శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 204
 

వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
182. నిష్క్రియా (త్ర్యక్క్షరీ)
183. నిష్పరిగ్రహా (పంచాక్క్షరీ)
నూట ఎనభై మూడవ నామ మంత్రము:
ఓం నిష్పరిగ్రహాయై నమః
పరిగ్రహ = పరిజనము / పత్ని / స్వీకారము / మూలము; నిష్పరిగ్రహా = పరిజనము మొదలైనవి లేనిది
తనను ఫలానా ప్రదేశం నుండి మొదలు అయినది అని లేదా తాను ఫలానా చోటులో పుట్టింది అని తెలుపడం / తెలుసుకోవడం సాంధ్యం కాదు, అని నిరూపణ చేస్తూ ప్రత్యక్షమైన పరమేశ్వరిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు శ్రీలలితా పరాభట్టారికను, "నిష్పరిగ్రహా" అని కీర్తించారు. మానవులుగా మనం, ఆది అంత్యాలు కనుగొనలేని శ్రీమాతకు నమస్కారము.
శ్రీమాత, త్రిసంధ్యలలోనూ, సృష్టి, స్థితి, లయ కాలములలోనూ ఉన్నది. అందువలన ఈమెను చుట్టరికాలు, బంధుజనాలు, పరిచారకులు, ఆత్మీయత, అనురాగాలు అంటవు. ఈ శ్రీమాత, త్రికాలజ్ఞ అయిన బ్రహ్మజ్ఞానైక ‌ఆత్మ స్వరూపిణి. కనుకనే, "నిష్పరిగ్రహా" అయ్యింది.
పరమేశ్వరి వద్ద లేనిది, ఈ చరాచర జగత్తులో ఎక్కడా లేదు. ఆ తల్లి దగ్గర ఉన్నదే, జగత్తు అంతా వ్యాపించి ఉన్నది. తన భక్తులకు, సాధకులకు, వారి వారి అర్హతలను బట్టి సర్వం అనుగ్రహించగలిగిన కరుణాపూరిత అంతరంగ, శ్రీమాత. అటువంటి అమ్మలగన్నయమ్మకు, వేరొకరు ఇవ్వగలిగినది ఏమీ ఉండదు. ఒకరు ఇవ్వడం, అమ్మ తీసుకోవడం అనేది జరిగే అవకాశం లేదు, కనుకనే, జగజ్జనని, "నిష్పరిగ్రహా" అనబడింది.
శ్రీలలితా పరాభట్టారిక,  పద్మముల యొక్క దట్టమైన అడవిలో నివసిస్తుందనీ, కదంబపుష్పముల చిక్కటి వనంలో విహరిస్తుందనీ, చింతామణి గృహంలో, త్రికోణం మధ్యలో బిందువు రూపంలో ఉన్న స్వామివారిని కూడిన పరమేశ్వరి, సుధాసాగర మధ్యలో ఉంటుంది అనీ తెలుసుకున్నాము. మరి, అమ్మలగన్నయమ్మ దగ్గర లోటు ఏమి వుందని, ఇతరుల నుండి ఏమైనా తీసుకుంటుంది. సకల జగత్తుకు వలసినది అంతా ఈయగల ఆ తల్లి దగ్గర, ఇసుమంత కూడా లోటు ఉండదు. ఆపరిమితమైన సంపదలను, జ్ఞాన సంపదలను, ఇవ్వగల "శంఖనిధి, పద్మనిధులు" శ్రీమాత కు రెండు ప్రక్కలా విద్యమానమై ఉన్నాయి. "నవరత్నవహ", "కాంచనవహ", "సప్తధాతువహ" అనే నదులు నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి. కనుకనే ఆ తల్లి, "శ్రీప్రద" అయి, "నిష్పరిగ్రహా" అని పిలువబడుతుంది.
"మనకు ఉన్నంతలో, ఎదుటివారికి అవసరమైనది, ఇవ్వదగినది ఏదైనా ఇస్తూ సహాయపడాలి" అని శ్రీలలితా పరాభట్టారిక, తాను ఆచరించి మానవాళికి మార్గదర్శనం చేసింది.
జగన్మాత అయిన దుర్గా రాజరాజేశ్వరి, "ఒకరికి ఇచ్చేదే కానీ,  ఎదుటి వారి నుండి ఎమీ ఆశించదు" అనే పరతత్వాన్ని అర్థంచేసుకుని, పరులమేలు కోరకూ తపిస్తూ, ఆ జరిగే మేలులో తాను కూడా ఉండాలని కోరుకుంటూ, తనను పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు   ఓం నిష్పరిగ్రహాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
కామెంట్‌లు