భాష భావము మార్చునా…?: - అనురాధ బొడ్ల (సముద్రాల)-9989566696


 ఈ రోజు నా స్నేహితురాలి ఇంటికి వచ్చాను. వాళ్ల ఇల్లు కూడ కొత్తగా అయిన ఒక చిన్న గేటెడ్ కమ్యునిటీలో ఉంది. సాయంత్రం చాయ్ పనులు ముగించుకుని, ఆ కమ్యునిటీలో ఒక చిన్నపాటి  వాక్ వేసేద్దాం అనుకుని ఇద్దరం కిందికి వెళ్లాము.  
 అక్కడ ఉన్న ప్లే జోన్, ఓపెన్ జిమ్, చిన్న ఫుడ్ స్టాల్, అన్నీ చూస్తూ నడుస్తుండగా, వెనుకవేపు ఒక దగ్గర, చాలామంది గుమిగూడి ఉన్నారు. అరుపులూ వినపడుతున్నాయి. ఏదో గొడవ జరుగుతున్నట్టుంది! అనుకుంటూ మేమూ అటు వెళ్ళాము. 
ఒక డెబ్బై ఏళ్ళ పెద్దాయన ఒక నలభై ఏళ్ళ అతనూ వాదులాడుకుంటున్నారు. చుట్టూ కొంతమంది సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 
“మీరు పెద్దవారు, అలా బ్యాడ్ వర్డ్స్ అనటం తప్పు,” అంటున్నాడు అతను.
“నేనేం బ్యాడ్ వర్డ్స్ వాడానయ్యా, ‘బుద్ది లేదు’ అనే కదా అన్నాను,” అంటున్నాడు ఆ పెద్దాయన. 
“అదిగో మళ్లీ అదే మాట వాడుతున్నారు,” అన్నాడు అతను. 
“ఇంకేం చెప్పమంటారండీ, సారీ కూడా చెప్పాను” అంటూ నిస్సహాయంగా చూసాడు ఆ పెద్దాయన పక్కనున్న వాళ్లవేపు. 
ఇంతకీ ఏం జరిగింది అని అక్కడ కనుక్కుంటే , అతను సమోసా తింటూ నడుస్తూ ఉండగా, అతని చేతిలోని, పేపర్ ప్లేట్ కింద పడింది. అతను, “పొరపాటుగా పడింది, సారీ,” అని చెప్పే లోపలే, అతని వెనకే వస్తున్న పెద్దమనిషి మీద కాస్త కర్రీ పడటంతో, ‘బుద్దిలేదు’ అనేశాడంట. అంత మాట అంటాడా నన్ను అని గొడవ మొదలయిందట. 
అలా వాళ్లు వాదులాడుకుంటూ ఉండగా, ఒక ఏడెనిమిదేళ్ల పిల్లవాడు వచ్చి, ‘అంకుల్, అంకుల్’ అంటూ అతన్ని పిలుస్తున్నాడు. అతను వినిపించుకోక పోతే ఆ పిల్లవాడు మళ్లీ మళ్లీ పిలిచాడు. 
“ఏంట్రా, ఇక్కడ మాట్లాడుతున్నా కదా!  సెన్స్ లేదు, కొంచెం కూడా!” అంటూ ఆ అబ్బాయి మీద విసుక్కున్నాడు. 
“మీ పాప కింద పడింది, అంకుల్! ఏడుస్తుంది,” అని చెప్పాడు ఆ అబ్బాయి. “అవునా, అయ్యో,” అంటూ పరిగెత్తాడు ఆ మనిషి. 
  “చూడండయ్యా, అతను వాడిన పదం ఏంటి?  ‘సెన్స్ లేదు!’ నేను ‘బుద్ది లేదు!’ అంటే బూతయింది!” అంటూ ఆ పెద్దమనిషి గొణుక్కుంటూ వెళ్లాడు. 
ఆ మాటలకి మేమిద్దరం కాసేపు అయ్యో అనుకుని, వేరే కబుర్లేవో చెప్పుకుంటూ తిరిగాం కాసేపు. ఇక అక్కడినుంచి ఆటోలో ఇంటికి బయలుదేరినప్పుడు, మనసు మళ్లీ ఆ గొడవ దారికి వెళ్లి,  ‘సెన్స్ లేదు!’ ‘బుద్ది లేదు!’ అన్న పదాల దగ్గర ఆగింది. రెండూ ఒకటేగా? కాదా?
   ఇలా ఆలోచిస్తుంటే నా పెళ్ళయిన కొత్తలో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది. మా ఊరిలో, శ్రావణ మంగళవారాలూ, శుక్రవారాలూ, ముత్తైదువలు ఒకరింటికి ఒకరు వెళ్లి పసుపు బొట్టు ఇచ్చుకునేవారు. ఒకసారి, ఒక పెద్దావిడ, నాకు పసుపు ఇస్తూ, “కాళ్లకి పసుపు రాస్తా,” అన్నది. ఆరోజు నేను ఒక తెల్ల చీర కట్టుకుని ఉన్నాను. “కాళ్లకి వద్దులే పెద్దమ్మా, చీర పాడయితది,” అన్నా! ఆమె వెంటనే గుడ్లురిమి చూస్తూ, “అట్ల పాడయితది అనొద్దు!” అన్నది గట్టిగా. “అంటే… తెల్ల చీర కదా అని…” కొంచెం గునుస్తూ సంజాయిషీ ఇవ్వబోతుంటే, “ఖరాబయితది అను’ కానీ ‘పాడయితది’ అనకు,” అనేసింది. నేను నోరు తెరిచేసాను. అదెలా…. అంటున్న మనసు నోరు నొక్కేసాను. 
  అలాగే, చిన్నప్పుడు మా అబ్బాయి, ఎవరేనా కోప్పడితే బాగా రియాక్ట్ అయ్యేవాడు. ఒకసారి మా నాన్న చెప్పాడు వాడికి, “ఒరేయ్, పెద్దవాళ్ల తిట్లు, పిల్లలకు దీవెనలు రా! ఉదాహరణకి, ‘వెధవ’ అంటే ‘వెయ్యేళ్లు ధనవంతుడవయి వర్ధిల్లు’ అని అర్ధం,” అని నవ్వుతూ చెప్పాడు. ఇక అప్పటి నుంచి ఏం తిట్టినా పట్టించుకునేవాడు కాదు. కానీ ఎవరేనా ‘సెన్స్ లేదు!’, అన్నారా, నానా యాగీ చేసేవాడు. ఆ మాటలో దీవెన లేదు అనుకునేవాడేమో మరి. 
     కొన్ని పదాలకు  డిక్షనరీ అర్ధాలు ఒకటే ఉండొచ్చు, కానీ వాడుకను బట్టి, మనిషికి ఆ భాషతో ఉన్న దగ్గరితనాన్ని బట్టి భావం మారుతుంది. ఆ భావాలను బట్టి, మన స్పందనలు ఉంటాయి. ఇంగ్లీషులో చెబితే తేలికగా అనిపించే కొన్ని మాటలు, తెలుగులో చెబితే మనసుకు చివుక్కుమనిపిస్తాయి. ఉదాహరణకి, మనని ఎవరేనా ‘లావయ్యావు’ అంటే కోపం వస్తుంది. అదే వెయిట్ గెయిన్ అయ్యావు అంటే అంత కోపం రాదేమో. అప్పుడు, భాష భావము మార్చునా…? అంటే అవుననే చెప్పాలేమో మరి! 
శంకరాభరణం సినిమాలో, ఒక సందర్భంలో శంకరశాస్త్రి, “ఆకలేసిన బాబు అమ్మా! అని ఒకలా అంటాడు, ఎదురుదెబ్బ తగిలిన బిడ్డ, అమ్మా ! అని మరొకలాగ అంటాడు….” అంటూ చెబుతారు. అది, ఒకే పదంలో సందర్భాన్ని బట్టి, మనం పలికించే భావ ప్రకటన. 
అయితే ఇక్కడ, ఒక పదానికి ఉన్న అసలైన అర్ధం కంటే, మన మనసులో దానికున్న అర్ధం బట్టే, మనం ఆ పదాన్ని వాడటమూ, స్వీకరించటమూ చేస్తాము. మనుషుల స్వీకరణని బట్టే స్పందన ఉంటుంది. 
పూర్వకాలంలో ‘కంపు’ అంటే ‘సుగంధం’ అని అర్ధం ఉండేదంట. ఇప్పుడా కంపు, ఇంపు కానిది అయింది. అదీ ఇలాటి వాడుకల నుంచే అయ్యుండొచ్చు, అని నవ్వుకున్నాను. ఈ ప్రకారం, భావమును బట్టే భాష అని కూడా అనొచ్చేమో! 
 ఇలా ఆటోలోనే నా మనసు చెప్పే కబుర్లు వింటూ ఉండగా, ఆటో గమ్యం చేరింది. ఆటోకి 190 అయింది. “దస్ రూపియా, హై క్యా భయ్యా?” అంటూ నేను రెండు వందల రూపాయల నోటు బయటకు తీసాను. అది తీసుకున్న ఆ అబ్బాయి, “భయ్యా ఏంటమ్మా, భయ్యా? చక్కగా తమ్ముడూ అనో, స్టైల్ గా బ్రో అనో అనొచ్చు కదా!” అని విసుక్కుంటూ , ఆటోని రయ్యిమంటూ ఉరికించాడు. 
“తమ్ముడూ! నా పది రూపా….” అంటున్న నా మాటలు ఆటో శబ్దంలో కలిసిపోయాయి.
కామెంట్‌లు