ఎందుకు వదిలేసారబ్బా?: - అనురాధ బొడ్ల (సముద్రాల)-9989566696
 

రోజూలాగే ఈ రోజు సాయంత్రం వాకింగ్ కోసం కిందికి దిగాను. వాతావరణం కాస్త మబ్బుగా ఉంది. వాతావరణం లాగే మూడ్ కూడా కొంచెం డల్ గా ఉంది. కానీ పర్లేదు, అంతా స్టార్టింగ్ ట్రబులే. చుట్టూ నడుస్తున్న వాళ్ళని చూస్తూ చూస్తూ కాసేపట్లోనే  నడక వేగం పెరిగింది. సాయంత్రం సమయం కదా, చాలా మంది పిల్లలు అటూ ఇటూ పరిగెడుతూ ఆడుకుంటున్నారు. కొంతమంది పిల్లలు వాళ్ళ కిక్ స్కూటర్ల మీద రయ్యిన తిరుగుతున్నారు. 
     వాళ్ళు ఆ స్కూటర్స్ మీద వెళ్తూనో, వస్తూనో ఉన్నారంటే, మనం చాలా జాగ్రత్తగా తప్పుకుని నడవాల్సిందే. లేకపోతే, వాళ్ళు డ్యాష్ ఇచ్చి, మనం పడిపోవటం జరిగితే, ఇంక అంతే సంగతులు. అలా వాళ్ళ దారిలోకి రాకుండా జాగ్రత్తపడుతూ, వాళ్ళ ఉత్సాహాన్ని చూస్తూ నడుస్తున్న నా దృష్టి, పవర్ జనరేటర్ గ్రిడ్ కి మూలగా పెట్టి ఉన్న ఒక పసుపుపచ్చ రంగు కిక్ స్కూటర్ పై పడింది. 
ఈ స్కూటర్ ఒక నాలుగయిదు రోజులుగా ఈ చుట్టుపక్కలే వదిలేసి కనిపిస్తుంది. మొదటిరోజు పిల్లలెవరో ఆడుకుంటూ, ఆడుకుంటూ దాన్ని పక్కన పెట్టి మాట్లాడుకుంటున్నారేమోలే అనుకున్నా. రెండో రోజు ఎవరో మర్చిపోయినట్టున్నారు అనుకున్నా. మూడోరోజు, ఇదేంటి అదే స్కూటర్ మళ్ళీ కనిపిస్తుంది అనుకున్నా. ఆ తరువాత కూడా రెండు మూడు సార్లు మళ్ళీ కనపడింది అదే స్కూటర్, కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఇవాళ అలా ఆ మూలకు పడేసి ఉండటంతో, నా ఆలోచన మళ్ళీ దానిపై పడింది. 
మా కమ్యూనిటీలో ఎప్పుడూ పిల్లలూ, పెద్దలూ సైకిళ్ళు, స్కూటర్లు, కళ్ళద్దాలు, ATM కార్డులు, ఏదో ఒకటి అక్కడక్కడా మర్చిపోతుంటారు. అవి గమనించిన వాళ్ళు వాటి ఫోటోలు తీసి వాట్స్ ఆప్ లో కమ్యునిటి గ్రూపులలో మెసేజీలు పెడుతూ ఉంటారు. అది ఫలానా దగ్గర దొరికిందనీ, దాన్ని వాళ్ళ దగ్గర కానీ, ఎఫ్.ఎం ఆఫీసులో కానీ కలెక్ట్ చేసుకోమని చెపుతూ ఉంటారు.  ఒక్కోసారి ఆడుకోవటానికి వచ్చిన చిన్న పిల్లలు వాళ్ళ బ్లాక్, ఫ్లాట్ నంబర్లు మర్చిపోయి కూడా ఏడ్చేస్తూ ఉంటారు. అలాటి వాళ్ళ ఫోటొలూ వచ్చేస్తుంటాయి. మళ్లీ వాళ్ళ ఇంటికి వాళ్ళు చేరుకున్నారు అనే మేసేజీలు కూడా వస్తుంటాయి. ఇక్కడ ఒక సెక్యూర్డ్ సరిహద్దులలో ఉండడం వల్ల ఏది పోయినా సాధారణంగా వెంటనే దొరికేస్తూ ఉంటుంది. పెద్దగా భయం ఉండదు. 
మరి ఈ స్కూటర్ ఎందుకు ఇన్నిసార్లు కనిపిస్తుంది. ఆ అబ్బాయో, అమ్మాయో, ఎవరో కానీ కాస్త హడావిడి రాయుళ్ళు అయ్యుంటారు. తరచుగా మర్చిపోతున్నారా! భలేదానివి అనూ, అలా అయితే, రోజూ దారి పక్కగా కనిపించేది ఇవ్వాళ ఆ మూలగా కనిపిస్తుంది. ఎందుకంటావు? నిజమే, అలా ఎందుకు వదిలేసారబ్బా! వదిలేసినట్టు కూడా లేదు. దాన్ని అలా పడేసి వెళ్ళిపోయినట్టు ఉంది, అని అనుకుంటూ ఉండగా ఎప్పుడో చదివిన ఒక సంఘటన గుర్తొచ్చింది. 
ఇది వాట్స్ ఆప్  మొదలయిన కొత్తలో అనుకుంటా. ఒకసారి వాట్స్ ఆప్ లో, ఎవరో వాళ్ళ పదేళ్ళ అబ్బాయి కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడనీ, కనపడితే ఫలానా అడ్రస్సుకి తీసుకు రావల్సిందిగా ఒక మెసేజ్ తో పాటు ఆ అబ్బాయి ఫోటో కూడా పెట్టగా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాట్స్ ఆప్ కొత్త కదా, ఆ వార్త కనపడ్డ ప్రతివాళ్ళూ ఫార్వార్డ్ చేస్తూనే ఉండినారు. ఆ తరువాత దాని గురించి మరొక వార్త వచ్చింది. ఆదేంటంటే, నిజానికి, ఆ పిల్లాడు తెల్లవారే ఇంటికి వచ్చేసాడట. అయినా ఆ మొదటి మెసేజ్ అలా ఫార్వార్డ్ అవుతూనే ఉండింది. దాంతో జనాలు వాడు ఎక్కడ కనపడ్డా బలవంతంగా ఎత్తుకొచ్చి వాళ్ళ ఇంట్లో వదిలేయటం మొదలుపెట్టారట. “అయ్యా, బాబూ! నేను పారిపోలేదు! నన్ను ఆడుకోనివ్వండి!” అంటూ వాడు మొత్తుకుంటున్నా కూడా వినలేదట. 
అలా తీసుకొచ్చిన ఒకరు, “ఏంటండీ తప్పిపోయిన మీ అబ్బాయిని మేం కష్టపడి తీసుకొస్తే కనీసం మాకు థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు మీరు,” అని అనగా…., “వీడిని తిరిగి తీసుకొచ్చిన వాళ్ళలో మీ నంబరు ఇరవయిరెండు” అన్నాడంట వాళ్ళ నాన్న నిర్లిప్తంగా. 
 ఈ సంఘటన గుర్తొచ్చి, అప్పుడు ఆ వ్యక్తి ముఖం ఎలా ఉండి ఉండొచ్చు అని ఊహించుకుంటూ,  నేను నవ్వుకుంటూ ఉండగా…, ఆ నవ్వు వెనకే, ఈ స్కూటర్ గురించిన ఒక చిలిపి ఆలోచన వచ్చి, పెదవులు మరింత నవ్వుతో విచ్చుకున్నాయి. 
ఆ అబ్బాయో, అమ్మాయో, కావాలనే ఈ స్కూటర్ ని ఇలా  వదిలేస్తున్నారా? బద్దకస్తులయితే ఎవరో ఒకరు అలాగే తీసుకొస్తారులే అనో….  లేదా కొత్తది కావాలనో…!
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Bavundandi
అజ్ఞాత చెప్పారు…
Nice mam👌👌
అజ్ఞాత చెప్పారు…
ఆ రెండు కారణాలు కాక, కొత్తది స్వంతం అయినందుకు పాతది అలా నిర్లక్ష్యం గా వదిలేసి ఉండొచ్చు. ఆలోచిస్తే చాలానే కారణాలు తడ్తాయి ఈ పని లేని మనసు కి.