ఓ మనిషి...
నేననే పుష్పానిని, నిను అడుగుతున్నా....
ఇది నీకు న్యాయమా..?
చేయిచాచి కోసే ముందు ఆలోచించవా..?
నను వధించి,వేదనకు గురి చేయడం నీకు తగునా...?
నా వేదన వినలేవు, నా కన్నీళ్ళయినా కనలేవా...?
నీది అంత కఠినమైన పాషాణ హృదయమా...?
నాలోని మకరంద, సుగంధాలను అడుగు
నా ఓర్పు,సహనం సాహసాలను ఎరుగుదువు.
మన రూపాలు వేరైనా... మనం జీవాలుగా వేరైనా,
కానీ మన ఇద్దరి అంతిమ గమ్యం ఒక్కటే సుమా...
నేను,నీవు ఇరువురము తరువాత తరానికి పునాదులమే కదా...
నా పుట్టుక ప్రకృతి లీల,
నీ జన్మ సమాజ లైలా,
మనం ఇద్దరం ఆ విధాత తోటలో విరిసిన అపురూప పుష్పాలమే.
మన ఇద్దరి పుట్టుక ఒకటే,ప్రయాణం ఒక్కటే,
జీవిత పరమార్థం ఒక్కటే.
మట్టి నుండి మొలిచిన చెట్టు కొనలో ఉన్న పుష్పము నేను,
మాతృ గర్భము నుండి పుట్టిన మనిషివి నీవు,
కొమ్మల చాటున ఎండకు ఎండి, వానకు తడిసి ఎదిగాను నేను,
సంసార బంధాల నడుమ కష్టసుఖాలు ఓర్చి ఎదుగుతున్నావు నీవు,
కానీ...
నీవు నన్ను చేయిచాచి కోస్తుంటే,
నీవు ఎరుగవు గాని,
తొడిమ వీడిన నా ప్రాణం విలవిలలాడుతుంది.
నా గొంతు కోసి నువ్వు నన్ను వేరు చేసిన వేళ,
ఆ గిల్లిన గాయానికి తట్టుకోలేక అడుగుతున్నా.
చెప్పు...
నీ మోమును నా అందము చాటున ఆకర్షించుటకా...?
నేను సుగంధాలు పంచినందుకా ఈ శిక్ష... ?
నీవు జడను,గోడను నాతో అలంకరిస్తే
జడలో నేను నలిగి పోతాను,
గోడన నేను ఎండిపోతాను,
క్షణకాలపు నీ సంతోషం కోసం నా ప్రాణాలు గిల్లేస్తావా ...? నీవు అంత దయలేని వానివా...?
కడాన జాలువారే కన్నీటితో, ఆవేదనతో భరించలేక నిను అడిగిన క్షణాన,
నీవు నన్ను హింసించడానికి కోయలేదని,
నన్ను భగవంతుడి పాదాల చెంతకు చేరుస్తున్నానని చెబుతూ,
ఈ వేదన, విలాపం మరణ భయం విడిచి, బాధను భరిస్తే
పుణ్యక్షేత్ర ప్రయాణమంటివి.
నేను పూజకు అర్హమౌతానంటివి.
నన్ను కోసి దేవుని పాదాలపై వేసి నీవు కోరుకున్నది కూడా ముక్తి నిచ్చె మోక్ష మార్గమే కదా...
నిను కలవని నా జీవిత గమ్యం కూడా ఆ ముక్తి కోసమే కదా.
నను దేవుని చెంత చేర్చే మోక్ష యాత్ర ఇదే అని,
దేవుడిని చేరడమే నా భాగ్యమని సర్దిచెప్పుకుని,నా బాధను దిగమునుకున్నాను.
పుట్టుక ఒక భ్రమ, బ్రతుకంతా ఒక నాటకం,
కాల గమనంలో ఏదీ శాశ్వతం కాదు,
సృష్టి నియమాన్ని ఎవ్వరూ మార్చలేరు .
కాలం అనే నదిలో కొట్టుకుపోయే ఆకులు మనం అని తెలుసు,
కర్మ అనే త్రాటితో కట్టబడిన బొమ్మలం మనము అని కూడా తెలుసు,
వచ్చింది ఒంటరిగానే, పోయేది ఒంటరిగానే...
మధ్యలో ఈ జగమంతా ఆ మాయావి సృష్టించిన లీలలే అని తెలిసిన నాడు,
అహంకారాన్ని వీడి, మమకారాన్ని దాటి,
ఆ సృష్టికర్త చెంత చేరి ధన్యత పొంది
ఆ పరమేశ్వరునిలో లీనమవడమే కదా మన జన్మ సార్థకత.
( పువ్వులను కోసి వృథా చేయకు,
చెట్టున ఉండే పువ్వు అందాన్ని చూసి ఆహ్లాదంతో ఆనందించండి.)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి