వృద్ధుడా? పసిపిల్లవాడా? : - అనురాధ బొడ్ల (సముద్రాల)- 9989566696
 

ఈ రోజు సాయంత్రం ఆరవుతుండగా వాకింగ్ కోసం కిందికి దిగాను. రెండు మూడు రోజులుగా ఉన్న ముసురు తగ్గి  వాతావరణం పొడిగానే ఉంది. ఒక పెద్ద రౌండే వేసేద్దాం ఇవాళ, అనుకుంటూ పై బ్లాక్స్ వేపు నడక సాగించాను. మా కమ్యునిటీలో అన్ని బ్లాకుల చుట్టూ తిరుగాలంటే రెండు ర్యాంప్స్ ఎక్కాలి, రెండు ర్యాంప్స్ దిగాలి. అలా సాయంత్రం వ్యాహ్యాలి కై తిరుగుతున్న వాళ్ళని అక్కడక్కడా బెంచీల మీద కబుర్లలో ఉన్న జనాలనీ చూస్తూ నడుస్తున్నా. 
రెండవ ర్యాంప్ ఎక్కుతుండగా పైన ఒక పెద్ద వయసు వ్యక్తి కనపడ్డారు. మరీ పెద్దవారు కాదేమో, కానీ కొంచెం బొద్దుగా ఉన్నారు. ఈ మధ్య ఏదైనా సర్జరీ  అయిందేమో ఒక వాకింగ్ స్టిక్ పట్టుకున్నారు, కాలు కొంచెం ఎత్తి వేస్తూ నడుస్తున్నారు. అక్కడ వాక్ ఏరియా పక్కన కొంచెం ఎత్తు ప్లాట్ఫామ్ మీద బెంచెస్ ఉంటాయి. బహుశా కాసేపు కూర్చోవాలనిపించిందేమో, అలా నడుస్తూ ముందుకి వచ్చి, ఆ ఎత్తు ప్లాట్ఫామ్ పైకి ఎక్కటానికి ప్రయత్నించడం కనపడింది. వాకింగ్ స్టిక్ సాయంతో కాసేపు, అక్కడే ఉన్న ఎమర్జెన్సీ ఫైర్ హైడ్రంట్ పైప్ ని పట్టుకుని కాసేపు, ఎక్కటానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆయన ప్రయత్నాలను  చూస్తూ నేను ర్యాంప్ ఎక్కి పైకి వచ్చాను. 
పైకి ఎక్కలేక పోతున్నట్టున్నారు. నేను సాయం చేద్దునా, అనుకున్నాను. అంతలోనే, అమ్మో, నేను చెయ్యగలనా? అనుకున్నాను. నా శక్తికి, నేను తనకి సహాయం చెయ్యాలనుకోవటం సాహసమేమో! నా మనసులో డౌటుగానే ఉండింది. అయినా దగ్గరగా రాగానే ఊరుకోలేకపోయాను. 
“హెల్ప్ చెయ్యమంటారా అండీ?” అని అడిగాను.
“అబ్బే, లేదమ్మా, అక్కరలేదు,” అంటూ ఆయన తన వాకింగ్ స్టిక్ చేతిలోకి తీసుకుని, పక్కకి నడిచారు.  పైకి ఎక్కే ప్రయత్నాన్ని ఇక విరమించుకున్నట్టున్నారు, అనుకున్నా. సరే, తనకి అలవాటే కావచ్చు. మ్యానేజ్ చేసుకోగలరేమోలే! లేదా మరో పక్క కూర్చుంటారేమోలే, అనుకుంటూ అక్కడినుంచి ముందుకి నడిచాను. 
నిజానికి కమ్యునిటీలో, అక్కడక్కడా బెంచీలు ఉన్న దగ్గర ఒక పలక లాటి మెట్టు పరచి ఉంది. సీనియర్ సిటిజెన్స్ సౌకర్యార్ధం అలాటి చాలా సౌకర్యాలు ఉన్నాయి, మా కమ్యునిటీలో. మరి, ఆ మెట్టు లేని దగ్గర ఎక్కటానికి ఆయన ఎందుకు ప్రయత్నిస్తున్నారో మరి! లేదూ, తను ఏదైనా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ లాటివి  చేసుకుంటుంటే, నేను పొరపడ్డానా! కాదులే ఎక్కే ప్రయత్నం స్పష్టంగా కనపడిందిగా! ఒకవేళ, తను ఎక్కగలనో లేదో అని పరిక్షించుకుంటున్నారా? ఏమో మరి! 
ఇలాటి ఆలోచనలతో కొంత దూరం నడిచాక,  ప్లేగ్రౌండ్ దగ్గరికి వచాను. కొంతమంది పిల్లలు ఆ గ్రౌండ్స్ లో ఆడుకుంటూ ఉన్నారు. అయితే, ఆ గ్రౌండ్ లోని ఆటలు కాకుండా, గ్రౌండ్ బయట జరుగుతున్న ఒక ముచ్చటైన దృశ్యం నన్ను ఆకర్షించింది. 
