పండితుల్లో మాత్రమే కాకుండా పామరుల హృదయాల్లోకి సైతం చొచ్చుకుపోయే ప్రధాన ఆశయమే కవిత లక్షణమని ప్రముఖ సాహితీవేత్త బొమ్మిరెడ్డిపల్లి వెంకట గణేశ్వరరావు అన్నారు.
స్థానిక విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించినకొత్తూరు రచయితల వేదిక 19వ నెల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి, మాట్లాడారు. వేదిక ప్రతినిధి కలమట శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గణేశ్వరరావు తెలుగు వచన కవిత నిర్మాణం- మౌళిక అంశాలు అను అంశంపై ముఖ్య వక్త ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన నియమాలకు లోబడి ఉండని పద్య లక్షణాలు చందో రహిత సాహిత్యం ద్వారా జరుగుతుందని, సామాన్యులకు కూడా అర్ధమయ్యే సరళమైన పదాలతో భాషా స్వేచ్ఛ కవితల సొంతమని, భావానికి అనుగుణంగా పదప్రయోగాలు వ్యంగ్యంతో కూడినట్టి అంత్య ప్రాసల అధిక్షేపణ కవితల లక్షణమని వివరించారు. సమాజంలో సమస్యల అసమానతల అణచివేతలపై ఎక్కుపెట్టే అస్త్రాల వంటి కవితలు సామాజిక చైతన్యానికి దోహదపడేవని గణేశ్వరరావు వివరించారు.
గౌరవ అతిథిగా విచ్చేసిన అంపిలి ప్రశాంత్ కుమార్ సమన్వయంతో నిర్వహించిన కవి సమ్మేళనంలో ముఖ్య అతిథి బి.వి.గణేశ్వరరావు, వేదిక ప్రధాన కార్యదర్శి కలమట శ్రీరాములు, ఉపాధ్యక్షులు గడసాపు ఉషారాణి, గౌరవాధ్యక్షులు ముదిల శంకరరావు, కోశాధికారి గేదెల మన్మధరావు,
ఆహ్వాన కమిటీ అధ్యక్షులు అల్లిన దిలీప్ పట్నాయక్, కార్యవర్గ సభ్యులు అంపిల్లి ప్రశాంత్ కుమార్, మావుడూరు మురళీకృష్ణ, ఇప్పిలి జానకి రామయ్య, గేదెల కవిరాజు అప్పలరాజులు తమ తమ కవితలను వినిపించారు. అనంతరం ముఖ్య అతిథి గణేశ్వరరావును వేదిక సభ్యులు శాలువా జ్ఞాపిక గ్రంథాలతో ఘనంగా సన్మానించారు. గౌరవ అతిథులుగా విచ్చేసిన అంపిలి ప్రశాంత్ కుమార్, మావుడూరు మురళీకృష్ణలకు వేదిక సభ్యులు ఆత్మీయ సత్కారం గావించారు. తొలుత గౌరవ అతిథి మావుడూరు మురళీకృష్ణ తెలుగుతల్లి చిత్ర పటానికి పూలమాలాలంకరణ చేసి సభను ప్రారంభించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి