పనిని బట్టి పనిముట్టు: - అనురాధ బొడ్ల (సముద్రాల)-9989566696
 

ఈ రోజు మా కమ్యునిటీలో, గణేశ నిమజ్జనం. కాసేపు వాకింగ్ చేసి, ఆ నిమజ్జనం ఊరేగింపు దగ్గరికి వెళ్దాం అనుకుని సాయంత్రం కిందికి వెళ్ళాను.
గత తొమ్మిది రోజులుగా ఇక్కడ గణేశ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ తొమ్మిది రోజులూ పూజలూ, పారాయణాలూ, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసాదాలతో సందడి సందడిగా ఉండింది. వీటికి తోడు తంబోలా ఆటలు కూడా జరిగాయి. కమ్యునిటీ అంతా ఒక పండుగ వాతావరణం. అందరూ బాగా ఎంజాయ్ చేసారు. ఇవాళ సాయంత్రం ఐదు గంటలుకు ఊరేగింపు మొదలయి, అన్ని బ్లాకుల చుట్టూ తిరిగి, మా కమ్యునిటీలోనే ఒక వాటర్ పాండ్ లో నిమజ్జనం జరుగుతుంది. 
ఊరేగింపు కార్యక్రమం మొదలయినట్టు ఉంది. వినాయకుడి పాటలు, బ్యాండు చప్పుళ్ళు వినపడుతున్నాయి. అలా ఆ శబ్దాలు వచ్చే వేపు నడుస్తూ ఉంటే, మనసు కూడా ఆ పాటకు తోడుగా పాడుతూ, నర్తిస్తూ నడిచింది. అన్ని బ్లాకుల దగ్గర చిన్న టేబుల్స్ మీద స్నాక్స్ పెట్టుకుని కొందరు, మంగళహారతులతో కొందరు, డాన్సులు ప్రాక్టీసు చేస్తూ కొందరూ, చాలామంది ఆ గణపయ్య రాకకై ఎదురుచూస్తూ ఉన్నారు. 
అలా నడుస్తూ ఉండగా, ఒక అమ్మాయి బేబీ స్ట్రోలర్ తోసుకుంటూ వస్తుంది. దగ్గరికి వచ్చాక చూద్దును కదా, ఆ స్ట్రోలర్లో బేబీ లేదు. సూపర్ మార్కెట్ నుంచి తెస్తున్న సరుకులూ కూరగాయలూ ఉన్నాయి. ఓహ్, మల్టీ పర్పస్. స్ట్రోలర్ షాపింగ్ బ్యాగ్ అయ్యింది అని నవ్వుకున్నాను. అలా ఆలోచిస్తుంటే, ఇంట్లో మనం ఎన్నో వస్తువులను ఇలా మల్టిపుల్ పర్పసెస్ కి వాడతామేమో కదా అనిపించింది. నేను  వంటింట్లో చెంచాను ఎన్ని సార్లు స్క్రూడ్రైవర్ గా వాడి కుక్కర్ల, టీగిన్నెల, కడాయిల హ్యాండిల్స్, ఫిక్స్ చెయ్యలేదూ, అని గుర్తొచ్చింది. ఆ మధ్య ఒక ట్రెయినింగ్ లో పేపర్ల పిన్ ఎక్కడో పడిపోతే హెయిర్ క్లిప్ తీసి పేపర్ క్లిప్ గా పెట్టుకోలేదా నేను అనీ గుర్తొచ్చింది. నిజమే,  అవసరాన్ని బట్టి వస్తువు ఉపయోగం మారుతుంది కదా, అనుకున్నా. 
అలా ఆలోచిస్తూ నడుస్తూ, ఆ ఊరేగింపు దగ్గరికి చేరుకున్నాను. ఎంతో మంది పిల్లలూ, పెద్దలూ ఆ గణపయ్య ముందు డాన్సులు చేస్తూ ఉన్నారు. చుట్టూ ఎంతో మంది, ఆ నర్తనం చూస్తూ ఆనందిస్తూ ఉన్నారు. అలా అందరినీ చూస్తుంటే ఒక విషయం నా దృష్టిని ఆకర్షించింది. అందరి చేతుల్లో ఫోన్లు కనపడ్డాయి. ఫొటొలు, వీడియోలు తీస్తున్నట్టున్నారు. మనుషుల కంటే ఫోన్లే ఎక్కువున్నాయేమో అంటే అతిశయోక్తి కాదేమో, అని కూడా అనిపించింది. 
ఇది స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుండే మొదలయినా, ఈరోజు అది చూస్తుంటే ఎందుకో అనిపించింది, అందరూ, ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఫోన్లలో క్యాప్చర్ చెయ్యటమే పనిగా పెట్టుకున్నారు. కార్యక్రమాలను కళ్లలో బంధించటం ఎప్పుడో మానేసారు. ఈ రోజుల్లో ఏ కార్యక్రమమైనా,  కనువిందు అవటం కంటే కెమెరాలకే విందు అవుతున్నాయి. 
అలా అనుకుంటూ, జనం అక్కడికి చేరుతున్న కొద్దీ, డాన్స్ కనపడటం లేదని అటు కాసేపూ, ఇటు కాసేపూ, ఎక్కడ ప్లేస్ దొరికితే అటు వెళుతూ ఉన్నాను. ఆ క్రమంలో, నా ముందు, కొంచెం పొట్టిగా ఉన్న ఒక ఆవిడ, తన ఫోనులో కెమెరా ఆన్ చేసి, దాన్ని పైకి పెట్టుకుని నిల్చుంది. ఆవిడకు చెరో పక్కన మరో ఇద్దరు నిల్చుని అందులోకి చూస్తున్నారు. 
    ఈ హడావిడిలో వీళ్ళు  సెల్ఫీ దిగుతున్నారా ఏమిటి? అరే, కెమెరా, సెల్ఫీ మోడ్ లో లేదు. ఆ ఫోన్లో కాస్త దూరంలో జరుగుతున్న డాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో తీస్తున్నారా? అబ్బే వీడియో మోడ్ కూడా ఆన్లో లేదు. మరి ఏం చేస్తున్నారబ్బా? “కిరణ్ బలే చేస్తున్నాడు కదా డాన్స్,” అంది ఒకావిడ.
ఆ మాటతోనే పరిస్థితి చక్కగా తేటతెల్లమయ్యింది. అవసరాన్ని బట్టి వస్తువు ఉపయోగం మారుతుంది అని ఇంతకు ముందేగా అనుకున్నాను! ఇక్కడ వీళ్ల ఫోను కెమెరాగా కాదు, దుర్భిణిగా ఉపయోగపడుతుంది. జనం ఎక్కువగా ఉండటం, వీళ్లు కొంచెం హైట్ తక్కువగా ఉండటంతో, ఆ జనాల తలల పైగా ఫోన్ పట్టుకుని, ఆ మధ్యలో జరుగుతున్న డాన్స్ చూడటానికి, వీళ్ళు చేసిన స్మార్ట్ మూవ్, విత్ ద స్మార్ట్ ఫోన్ అని అర్ధమయింది.
   నువ్వూ అప్పుడప్పుడు ప్రయాణాల్లో, ఫోన్ కెమెరాని అద్దంలా వాడేస్తూ ఉంటావుగా! అని చెప్పింది మనసు. నిజమే అంటూ నవ్వుకున్నా. అవసరమే ఆవిష్కరణకు మూలం కదా! పనిని బట్టి పనిముట్టు.
కామెంట్‌లు