ఈ రోజు సాయంత్రం ఆరు అవుతుండగా వచ్చాను వాకింగ్ కి. ప్రతి చోటా జనాలు చిన్న చిన్న గుంపులుగా కూర్చుని సాయంత్రం కబుర్లు చెప్పుకుంటున్నారు. పూలమ్మే అమ్మాయి రకరకాల పూలతో సిద్ధంగా కూర్చుని, పూలు కావలసిన వాళ్ళకి, పూలు పొట్లం కట్టి ఇస్తూ ఉంది. అక్కడక్కడా చెదురుమదురుగా ఒకరూ, ఇద్దరూ వాకింగ్ కార్యక్రమంలో ఉన్నారు. సౌత్ వైపు తిరగగానే గాలి చల్లగా తగిలింది. అబ్బ, ఇక్కడ హాయిగా ఉంది. ఇక్కడే పైకి క్రిందికీ నడుద్దాం కదా! అనుకుని, చకచకా నడుస్తూనే సాయంత్రం వేళ కదా, ఫ్రెండ్స్ ఎవరేనా కనిపిస్తారేమో అని చూస్తూ నడుస్తున్నా.
ఈ లోగా నా దృష్టి ఆ చివరగా ఉన్న ఒక సెక్యురిటీ గార్డ్ మీద పడింది. (మా కమ్యునిటీ అంతా అక్కడక్కడా సెక్యూరిటి గార్డ్స్ ఉంటారు.) అతని ప్రవర్తన కొంత వింతగా అనిపించింది. చేతులు నలుపుకుంటూ, తల గోక్కుంటూ, మాటిమాటికీ ఫోన్ జేబులోంచి తీసి మళ్ళీ లోపల పెట్టుకుంటూ కనిపించాడు. ఏంటీ ఈ అబ్బాయి? ఏదైనా టెన్షన్లో ఉన్నాడా? వాళ్ళ ఫ్యామిలీలో ఏదన్నా సమస్యా? ఏమో ఎవరి సమస్యలేంటో!
ఇంతలో అతను ఎవరికో చెయ్యి ఊపటం కనిపించింది. ఎవరా అని చూశా. దూరంగా ఉన్న మరొక సెక్యురిటీ గార్డ్ ఇతనికి చెయ్యి ఊపుతూ కనిపించాడు. ఇతని వేపు మళ్ళీ చూశా. ముఖంలో కాస్త నవ్వు కనిపించింది. అయితే టెన్షన్ పడే విషయం ఏం లేదన్నమాట. మరేంటి? మ్...మ్...మ్.., బోరు కొడుతుందేమో!
అవును కదా, దాదాపు పది గంటలు అలా ఊరికే నిల్చుని ఉండాలి. ఫోన్ కూడా వాడకూడదనుకుంటా. లేదూ ఫోన్ చార్జింగ్ అయిపోయిందా? ఫోన్ చార్జింగ్ అయిపోతే ఇవాళ అందరికీ ఎంత టెన్షన్ అని నవ్వుకున్నా. ఎంతయినా, ఇది బోరింగ్ జాబే! పాపం ఎలా చేస్తారో ఏమో! ఎహె, నువ్వు మరీ వింతగా ఆలోచిస్తున్నావు అనూ! ఊరికే నిల్చోవటమేంటి? వాళ్ళు చాలా అలర్ట్ గా చుట్టూ చూస్తూ అందరినీ గమనిస్తూ ఉండాలి. అది వాళ్ళ ఉద్యోగం. వాళ్లు ఫోన్లు చూస్తూ కూర్చుంటే, ఇక సెక్యూరిటీ మాటేంటి? నిజమేలే!
ఇలా అనుకుంటూ నడుస్తూ ఉండగా, ఇటువేపు ఉన్న గార్డ్ అటు, అటువేపు ఉన్న గార్డ్ ఇటూ, మెల్లిగా నడుస్తూ మధ్యలో కలుసుకున్నారు. ఒక అరనిమిషం, దగ్గరగా నిల్చుని, చేతులు కలుపుకుని, ఏదో మాట్లాడుకుని మళ్ళీ వాళ్ళ స్థానాలకు వాళ్ళు వెళ్ళారు. నేను మరొక సారి అటూ ఇటూ నడిచేసరికి వాళ్ళు మళ్ళీ కలుసుకున్నారు. మళ్ళీ విడిపోయారు.
అలా నా రౌండ్ల తో పాటు వాళ్లూ పది నిమిషాల్లో నాలుగు సార్లు కలుసుకున్నారు, విడిపోయారు. వాళ్ళ బోర్ ని విదిలించేస్తూ, వాళ్ళు అందులో ఊరట వెతుక్కుంటున్నారా? ఎవరి ఐడియాలు వారివి. సరే! మంచిదే! కానీ ఇన్నిసార్లా? వాళ్ళ డ్యూటీ మాటేంటి. వాళ్ళు డ్యూటీ చేస్తున్నట్టా, లేదన్నట్టా? వాళ్ళు, వాళ్ళు కబుర్లు చెప్పుకుంటే వాళ్ళ పరిశీలన ఏం కావాలి?
ఎవరికయినా కంప్లెయింట్ చెయ్యాలా? ఎందుకులే పాపం, ఎవరిదయినా ఉద్యోగమేగా! అప్పుడప్పుడూ బ్రేకులు కావాలి కదా ఎవరికయినా? అయినా, ఇప్పుడంత కొంప మునిగిందేముందిలే. అదంతా చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారులే. అలా కాదూ, ఎవరికేనా కొంచెం చెబితే బాగుంటుందేమో!
అలా అనుకుంటూ ఫోన్ తీసాను టైం చూద్దామని. ఫోన్ స్క్రీన్ పైన, క్లాక్ లో పెద్దముల్లు, చిన్నముల్లు ఒకే దగ్గర ఉన్నాయి, టైం 6.32 సూచిస్తూ.
వెంటనే మనసులో ఒక ఆలోచన తట్టింది. ఏది డ్యూటీ? ఈ రెండు ముళ్లూ రోజుకి 22సార్లు కలుసుకుంటాయట! మరి…, అవి వాటి డ్యూటీ అవి సరిగ్గా చెయ్యవా?...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి