్రకటితమైన చాముండేశ్వరిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు, శ్రీలలితా పరాభట్టారికను "నిర్భేదా"అని కీర్తించారు. ఈ చరాచర జగత్తుకు ముందు, తరువాత కూడా తానే ఏకైక శక్తి గా నిలచిన / ఉన్న పరాత్పరికి నమస్కారము.
శక్తి, శక్తి స్వరూపిణి వేరు అని కొండొకచో భావిస్తారు. కానీ, పరమేశ్వర ప్రియ పత్ని అయిన పార్వతి, అర్థనారీశ్వర తత్వాన్ని ఆవిష్కరించి, పరమేశ్వరుడు, పరాత్పరి వేరుకారని, ఒకే శక్తి రూపం అని ప్రకటితమౌతోంది. "నీవే మహాశక్తివి. నిన్ను మించిన శక్తి కానీ, నీకంటే వేరుగా యింకొక శక్తి గానీ లేవు" అని కూర్మ పురాణం చెపుతోంది. కనుకనే, పరాత్పరి "నిర్భేదా" అని కీర్తించబడింది.
రూపధారణ చేసిన ప్రాణుల మధ్య భేదం కనిపిస్తుంది. ఈ రూపధారణ జరగాలంటే, ఆత్మ శరీరాన్ని ఆధారం చేసుకోవాలి. ఆంటే, ఈ చరాచర జగత్తులో ఉన్న జీవుల మధ్య భేదం కనిపిస్తుంది. కానీ, పరబ్రహ్మ స్వరూపిణి అయిన శ్రీమహారాజ్ని నిరాకారా, నిర్లేపా, నిరహంకారా, నిర్మోహా అని తెలుసుకున్నాము కదా! శరీరమే లేని త్రిగుణాత్మికకు, తులనాత్మకంగా వేరొక రూపాన్ని ఎక్కడ చూడగలము. కనుకనే, లోభనాశినీ అయిన పరమేశ్వర పత్ని "నిర్భేదా" అని పిలువబడింది.
శ్రీమాతకు స్వ, పర, ఆత్మ భేదములు లేవు. తన సృష్టిలో ఉన్న జీవులందరిలోనూ తానే నిండి ఉంటుంది. ఏ జీవ సమూహానికి ఏమి కావాలో, వారి వారి అర్హతలను బట్టీ సమకూరుస్తూ ఉంటుంది. మన తల్లి కూడా, తన సంతానం అందరికీ, తన ప్రేమను, ఆప్యాయతనూ, ఆర్ద్రతనూ సమానంగానే పంచుతుంది కదా! మరి అమ్మలగన్నయమ్మ భేద భావం ఎలా చూపగలుగుతుంది. అందువలననే శ్రీనివాసుని హృదయేశ్వరి "నిర్భేదా".
"ఏకమేవాద్వితీయం"; ఏకం సద్విప్రా బహుధా వదంతి "; "సర్వం ఖల్విదం బ్రహ్మ"; "తత్వమసి " మొదలైన శృతి వాక్యాలు కూడా, ఈ అభేదాన్ని నొక్కి ఒక్కాణిస్తున్నాయి.
ఈ సృష్టిలో ఉన్నదంతా ఒక్క పరమేశ్వరి తత్వమైన ఆత్మ రూపమే కానీ, రెండవది ఏదీ లేదు. ప్రతీ జీవిలోనూ జీవదారంగా ఉన్నది, ఆత్మ స్వరూపిణి అయిన శ్రీమహారాజ్ని, శ్రీమత్సింహాసనేశ్వరియే అని, పరమగురువు ద్వారా ప్రాప్తించిన ఆత్మజ్ఞానము వలన తెలుసుకుని, తనను పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం నిర్భేదాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి