ఈ కబుర్ల పేరేంటో?: అనురాధ బొడ్ల (సముద్రాల)-9989566696


 ఈ రోజు కొంచెం ఆలస్యంగా లేచాను. అందుకే వాకింగ్ కి రావటం కూడ కాస్త ఆలస్యమయింది. ఆలస్యమయినా ఎండ అంత చిటపటగా ఏం లేదు. కానీ, అలా చుట్టూ చూస్తూ నడుస్తుంటే జనాలు ఎక్కువగా కనిపించలేదు. ఓహో! అందరూ అప్పుడే వాకింగ్ ముగించుకుని వెళ్ళిపోయారా అనుకుంటూ నడుస్తున్నాను. అక్కడ ఒక షల్టర్ కింద ఏడెనిమిది మంది సీనియర్ సిటిజన్స్, మగవాళ్ళే, బెంచీల మీద కూర్చున్నారు. బహుశా వాకింగ్ ముగించుకుని అందరూ అక్కడ  సేదదీరుతున్నట్టున్నారు. నీడగా ఉందని అక్కడికి దగ్గరలోనే అటూ ఇటూ నడుస్తున్నాను. ఆ సీనియర్లు అందరూ ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారు, ఒక్కసారిగా అందరూ పెద్దగా నవ్వారు. ఎవరో ఏదో జోకేసి ఉంటారు. 
అవునూ, అసలు ఇలా నలుగురు మగవాళ్ళు కలిస్తే ఏం మాట్లాడుకుంటారు? సర్లే అదేం ప్రశ్న? నలుగురు ఆడవాళ్ళు కలిస్తే మాత్రం ఏం మాట్లాడు కుంటారు? ఎవరి ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు కదా! వీళ్ళూ పెద్దవాళ్ళే కదా ఏదో ఆరోగ్యాలూ, బాదరబందీలు చెప్పుకుంటారు కావచ్చు. 
అలా కాదూ… ఆడవాళ్ళు కలిస్తే ఏముంటాయి అమ్మలక్కల కబుర్లు తప్ప అని ఈ మగవాళ్ళు ఎద్దేవా చేస్తుంటారు కదా! మరి వీళ్ళు కలిస్తే, అయ్యవార్ల కబుర్లు అనాలా? అబ్బే ఈ పేరు కుదరదు గా. అర్దం మారిపోతుంది. మరి ఏం పేరు పెట్టొచ్చు?
సరే, కాసేపు వీళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో విని అప్పుడు ఆలోచిద్దాం వీళ్ళకి ఏం పేరు పెట్టాలో, అనుకుని నాలో నేనే నవ్వుకుంటూ ఒక చెవి అటు వేసా. 
ఏయ్, చాటుగా వినటం తప్పు కదా అనూ! అని చెప్పింది మనసు. అబ్బే, నేనేమీ రహస్యంగా వినటం లేదుగా. అవే అలా గాలికి వినబడుతున్నాయి. అయినా ఇద్దరు మాట్లాడుకుంటే  పర్సనల్, పదిమంది బహిరంగంగా మాట్లడుకుంటే ఇందులో చాటు మాటు అనేది ఏముంది? అన్నీ ఓపెన్ సీక్రెట్సే! 
స్పష్టంగా అన్నీ వినపడకపోయినా, గాలివాటుగా వినపడ్డ కొన్ని మాటలు…. ఈ ట్రంపుగారు రోజొక ప్రకటన చేస్తున్నాడు గా అని ఒకరు అంటే, ఈ ఇరాన్ తో యుద్దం ఇప్పుడప్పుడే  ముగిసేలా లేదు అని మరొకరు, హార్మూజ్ జలసంధిని ఇరాన్ ఎలా వదులుకుంటుంది? అని మరొకరు. ఇవి వినగానే, వీళ్ళు సీనియర్ సిటిజన్లు కదా ఏదో పెన్షన్లు, బీపీలు అంటూ ఏవో బాదరబందీలు మాట్లాడుకుంటారనుకున్నాను. పర్లేదు ప్రపంచ రాజకీయాలు మాట్లాడు కుంటున్నారు. 
        హుఫ్.. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, ఎవరు ఏది చూస్తారో అదే మాట్లడుకుంటారు. ఆడవాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తే వీళ్ళు పొద్దున లేస్తే వార్తా పేపర్ల లోకి, టీవీల్లో వార్తల్లోకి తలపెట్టి చూస్తారు మరి. వాళ్ళు ఇరుగూ పొరుగూ గురించి మాట్లాడుకుంటే, వీళ్ళు ఇరుగు పొరుగు దేశాల గురించి మాట్లాడుకుంటున్నారు. 
వాటిని అమ్మలక్కల కబుర్లంటే, వీటిని అయ్యన్నల కబుర్లు అనొచ్చేమో….!
కామెంట్‌లు