నాకు కొంత దూరంలో ఉన్న ప్లే గ్రౌండ్ ఎదురుగా కొన్ని బెంచీలు ఉన్నాయి. ఆ బెంచీల దగ్గర, ఒక తల్లి, ఒక సంవత్సరంన్నర పిల్లవాడు ఉన్నారు. పిల్లవాడు ఆ గట్టు పైకి ఎక్కటానికి ప్రయత్నిస్తున్నాడు. తల్లి తన చెయ్యి అందిస్తూ ఉంటే, ఆ పిల్లాడు ఆ చేతిని తోసేస్తూ ఉన్నాడు.  ఆ గట్టు ఎక్కే ప్రయత్నంలో రెండు మూడు సార్లు పడబోయాడు. అయినా తన ప్రయత్నం ఆపకుండా, మొత్తానికి వాడు పైకి ఎక్కేసాడు.
అలా పైకి ఎక్కగానే, తల్లిని చూస్తూ తన నోరంతా తెరుచుకుని నవ్వుతూ, తనకు తానే చప్పట్లు కొట్టుకున్నాడు. ఆ తల్లి కూడా వాడి భుజం తట్టి, వాడి చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ వెళ్ళి బెంచీ మీద కూర్చుని, వాడినీ పక్కన కూర్చోపెట్టుకుంది. ఇద్దరూ గ్రౌండ్ లో జరిగే ఆటలు చూడటంలో మునిగిపోయారు. 
అప్పుడు గుర్తు వచ్చింది నాకు, నేనూ నా నడక మర్చిపోయి, వాడిని చూడటంలో మునిగి పోయానని. భలే, అని అనుకుంటూ, అటు పిల్లాడి ముచ్చటకీ, ఇటు నా మతిమరుపుకీ నవ్వుకుంటూ ముందుకి నడిచాను.  
అలా నవ్వుకుంటూ ముందుకు నడుస్తున్న నాకు మనసులో టక్కున ఏదో ప్రశ్న తట్టి, వెనకకు తిరిగాను. కాసేపటి క్రితం ఆ పెద్దాయనను చూసిన దగ్గరికి నడిచాను. 
ఆయన ఏ బెంచీ దగ్గర అయితే ఎక్కే ప్రయత్నం చేసారో,  అదే బెంచీ మీద కూర్చుని, తన వాకింగ్ స్టిక్ ని తడుముతూ, పక్కనున్న వారితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఈయన వృద్ధుడా? పసిపిల్లవాడా? ఆనందంతో కూడిన ఒక నవ్వు  నా పెదవులపై వెలిగింది. 
మనిషికి వయసుతో పనేముంది. పసిపిల్లల దగ్గరినుంచి పెద్దవాళ్ళ వరకు, ఎవరయినా తమకు తాముగా నిలబడాలి, నిలదొక్కుకోవాలి అనుకుంటారు. తప్పనిసరి అయితే తప్ప, మరొకరిమీద ఆధారపడటం ఎవరికీ ఇష్టముండదు. అయినా, వృద్ధులూ, బాలలూ సమానమేగా!  
అక్కడ ఆ బాలుడూ, ఇక్కడ ఈ బాలుడూ ఇద్దరూ విజేతలే! అనుకుంటూ ముందుకి నడిచాను.
కామెంట్‌లు
Popular posts
ఈ కబుర్ల పేరేంటో?: అనురాధ బొడ్ల (సముద్రాల)-9989566696
చిత్రం
ఏది డ్యూటీ? : -అనురాధ బొడ్ల (సముద్రాల)-9989566696
చిత్రం
తప్పూ మంచిదేనేమో!: - అనురాధ బొడ్ల (సముద్రాల)-9989566696
చిత్రం
సుమతీ శతకం ౪౫(45)వ పద్యం. తల మాసిన నొలు మాసిన ఒలువలు మాసినను బ్రాణ వల్లభునైనన్ గులకాంతలైన రోఁతురు దిలకింపఁగ భూమిలోన దిరముగ సుమతీ! తా : ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ .... ఈ ప్రపపంచంలో, భర్త ఎంత అందగాడు ఐనా, తైల సంస్కారం లేని జుత్తుతో, శుభ్రం చేసుకోని దేహంతో, మాసిపోయి, దుర్గంధం వెదజల్లతున్న వస్త్రాలతో వుంటే కులస్త్రీలు కూడా ఆతనిని చూడటానికి ఇష్టపడరు. ఇది నిజంగా నిజము............. ....అని సుమతీ శతకకారుని వాక్కు. *ఈ పాంచ భౌతికమైన ప్రపంచంలో, నిత్యము, సత్యము ఐన ఆత్మ సౌందర్యం కంటే అనిత్యము, అసత్యము ఐన బాహ్య సౌందర్యానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతోంది.* *కానీ ప్రతి ఒక్కరూ, తమలోనే వున్న నేనుతో పరిచయం చెసుకుని, పెంచుకుని, పరమాత్ముని తో స్నేహం చేస్తూ ప్రయాణం చేయాలని భావం.* ....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం
ఆదర్శ ఉపాధ్యాయుడు: శరణ్య. నేను 8వ తరగతి . .ఎడపల్లి, నిజామాబాద్ జిల్లా.
చిత్రం